• తాజా వార్తలు
  •  

డిజిటల్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ ఇవీ..


ఆంధ్రప్రదేశ్ త్వరలో డిజిటల్ ఆంధ్రగా మారనుంది. కేబుల్ టీవీ (ఐపీ టీవీ), ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను అందించే ట్రిపుల్ ప్లే బాక్సుల సమస్య కొలిక్కి రావడంతో జూలై నాటికి రెండు లక్షల ఇళ్లు పూర్తి డిజిటల్‌గా మారిపోనున్నాయి. డిసెంబరు నాటికి 10 లక్షల ఇళ్లకు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

నిజానికి ట్రిపుల్ ప్లే బాక్స్‌ల సరఫరాలో జాప్యం జరిగినా చైనా నుంచి ఇప్పుడు ఈ బాక్సులు వస్తుండడంతోపాటు శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్ కంపెనీ బాక్సుల తయారీకి మొగ్గుచూపడంతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది.

ఒకే కనెక్షన్ ద్వారా కేవలం రూ.250కే ఫోన్, టీవీ, ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడుకునే ఏపీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ స్తంభాల ద్వారా ప్రతి పట్టణం, మేజర్ పంచాయతీల వరకు 23 వేల కిలోమీటర్ల పొడవునా ఓఎఫ్‌సీ వేయడం ఇప్పటికే పూర్తయింది. దీంతో పైన చెప్పిన మూడు ప్రసారాలు ఒకే రింగ్ విధానంలో ఉంటాయి. ఒకచోట కేబుల్ కట్ అయినా రెండోవైపు నుంచి ప్రసారాలు కొనసాగుతాయి. కాబట్టి ప్రసారాల్లో అంతరాయం ఉండదు.

విశాఖ కేంద్రంగా జరిగే ప్రసారాల్లో జిల్లాల్లో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే ప్రసారాలు ఆగిపోకుండా ఉండేందుకు భూగర్భ కేబుళ్ల ద్వారా సేవలు అందించేందుకు రిలయన్స్, ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యామ్నాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇక విశాఖ ఏజెన్సీలోని వందలాది గిరిజన గూడేలకు ఏపీ ఫైబర్ సేవలు అందనుండడం విశేషం.

* సెట్‌టాప్ బాక్స్ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.
* స్మార్ట్‌ఫోన్లలోని యాప్‌లలానే టీవీలోనూ యాప్‌లను ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.
* యూట్యూబ్ వంటి వాటిని పదుల సంఖ్యలో నేరుగా టీవీలోనే వీక్షించవచ్చు.
* బ్లూటూత్‌తో కనెక్ట్ చేసి కీబోర్డు, మౌస్‌తో టీవీని కంప్యూటర్‌లా మార్చేయవచ్చు.
* టీవీ కార్యక్రమాలను ఎంతసేపైనా ఉచితంగా రికార్డు చేసుకోవచ్చు.
* సినిమాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు.
* భవిష్యత్తులో కొత్త సినిమాలను నేరుగా టీవీలో చూసే అద్భుతమైన అవకాశం వుంటుంది.
* అన్నీ హెచ్‌డీ చానళ్లే. అదనపు రుసుము లేకుండా 250 చానళ్లను చూసుకోవచ్చు.
* వాణిజ్య అవసరాలకు, స్కూళ్లు, వ్యవసాయానికి కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందనున్నాయి.

జన రంజకమైన వార్తలు