• తాజా వార్తలు
  •  

ఏపీకి టెక్ సాయానికి సై అంటున్న గూగుల్‌, టెస్లా

అమెరికాకు చెందిన అనేక దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు ముందుకొచ్చాయి. సీఎం చంద్ర‌బాబు యూఎస్ టూర్‌లో భాగంగా అక్క‌డి దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నింటినీ సంద‌ర్శించి వాటి సీఈవోలు, ఛైర్మ‌న్ల‌తో క‌లుస్తున్నారు. గూగుల్‌, టెస్లా, యాపిల్‌, ఆయోవా యూనివర్సిటీ, సిస్కో, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి పెద్దపెద్ద సంస్థ‌లు ఏపీతో క‌లిసి పనిచేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా.. మారుమూల ప్రాంతాలకు తీగలు లేకుండా బ్యాండ్‌ విడ్త్‌ తీసుకెళ్లే ప్రాజెక్టుపై గూగుల్‌ సంస్థతో అవగాహన ఒప్పందం జరిగినట్టు చంద్రబాబు చెప్పారు. ఏపీలోని 2వేల నోడ్స్‌లో డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టుని గూగుల్‌ పూర్తిచేస్తుందన్నారు. అడవులు, నదులు వంటి అడ్డంకులున్నచోట, వైర్ల ద్వారా బ్యాండ్‌విడ్త్‌ అందజేయడం కష్టమైన ప్రాంతాల్లో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. యూఎస్ టూర్ నాలుగో రోజైన సోమ‌వారం చంద్ర‌బాబు తెలుగు ఎన్నారైల స‌మావేశంలో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాల్ని వినియోగించి సంపద సృష్టించ‌డంలో ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించేందుకు గూగుల్‌ అంగీకరించిందన్నారు. యాపిల్‌ సీఓఓ జెఫ్‌ విలియమ్స్‌తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో యాపిల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుపై చర్చించాను. అదొస్తే విదేశాల నుంచి భారత్‌కు హార్డ్‌వేర్‌ ఎగుమతులు బాగా తగ్గుతాయి అన్నారు.
సోలార్ ప‌వ‌ర్‌పై టెస్లాతో డీల్
సోలార్ ప‌వ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌కు ఏపీ అత్యంత అనుకూల‌మైన ప్ర‌దేశ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు.. రెండేళ్లలో 4వేల మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి స్థాయికి చేరుకున్నామ‌ని, ఒకప్పుడు రూ.14 ఉన్న యూనిట్‌ ధర ఇప్పుడు రూ.3.20కి దిగివచ్చింద‌న్నారు. ఉత్పత్తి చేసినచోటే సౌరవిద్యుత్‌ని నిల్వ చేసుకోగలిగితే రాత్రిపూట వాడుకోవచ్చు.కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరముండదు. విద్యుత్తు నిల్వకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని టెస్లా అభివృద్ధి చేస్తోంది. రాష్టంలో 8 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు టెస్లాతో ఒప్పందం చేసుకున్నామ‌ని ఏపీ సీఎం చెప్పారు. టెస్లా ఛైర్మన్‌ను కలిశాన‌ని, డ్రైవర్ లేని కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లు రూపొందించిన టెస్లా తయారీ కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే పెడితే బాగుంటుంద‌న్నారు. 2030 నాటికి రాష్ట్రంలో అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉంచాలన్నది త‌మ టార్గెట్ అని, టెస్లా వంటి సంస్థ‌లు వ‌స్తే ఆ టార్గెట్ రీచ్ అవ‌డం ఈజీ అవుతుంద‌న్నారు.

జన రంజకమైన వార్తలు