• తాజా వార్తలు

యూట్యూబ్ ‘అప్ టైం’లో విషయం ఏంటి?

యూట్యూబ్ గురించి తెలియనివారే లేరు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు.. ఇంట్లో ఉన్నా, ఆఫీసుల్లోఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, బస్టాప్ లో వెయిట్ చేస్తున్నా ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి పాటలో, సినిమాలో, లేదంటే మిస్సయిన సీరియళ్లో, జబర్దస్త్ ఎపిసోడ్లో... ఒకటేమిటి? ఏం కావాలంటే అది చూసుకుంటున్నారు. కోట్లాది వీడియోలు కొలువున్న యూట్యూబ్ ఇప్పుడు అందరికీ అత్యంత ఇష్టమైన వెబ్ సైట్ అయిపోయింది.  చాలామందికి తెలియదు కానీ యూట్యూబ్ కి అనుబంధంగా మంచి ఆప్షన్లున్నాయి.  అప్ టైం కూడా అలాంటిదే. ఒక్క మాటలో చెప్పాలంటే యూట్యూబ్ వీడియోలు చూసేటప్పుడు మంచి ఫన్ అందించే యాప్ ఇది.
    అప్ టైం యాప్ ను యూట్యూబ్ ఈ ఏడాది మార్చిలో ఇంట్రడ్యూస్ చేసింది. వేర్వేరు లొకేషన్లలో ఉంటూ కూడా ఫ్రెండ్సంతా కలిసి ఒకే వీడియో చూడగలగడం దీని ప్రత్యేకత. అంతేకాదు.... అదే సమయంలో చాటింగ్, ఆ వీడియోపై కామెంట్లు పెట్టడం కూడా చేయొచ్చు. తొలుత దీన్ని ఐఓఎస్ కు మాత్రమే సరిపోయేలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. పైగా అప్పట్లో ఇది ఇన్విటేషన్ పై మాత్రమే డౌన్లోడ్ చేసుకునే వీలుండేది.  ప్రస్తుతం ఇన్విటేషన్ తో సంబంధం లేకుండా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పటికీ ఐఓఎస్ కు మాత్రమే పరిమితం.
    అయితే, యూట్యూబ్ యాప్ కు అప్ టైంకు చాలా తేడా ఉంది. ఇందులోనే అప్ నౌ అనేది ఒకటుంది. ఇందులో ట్రెండింగ్ వీడియోల లిస్టు ఒకటి ఉంటుంది. అది కూడా రియల్ టైంలో మారిపోతుంటుంది. గూగుల్ అకౌంట్తో ఈ యాప్ లో లాగిన్ అయితే చాలా ఫీచర్లు కనిపిస్తాయి.
    మనం లాగిన్ అయి ఇందులోని వీడియోలు కనుక చూస్తుంటే ఆ సమయానికి ఎంతమంది చూస్తున్నారు... ఎవరి రియాక్షన్ ఏంటి అనేవన్నీ తెలుస్తాయి. అలాగే మన రియాక్షన్లనూ ఇతరులు చూడగలుగుతారు. మీరు వీడియో చూస్తున్న స్క్రీన్ పైనే ఎమోజీస్ దొరుకుతాయి. వాటిని ఉపయోగించి రియాక్షన్లు నమోదు చేయొచ్చు. అలాగే... మీ ఫ్రెండ్సు రియాక్షన్లను కూడా మీరు కాప్చర్ చేయొచ్చు. అప్పటికప్పుడు మీ స్నేహితుల కామెంట్లు, రియాక్షన్లు ఆ వీడియో స్క్రీనుపైనే చూసే వీలుండడం దీని ప్రత్యేకత. 

ప్రయోజనం ఏంటి...
ఇంతవరకు యూట్యూబ్ లో మనకు ఏదైనా వీడియో నచ్చితే దాన్ని స్నేహితులతో షేర్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ను మెయిల్ చేయడమో లేదంటే అక్కడున్న షేర్ ఆప్షన్ సహాయంతో వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సహాయంతో షేర్ చేయడమో చేసేవాళ్లం. కానీ... అప్ టైం ఆ ఇబ్బందులు తప్పించింది.

జన రంజకమైన వార్తలు