• తాజా వార్తలు

విజయవాడ లో ముగిసిన డిజి ధన మేళా – ఒక విశ్లేషణ

భారత ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు నేపథ్యం లో దేశం లో నగదు రహిత లావాదేవీ లను పెంచడానికీ మరియు ప్రజలను ఆ దిశగా సమాయత్తం చేయడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా డిజి ధన మేళా లను నిర్వహిస్తుంది. ఈ మేళా లలో వివిధ రకాల బ్యాంకు లు, వాలెట్ కంపెనీలు స్టాల్ లు ఏర్పాటు చేసి సందర్శకులు డిజిటల్ లావాదేవీ లపై అవగాహన కల్పిస్తారు.  ఈ నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొట్టమొదటిసారిగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దిగి ధన మేళా జరిగింది. ఈ నెల 9 మరియు 10 తేదీ లలో ఉదయం 9 గంటల నుండీ రాత్రి 9 గంటల వరకూ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు లు ఈ కార్యక్రమాన్ని ప్ర్రారంభించారు. ఈ కార్యక్రమం గురించి ఒక విశ్లేషణ ను కంప్యూటర్ విజ్ఞానం ఈ ఆర్టికల్ లో అందిస్తుంది.

డిజి ధన మేళా – ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ

దాదాపు ప్రముఖ బ్యాంకు లన్నీ మరియు మొబైల్ వాలెట్ కంపెనీ లు ఈ కార్యక్రమం లో తమ తమ స్టాల్ లను ఏర్పాటు చేశాయి. మొత్తంమీద చూసుకుంటే ఇక్కడ జరిగిన ఈ ప్రదర్శన ను నాలుగు రకాలుగా విభజించవచ్చు.

బ్యాంకు లు.

దేశం లోని ప్రముఖ బ్యాంకు లైన SBI, ఆంధ్రా బ్యాంకు, IOB,పంజాబ్ నేషనల్ బ్యాంకు, HDFC బ్యాంకు మొదలైన బ్యాంకు లతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు బ్యాంకు లు తమ తమ స్టాల్ లను ఇక్కడ ఏర్పాటు చేశాయి. మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించడం ఎలా ? నగదు రహిత లావాదేవీ లను నిర్వహించడం ఎలా? AEPS ( ఆదార్ ఎనేబుల్డ్ పే మెంట్ సర్వీస్ ) ను ఎలా ఉపయోగించాలి తదితర అంశాల గురించి ఆయా బ్యాంకు ల సిబ్బంది సందర్శకులకు వివరించారు. వీటితో పాటు ఆయా బ్యాంకు ల యొక్క మొబైల్ యాప్ లు మరియు వాలెట్ ల గురించి కూడా వీరు వివరించారు.

వాలెట్ కంపెనీలు.

బ్యాంకు ల తర్వాత ఎక్కువ సంఖ్య లో కనిపించింది వాలెట్ కంపెనీలు. నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించడo అదికూడా వాలెట్ లను ఉపయోగించి అనే అంశం పై ఈ వాలెట్ కంపెనీ ల ప్రతినిధులు సందర్శకులకు వివరించారు. పే టిఎం, ఆక్సిజెన్, m- pesa లాంటి అనేకరకాల మొబైల్ వాలెట్ కంపెనీలు ఇక్కడ తమతమ స్టాల్ లను ఏర్పాటు చేశాయి.

ప్రభుత్వ విభాగాలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలూ ఇక్కడ తమ తమ స్టాల్ లను ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ శాఖలను డిజిటల్ ధన మేళా నేపథ్యం లో ఎలా అనుసంధానిస్తారు అని సందర్శకులుఅడిగినప్పుడు ఇక్కడి సిబ్బంది కొంచెం ఇబ్బంది పడడం గమనార్హం. మొక్కుబడిగా వీటిని పెట్టినట్లు చూస్తున్నవారికి ఇట్టే తెలిసిపోతుంది. ఒకటీ రెండు స్టాల్ ల మినహా మిగతావన్నీ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాబట్టే పెట్టినట్లు తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మీ సేవ మరియు పోలీసు వారి స్టాల్ ల గురించి. నేడు ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రతీదీ మీ సేవా లలోనే లభిస్తున్న పరిస్థితులలో మీ సేవా వారు ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. మీ సేవా లో ఎన్ని రకాల సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి? వాటి రుసుము ఎంత ఉంటుంది? ఎన్ని పనిదినాలలో పని పూర్తీ అవుతుంది? తదితర అంశాలతో కూడిన డిస్ప్లే లను మీ సేవ స్టాల్ లో ఉంచడం జరిగింది. ఇవన్నీ సాధారణంగా అన్ని మీ సేవా కేంద్రాలలో ఉంటున్నప్పటికీ ఎక్కడికి అయినా వెళ్లి చూడడమే మనకు అలవాటు ఇష్టం కాబట్టి మీ సేవా స్టాల్ బాగుంది. అలాగే పోలీస్ వారు కూడా ఫిర్యాదులను ఎలా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు, పోలీసు వారు అందించే వివిధ రకాల సర్వీస్ లను ఆన్ లోన్ ద్వారా ఎలా పొందవచ్చు అనే అంశాలపై ప్రదర్సన ఏర్పాటు చేశారు.

వ్యాపార సంస్థలు

ఈ డిజి ధన మేళా వలన ఎక్కువ లాభాపడినవారు వీరే. వివిధ రకాల పాల ఉత్పత్తులు, ఎరువులు మరియు పురుగు మందుల కంపెనీలు, ఎంపిక చేసిన చేనేత వస్త్ర దుకాణాలు, చేతివృత్తుల ఉత్పాదనలను ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి ఉంచారు. అన్నింటికంటే వీటి దగ్గరే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అన్నట్లు ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది.ఇవన్నీ కూడా తమ కొనుగోళ్లను నగదు రహితంగానే చేశాయి.ఇక్కడ విశేషం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ విభాగం అయిన ఆప్కో కూడా తన ఉత్పత్తులను ఇక్కడ అమ్మకానికి ఉంచింది. ఈ స్టాల్ కూడా సందర్శకుల తాకిడితో నిండి పోయింది.

ముగింపు: ఈ ప్రదర్శన ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. “ ప్రభుత్వ కార్యక్రమం వేరు, ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం వేరు “ ఈ కార్యక్రమం ఆసాంతం ప్రభుత్వ కార్యక్రమంలా కనిపించిందే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలా లేదనేది విస్పష్టం. అనేక మంది సందర్శకుల మాట కూడా!