• తాజా వార్తలు
  •  

నవ్యాంధ్ర ఐటీ రంగానికి విశాఖే చుక్కాని


ఆంధ్రప్రదేశ్ లో ఐటి రంగ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ రంగంలో ప్రగతి విశాఖ కేంద్రంగానే మొదలవుతోంది. ఇందుకు మానవ వనరులను కల్పించేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఐటీ సెజ్ తో ప్రోత్సాహం
ప్రతి యేటా ఇంజనీరింగ్ పట్టభద్రులు తమ చదువులు పూర్తి చేసుకుంటున్నప్పటికీ వారికి సరైన వృత్తి నైపుణ్యత లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. కళాశాల స్థాయిలో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. మిగిలిన వారంతా తమ సమర్ధతను చాటుకోలేక, చదువుకు తగిన ఉద్యోగాలు రాక నిరాశతో ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. విభజన అనంతరం ఐటి రంగంలో విశాఖ ఐటి రంగంలో ప్రగతి సాధిస్తోందనడంలో సందేహం లేదు. రుషికొండ వద్ద ఐటి ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని చర్యలు కూడా తీసుకుంది. ఐతే వృత్తి నైపుణ్య శిక్షణతోనే ఐటి రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నది కాదనలేని సత్యం. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు వీలుగా కొన్ని నిర్ణయాలు చేసింది.
ఐటీ నిపుణులను తయారు చేసేందుకు..
రాష్ట్రంలో ఐటి రంగం మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఎపి (ఐటిఎఎపి)తో ఎపి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఏజెన్సీ (ఎపిఇఐటిఎ) సంస్థల ఆధ్వర్యంలో ఐటి రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోంది. నవ్యాంధ్రలో ప్రస్తుతం సాలీనా రూ.2,200 కోట్ల మేర ఐటి ఎగుమతులు జరుగుతున్నాయి, భవిష్యత్‌లో దీన్ని పదింతలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఐటిఎఎపి, ఎపిఇఐటిఎ సంయుక్తంగా చర్యలకు ఉపక్రమించాయి. ఐటి రంగంలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండగా, ఇక్కడ ఐటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మానవ వనరులను సమీకరించే క్రమంలో ఈ రెండు సంస్థలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఐటి కంపెనీలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను అందుబాటులోకి తీసుకురావడం ఈ సంస్థల ఉద్దేశం. పేరున్న పెద్ద కంపెనీలు క్యాంపస్ ఇంటర్వూల్లో తమకు కావాల్సిన వారికి ఎంపిక చేసుకుని, వారికి శిక్షణ నిచ్చి ఉద్యోగావకాశాలు కల్పించుకుంటున్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఇఐటిఎ ఆధ్వర్యంలో ఐటిఎఎపి శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో ఐటి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు ప్రత్యేక శిక్షణనిస్తారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఐటి అసోసియేషన్, ఐటి కంపెనీల సీనియర్ ఉద్యోగులతో కూడిన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్రంలోనే ఐటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు