• తాజా వార్తలు

ఆండ్రాయిడ్‌లో టాప్ 5 బెస్ట్ సెల్ఫీ యాప్స్ మీకోసం..

టెక్నాల‌జీ రోజురోజుకూ మారిపోతున్న ఈ రోజుల్లో కొత్తగా ఏ ట్రెండ్ వ‌చ్చినా చాలా కొద్దిరోజుల్లోనే తెర‌మ‌రుగైపోతోంది. కానీ సెల్ఫీ మాత్రం ఏళ్ల‌తర‌బ‌డి త‌న క్రేజ్ నిల‌బెట్టుకుంటోంది.  రెడ్‌మీ నుంచి యాపిల్ దాకా కంపెనీల‌న్నీ పోటీప‌డి ఫ్రంట్ కెమెరా క్వాలిటీ పెంచ‌డం సెల్ఫీ పుణ్య‌మే అని చెప్పాలి.  అయితే మ‌న ఫోన్‌లో ఎంత మంచి సెల్ఫీ కెమెరా ఉన్నా ఫోటో తీశాక దాన్ని ఎంతోకొంత ఎడిట్ చేస్తేగానీ చాలామందికి మ‌న‌సొప్ప‌దు. అందుకే సెల్ఫీ తీయ‌డంతోపాటు దాన్ని ఇన్‌స్టంట్‌గా ఎడిట్ చేసి మంచి క్వాలిటీ, క్రియేటివ్ సెల్ఫీని అందించేందుకు ప్లేస్టోర్‌లో వంద‌ల కొద్దీ యాప్స్ ఉన్నాయి. వాటిలో ఒక ఐదు బెస్ట్ ఫ్రీ యాప్స్ మీకోసం..
 

స్వీట్ సెల్ఫీ ( Sweet Selfie)
ప్లే స్టోర్లో ఉన్న సెల్ఫీ ఓరియంటెడ్ యాప్స్‌లో ఉత్త‌మ‌మైన వాటిలో ఇది కూడా ఒక‌టి. ట్రెండీ ఫిల్ట‌ర్స్‌, స్పెష‌ల్ స్టిక్క‌ర్స్‌తో చాలా ఆకర్ష‌ణీయంగా ఉంటుంది. ఫోటో బ్ల‌ర్ అయిందే, బాగా రాలేదే అని బాధ‌ప‌డ‌కుండా  ఆటో బ్యూటిఫై, అమేజింగ్ బ్ల‌ర్‌లాంటి మంచి ఫీచ‌ర్లున్నాయి.ఇక మీ ఫోటోలో ప‌ళ్ల‌ను మెరిపించే టీత్ వైట‌నింగ్‌, కండ‌ల్ని కొత్త‌గా చూపించే మ‌జిల్ స్టిక్క‌ర్స్‌తో మీ సెల్ఫీకి ఓ స‌రికొత్త రూపు తెస్తుందీ యాప్‌. ఇంట‌ర్‌ఫేస్ కూడా చాలా నీట్‌గా, సులువుగా ఉంటుంది.  

కాండీ కెమెరా (Candy Camera)
కాండీ కెమెరా మంచి సెల్ఫీ యాప్ మాత్ర‌మే కాదు గూగుల్ ప్లేస్టోర్‌లో హయ్య‌స్ట్ రేటింగ్ ఉన్న యాప్స్‌లో ఒక‌టి. ఈ యాప్‌తో సెల్ఫీలు తీసుకోవ‌డమే కాదు రియ‌ల్ టైమ్ ఎఫెక్ట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇందుకోసం 100కు పైగా ఫిల్ట‌ర్లున్నాయి.స్టిక్క‌ర్స్‌, కొలేజ్‌ల‌తోపాటు ప‌బ్లిక్ ప్లేస్‌ల్లో సైలంట్‌గా సెల్ఫీ తీసుకోవ‌డానికి  సైలెంట్ కెమెరా ఫీచ‌ర్ దీనికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. రియ‌ల్ టైం ఫిల్టర్ల‌తో కూడాని రియ‌ల్ టైం వీడియో ఫ్రీ వీడియో కాలింగ్ దీనిలో మ‌రో ప్రత్యేక‌త‌.

