• తాజా వార్తలు
  •  

ఆధార్ పేమెంట్ యాప్ ఎలా పనిచేస్తుందంటే..?


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీమ్ రావ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా, ఆధార్ ఆధారిత మొబైల్ నగదు చెల్లింపు యాప్ ను ప్రధాని నరేంద్ర మోదీ నాగపూర్ లో విడుదల చేయనున్నారు. భిమ్ (భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ) పేరిట దీన్ని తయారు చేశారు. దీని సాయంతో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండా కూడా డిజిటల్ చెల్లింపులను సులువుగా జరిపించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అంబేద్కర్ కలలుగన్న సామాజిక, ఆర్థిక స్వావలంభన సాధ్యమని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ యాప్ ను వాడేందుకు ఇప్పటికే 27 పెద్ద బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థను అనుసరించేందుకు మూడు లక్షలకు పైగా వ్యాపారులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇక భీమ్ యాప్ ను వాడేవారిని ప్రోత్సహించేందుకు వచ్చే ఆరు నెలల పాటు క్యాష్ బ్యాక్, రిఫరల్ బోనస్ తదితర స్కీముల ద్వారా రూ. 495 కోట్లను పంచనున్నట్టు కేంద్రం ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యాప్ పనిచేసే విధానం గురించి ఒక్కసారి పరిశీలిస్తే...
ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్)లో మర్చంట్ వర్షనే ఆధార్ పే. ఇది మొబైల్ వాలెట్లు, డెబిట్ కార్డులు లేని వారికి ఉపకరిస్తుంది. ప్రైవేటు కార్డు కంపెనీలైన మాస్టర్ కార్డ్, వీసా వంటి కంపెనీలు వసూలు చేస్తున్న చెల్లింపు చార్జీలేవీ దీనికి వర్తించవు.
ఎలా వాడాలి?
వ్యాపారులు ఈ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని, బయోమెట్రిక్ స్కాన్ మిషన్ ను అమర్చుకోవాలి. ఆపై తమ బ్యాంకు ఖాతాలతో రిజిస్టర్ చేసుకుని కస్టమర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. అంతకన్నా ముందు ఈ-కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలన్నీ బ్యాంకుకు సమర్పించి, మొబైల్ నంబరుకు యాప్ లింకును తెప్పించుకుని యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వ్యాపారులు సమీపంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వుంటుంది.
కస్టమర్లు తమ బ్యాంకుకు ఆధార్ నంబరును, మొబైల్ ఫోన్ ను అనుసంధానం చేసి ఈ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి 12 అంకెల ఆధార్ నంబరును ఎంటర్ చేసి, ఫింగర్ ప్రింట్ నమూనాను సమర్పించడం ద్వారా, ఎంటర్ చేసిన మొత్తాన్ని వ్యాపారి పొందవచ్చు. ఆ సమాచారం వెంటనే కస్టమర్ మొబైల్ కు చేరుతుంది.
భద్రత
నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యాప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను కలిగివుంటుంది. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వ్యవస్థలపై ఆధారపడి పని చేస్తుంది. ఇవి రెండూ లావాదేవీలు సాఫీసా, భద్రంగా సాగేందుకు ఉపకరిస్తాయి. కస్టమర్లకు లాభాలు
ఎలాంటి మొబైల్ ఫోన్, నెట్ కనెక్షన్, కార్డులు లేకుండా చెల్లింపులు సులభతరమవుతాయి. ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) సైతం వసలు చేయబోరు. పైగా యాప్ ను వాడి చెల్లింపులు చేస్తే, అధిక క్యాష్ బ్యాక్, ప్రభుత్వ నగదు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.

జన రంజకమైన వార్తలు