• తాజా వార్తలు
  •  

ఏపీలో ఫిర్యాదుల పరిష్కారానికి మెగా టెక్నో ప్లాట్ ఫాం

ఏపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరడం లేదు. పైగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి... పథకాలలో లోపాలు ప్రభుత్వం దృష్టికి తేవడానికి సరైన, సులభమైన వేదిక లేదు. మరోవైపు ఫిర్యాదులు ఇస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి అధికారులు కానీ, పాలకులు కానీ వినే పరిస్థితి కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కారం, అభిప్రాయ సేకరణ కోసం అత్యాధునిక కాల్ సెంటర్ వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కైజాలా యాప్ లో కనెక్ట్ యువర్ సీఎం అనే సదుపాయం కల్పించారు. తాజాగా మరో కొత్త స్టెప్ వేశారు. మెగా కాల్ సెంటర్ పేరుతో రోజుకు 12 గంటలు సేవలందించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

మొత్తం 28 శాఖలను ఈ మెగా కాల్ సెంటర్లో ఇంటర్లింక్ చేస్తున్నారు. ఆయా శాఖలను ఈ కాల్ సెంటర్ తో అనుసంధానం చేశారు. ప్రజల నుంచి ఏదైనా అంశంపై ఫిర్యాదు రాగానే అది సంబంధిత శాఖకు బదిలీ చేస్తారు. దాన్ని పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. అదే విధంగా ఇతర మార్గాల్లో సేకరించిన మొబైల్ నంబర్ డాటాబేస్ కు రాండమ్ గా ఫోన్లు చేస్తూ పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. ఈ సదుపాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం విజయవాడలో ప్రారంభిస్తున్నారు.

కాగా ఈ మెగా కాల్ సెంటర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 1200 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారు. ఏపీ ప్రణాళికా సంఘం ఈ కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఎనాల్సిస్ చేస్తుంది కూడా. దీనికి సంబంధించి మొత్తం టెక్నికల్ సపోర్టును కార్వీ సంస్థ అందిస్తోంది.

జన రంజకమైన వార్తలు