బీ612 (B612)
అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న బెస్ట్ సెల్ఫీ యాప్స్ గురించి చెప్పుకోవాలంటే బీ612 ఆ లిస్ట్‌లో ముందు ఉంటుంది. దీనిలో 1,500 డిఫ‌రెంట్ స్టిక్క‌ర్లున్నాయి. స్నాప్‌చాట్ లాంటి లెన్స్‌లు కూడా ఈ యాప్ ప్ర‌త్యేకం. రియ‌ల్‌టైం బ్యూటీ ఎఫెక్ట్స్‌, ఏఆర్ స్టిక్క‌ర్స్ ఇలా మీ సెల్ఫీకి కొత్త హంగుల‌ద్దే బోల్డ‌న్ని ఫీచ‌ర్లున్నాయి.   లైవ్ ఫిల్ట‌ర్స్‌తో వీడియో రికార్డింగ్ చేసి హై క్వాలిటీ మ్యూజిక్ వీడియోలుగా మార్చుకోవ‌చ్చు. ఇమేజెస్‌, మ్యూజిక్ వీడియో, హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌, బూమ్‌రాంగ్ వంటి ఫీచ‌ర్ల‌తో ఈ యాప్ ఇంట‌ర్‌ఫేస్ ఇన్‌స్టాగ్రామ్‌లా ఉంటుంది.

 యూకామ్‌ ప‌ర్ఫెక్ట్ (YouCam Perfect)
సెల్ఫీ టేకింగ్ ఫీచ‌ర్ల‌తోపాటు మంచి సెల్ఫీ ఎడిటింగ్ ఫీచ‌ర్లున్న యాప్ కావాలంటే యూకామ్ ప‌ర్ఫెక్ట్‌ను ట్రై చేయొచ్చు. బ్యూటిఫ‌యింగ్ ఎఫెక్ట్స్‌, ఫేస్ రీషేప‌ర్‌, స్టైలేజేష‌న్‌తో మీ ముఖాన్ని మ‌రింత అందంగా చూపించ‌డానికి కావాల్సిన ఫీచ‌ర్ల‌న్నీ  ఈ యాప్‌లో ఉన్నాయి. మొజాయిక్ బ్ల‌ర్‌, ఆబ్జెక్ట్ రిమూవ‌ర్ లాంటి బెస్ట్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ యూకామ్ ఫ‌ర్ఫెక్ట్ సైతం. అయితే మిగ‌తా యాప్స్ మాదిరిగా రియ‌ల్ టైం ఫిల్ట‌ర్స్ లేవు.

బెస్ట్‌మీ (BestMe)
సెల్ఫీ కొట్టు.. సోష‌ల్ మీడియాలో పెట్టు అని ఆత్రుత‌ప‌డేవాళ్ల‌కు ప‌ర్ఫెక్ట్ యాప్ బెస్ట్‌మీ.  ఎమోజీ గ్రిడ్ ఫోటో మోడ్‌, నో క్రాప్ మోడ్‌తో ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్‌గా షేర్ చేసుకోవ‌చ్చు. 125 రియ‌ల్‌టైం ఫిల్ట‌ర్స్‌, బోల్డ‌న్ని స్టిక్క‌ర్లు ఈ యాప్ సొంతం. రియ‌ల్ టైం ఫొటో ఎడిట‌ర్‌, రియ‌ల్ టైం ఫొటో కొలేజ్‌తో క్ష‌ణాల మీద ఫొటోల‌ను అద్భుతంగా మార్చి మీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసేసుకోవ‌చ్చు.  ఇందుకోసం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌ల‌తో డైరెక్ట్ షేరింగ్ యాక్సెస్ ఉంది.

జన రంజకమైన వార్తలు