• తాజా వార్తలు
  •  

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మొబైల్ వాడుతున్నారో మీకు తెలుసా?

ఎవరి చేతిలో చూసినా మొబైల్.. అందులోనూ స్మార్టు మొబైల్. ప్రపంచ జనాభాలో మొబైల్ ఫోన్ వాడకం దార్ల సంఖ్య మూడింట రెండొంతులు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న యూజర్ల సంఖ్య దాదాపుగా 500 కోట్లకు చేరుకుందని జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్ అనే సంస్థ వెల్లడించింది. ఇది ప్రపంచ జనాభాలో సుమారు 66 శాతం కావడం విశేషం.
నాలుగేళ్లలో 100 కోట్లు
గత నాలుగేళ్ల కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 500 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లలో 55 శాతం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉండగా, అందులో భారత్, చైనాలే అత్యధిక మొబైల్ ఫోన్ యూజర్లను కలిగి ఉన్నాయి. ఈ దేశాలు రెండూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మొబైల్ యూజర్లను కలిగిన టాప్ రెండు దేశాలుగా నిలిచాయి.
ఇండియాలో 73 కోట్ల మంది..
భారత్‌లో ప్రస్తుతం 73 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నట్టు జీఎస్‌ఎంఏ వెల్లడించింది. దేశాలు, వాటి జనాభా పరంగా చూసుకుంటే యూరప్ దేశాల జనాభాలో 86 శాతం మందికి పైగా మొబైల్ ఫోన్లను వాడుతున్నారని జీఎస్‌ఎంఏ వెల్లడించింది. అతి తక్కువ మొబైల్ యూజర్లు ఆఫ్రికాలో ఉన్నారు. 2020వ సంవత్సరానికల్లా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడే వారి సంఖ్య 570 కోట్లకు పైగానే చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేస్తున్నది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న మొబైల్ యూజర్ల కన్నా 30 శాతం అధిక యూజర్లు 2020 వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు జీఎస్‌ఎంఏ భావిస్తున్నది.

జన రంజకమైన వార్తలు