• తాజా వార్తలు
  •  

మ‌ద్యం ప్రియుల కోసం యాప్

లిక్క‌ర్ ప్రియుల కోసం ఓ కొత్త యాప్‌.. విన‌డానికి వింత‌గా ఉన్నా ఇది నిజం. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ దీన్ని అందుబాటులోకి తెస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన ఈ యాప్ తో మందుబాబుల‌కు తాము తాగే లిక్క‌ర్ గురించిన పూర్తి సమాచారం ఒక్క క్లిక్‌లో తెలిసిపోతుంది. టెక్నాల‌జీని అన్ని విష‌యాల్లోనూ వాడుకోవాల‌నుకునే ఏపీ గ‌వ‌ర్న‌మెంట్.. ప్ర‌భుత్వానికి అధిక ఆదాయాన్నిస్తున్న లిక్క‌ర్ సేల్స్‌లోనూ దాన్ని వినియోగించుకోవాల‌ని భావిస్తోంది. దాని ఫ‌లిత‌మే ఈ యాప్‌.
వినియోగదారులు మోసపోకుండా..
లిక్క‌ర్ వినియోగదారులు మోసపోకుండా ఒరిజిన‌ల్ మందు అందుబాటులోకి తేవ‌డం, దారి మ‌ళ్లుతున్న ఎక్సైజ్ వాహ‌నాలను గుర్తించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ యాప్‌ను ఏపీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్ర‌వేశ‌పెడుతోంది. వ‌చ్చే నెల‌లో దీన్ని తీసుకురాబోతున్న‌ట్లు ఆ డిపార్ట్ మెంట్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.
ఎవ‌రికి ఉప‌యోగం?
సాధార‌ణంగా 200, 300 రూపాయ‌ల ఖ‌రీదైన పుల్‌బాటిల్ కొనుక్కునేవారు అది అసలుదా? న‌కిలీదా ఆలోచించ‌రు. కానీ కొద్దిగా కాస్ట్‌లీ లిక్క‌ర్ యూజ్ చేసేవారు అది అస‌లుదా కాదా అని త‌ర‌చిచూస్తారు. ఇలాంటివారు ఈ యాప్ యూజ్ చేసి మ‌ద్యం బాటిల్‌పై హాలోగ్రామ్‌ను స్కాన్ చేయ‌గానే ఆ మందు ఎక్క‌డ త‌యార‌యింది? బ‌్యాచ్ నెంబ‌ర్‌? అది ఒరిజిన‌ల్‌దా కాదా మొత్తం వివ‌రాలు చెప్పేస్తుంది. అదే విధంగా మ‌ద్యం త‌ర‌లించే వాహ‌నాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా అవి వెళుతున్న రూట్‌ను ట్రాక్ చేసేందుకు మ్యాప్‌ను కూడా ఈ యాప్‌కు అనుసంధానించ‌బోతున్నారు. మొత్తంగా ఈ యాప్ ద్వారా మ‌ద్యం విక్ర‌యాల్లో అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల‌న్న‌ది ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఆలోచ‌న‌.

జన రంజకమైన వార్తలు