• తాజా వార్తలు
  •  

సొంతూరిపై ప్రేమతో అవనిగడ్డ యాప్ తయారు చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

    పురమా శ్రీధర్ బాబు... కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండల పరిధిలోని వి.కొత్తపాలెం ఆయన స్వగ్రామం. తన నియోజకవర్గం అవనిగడ్డను ఆదర్శంగా మార్చేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకు సాంకేతికత సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు బాగా తెలిసిన విద్య అయిన యాప్ తయారీని ఉపయోగించుకుని అవనిగడ్డకు ప్రత్యేక స్థానం కల్పించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ‘అవనిగడ్డ నియోజకవర్గం’ అనే యాప్ తయారుచేశాడు. ఇప్పుడది ఆ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఆ యాప్ తో పాటు శ్రీధర్ పైనా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ యాప్ లో ఏముంది?
అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాలు అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల, నాగాయలంక... వాటిలోని అన్ని గ్రామాల సమచారం ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల సమచారం, ఆలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల సమాచారం కూడా ఇందులో ఉంది. దీంతో పాటు క్యాబ్ బుకింగ్, వాటర్ క్యాన్ ఆర్డర్... ఇలా ఎన్నో సౌకర్యాలున్నాయి.

రక్తదానానికి..
అంతేకాదు.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి వీలుగా రక్తదాతల కాంటాక్ట్స్, విద్యార్థులకు గైడెన్స్, ఉమన్ ప్రొటెక్షన్ సెల్ వంటి ఎన్నో మంచి ఫీచర్లున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు సదుపాయాల కోసం దీన్ని రూపొందించారు.

ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్
ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే ఉంది. దీన్ని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవనిగడ్డ అని కానీ.. నియోజకవర్గంలోని ఇతర మండలాల పేర్లయిన కోడూరు, చల్లపల్లి, ఘంటశాల, నాగాయలంక, మోపిదేవి పేర్లతో సెర్చి చేసినా కనిపిస్తుంది.
 

జన రంజకమైన వార్తలు