ఎయిర్‌పోర్టుకు వెళుతున్నామంటే ఏదో తెలియని కంగారు. ఎంత ముందుగా ప్రిపేర్ అయినా.. అన్నీ సమకూర్చుకున్నా.. ఏదో ఒకటి మర్చిపోవడం సర్వసాధారణం. దీనికి కారణం ప్రయాణం అంటే మనలో లోలోపల ఉన్న కంగారు వల్లే. ఇలాంటి సమయంలో మనకు ఒక తోడుగా ఉండి.. మనల్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసే వాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా! అయితే ప్రతిసారి ఎవరూ మనకు తోడుగా రారు. ఒక్కోసారి మనం ఒంటరిగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇలాంటి స్థితిలో ప్రతిక్షణం మనం అప్రమత్తంగా ఉండక తప్పదు. అయితే ఎయిర్‌పోర్టులో మన ఇబ్బందులను తీర్చడానికి, మనకు సహాయం చేయడానికి ఒక యాప్ వచ్చేసింది. దాని పేరే ఎయిర్‌విజ్.
అన్ని పనులు మీ చేతుల్లో..
ఫ్లయిట్ ఎక్కువతున్నామంటే ఎంతో మందితో మనం కనెక్ట్ కావాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు సిబ్బందితో మొదలు కొని, ప్లయిట్లో ఎయిర్ హోస్టెస్, కెప్టెన్ ఇలా అందరితో మన కనెక్ట్ అయి ఉండాలి. ఈ నేపథ్యంలో ఎయిర్‌విజ్ యాప్ మీకెంతో మేలు చేస్తుంది. ఇది ప్రయాణీకులకు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి మధ్య వారథిగా పని చేస్తుంది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలు ఫ్లయిట్లకు సంబంధించిన సమస్త సమాచారంతో పాటు ఏ ప్లయిట్ ఎక్కుతున్నప్పుడు ఏం చేయాలి.. ఎలాంటి చెక్ ఇన్స్ ఉంటాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. చేయాల్సినవి... చేయకూడనవి అన్నీ ఈ యాప్‌లో ఉంటాయి. అంతేకాదు ఎయిర్‌పోర్టులో మనకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన షాప్‌లు ఎక్కడ ఉన్నాయో కూడా ఈ యాప్‌లో వివరాలు తెలుస్తాయి.
ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
ఎయిర్‌విజ్ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా మీరు ఈమెయిల్ లేదా ఫేస్బుక్ లేదా గూగుల్ ప్లస్‌తో సైన్ అప్ కావాలి. ఒకసారి ఈ యాప్‌లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్కబోయే ఫ్లయిట్ వివరాలు, ఫ్లయిట్ నంబర్లను యాడ్ చేయాలి. మీకు ఫ్లయిట్ నంబర్ తెలియకపోతే కూడా వెతుక్కునే అవకాశం ఉంది. అంతేకాదు మన ఫ్లయిట్ వెళ్లే మార్గాన్ని కూడా ఇది చూపిస్తుంది. మీరు ఎక్కబోయే ఫ్లయిట్ ఏదో తెలిసిన తర్వాత మీకు చెక్ ఇన్ చేయబోయే టెర్మినల్ నంబర్ కూడా మీకు వచ్చేస్తుంది. ఈ యాప్‌లో లింక్‌ను ఉపయోగించి వెబ్ చెక్ కూడా చేసుకునే అవకాశం ఉంది.