• తాజా వార్తలు

ఏపీలో సైబర్ ల్యాబ్ లు.. టెక్నో కానిస్టేబుల్స్


సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. వేలు, లక్షల జీతం. అద్భుతమైన పనివాతావరణం, టెక్నాలజీపై గ్రిప్.. ఇలా ఆ ఉద్యోగమంటే అందరికీ క్రేజ్. ఇప్పుడు ఏపీలో పోలీసు డిపార్టుమెంట్ ఉద్యోగాలు కూడా ఈస్థాయిలో కాకపోయినా కాస్త అటూఇటుగా హైటెక్ గా మారబోతున్నాయి. కానిస్టేబుల్ నుంచి పై స్థాయి వరకు అందరికీ టెక్నాలజీ వినియోగంపై శిక్షణ ఇవ్వబోతున్నారు. అందరికీ ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వబోతున్నారు. ఏపీలో పోలీసు శాఖను హైటెక్ గా మార్చడానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు.
ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్
ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ ప్రకటించారు. నేరాలు కంట్రోల్ చేయడానికి టెక్నాలజీ అవసరం చాలా ఉందని... అందుకోసం పోలీస్ డిపార్టుమెంట్ పూర్తిస్థాయిలో రెడీ కావాల్సి ఉందని చెప్పారు. అందులో భాగంగానే ఈ సైబర్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి కానిస్టేబుల్ స్థాయి నుంచి పై వరకు అందరికీ ల్యాప్ టాప్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
టెక్నాలజి తెలియకుంటే పోలీసింగ్ కష్టమే..
కాగా సాఫ్ట్ వేర్ సంస్థలతో టై అప్ పెట్టుకుని సాధారణ సాంకేతికతలతో పాటు నేరాల నియంత్రణకు అవసరమైన ఇతర సాంకేతికతలు నేర్పించేందుకు ప్రత్యేక శిక్ణణలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రతి జిల్లాలో కొద్దిమంది కానిస్టేబుళ్లు, ఎస్ ఐలు మాత్రమే టెక్నికల్ గా అప్ డేట్ గా ఉంటున్నారు. అలాంటి వారు పోలీసింగ్ లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కేసుల పరిష్కారంలోనూ వారే ముందుంటున్నారు. అత్యంత క్లిష్టమైన నేరాలను పరిష్కరించిన కేసులను చూస్తే అందులో టెక్నాలజీ సహాయం తప్పకుండా ఉంటోంది. ఇతర రాష్ర్టాలు, దేశాలతో క్రైం రికార్డ్సు, ఆధారాలు షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు... ఇతర ప్రాంతాలతో సంబంధాలున్న కేసులు ఛేదించాల్సి వచ్చినప్పుడు సాంకేతికత అవసరం ఎక్కువగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుని మెరుగైన సేవలు అందించడం.. ఇమ్మీడియట్ రెస్పాన్స్, అవగాహన కల్పించడం వంటివన్నీ కొందరికి మాత్రమే సాధ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఇలా తయారుచేసి పోలీసు శాఖ పనితీరు మెరుగుపరచడానికి రెడీ చేస్తున్నారు.