• తాజా వార్తలు

ప్ర‌తి యాప్ మ‌న ప్రైవ‌సీని తినేస్తుంటే మ‌నం చేయ‌గ‌లిగేది ఏమీ లేదా? 

ఫేస్‌బుక్ అమెరికాలో కోట్ల మంది వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారానికి వాడుకుంద‌ని తెలియ‌డంతో మ‌న డేటా ప్రైవ‌సీ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఫేస్‌బుక్ ఒక‌టేనా మ‌న డేటాను సేక‌రిస్తోంది.. మిగిలిన యాప్‌ల‌న్నీమ‌న ప్రైవేట్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను సేక‌రించ‌డం లేదా?  ఎందుకు లేదు. దాదాపు అన్ని యాప్స్ కూడా మ‌న నుంచి ఎంత డేటా లాగాలో అంతా లాగేస్తున్నాయి. వాటిని ర‌క‌ర‌కాల మార్గాల్లో వాడుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదంతా తెలిసీ మ‌నం చూస్తూ ఉండాల్సిందేనా? ఏం చేయ‌లేమా అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ ఆర్టిక‌ల్‌.  

మ‌న‌మే కార‌ణ‌మా?
స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక మ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారం బ‌హిర్గ‌త‌మైపోతోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌న ప‌ర్స‌నల్ విష‌యాల‌ను కూడా మ‌న‌మే న‌డిబ‌జారులో పెట్టేసుకుంటున్నాం. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌తో మొద‌లుపెట్టి నిత్యం మ‌నం ఉప‌యోగించే వంద‌ల కొద్దీ యాప్స్‌కు మ‌న డేటాను చూడడానికి ప‌ర్మిష‌న్లు మ‌నమే ఇస్తున్నాం. యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్‌ చేసేట‌ప్పుడే మీ ఫోన్‌లో కెమెరా, కాంటాక్స్ట్‌, మెసేజ్‌లు ఇలా ర‌క‌ర‌కాల అంశాల‌కు అవి ప‌ర్మిష‌న్లు అడుగుతుంటాయి. అర్జెంట్‌గా ఆ యాప్ వాడాల‌న్న ఆత్రుత‌, మ‌న వివరాలు ఎవ‌రేం చేసుకుంటారులే అనే ధీమా, అస‌లు యాప్ ఏం ప‌ర్మిష‌న్లు అడిగిందో కూడా చూడ‌కుండానే యాక్సెప్ట్ బ‌ట‌న్ నొక్కేయ‌డం ఇవ‌న్నీ కూడా మీ ప్రైవ‌సీని యాప్స్‌చేతుల్లో పెట్టేస్తున్నాయి. ఆ యాప్స్ వాటిని అవ‌స‌ర‌మైన కంపెనీల‌కు అమ్ముకుని డ‌బ్బులు సంపాదించుకుంటున్నాయి. 

ప‌రిష్కార‌మేంటి?

* యాప్స్ ఏం ప‌ర్మిష‌న్ అడుగుతున్నాయో ఒక్క నిముషం చెక్‌చేయండి.  చూడ‌కుండా ఈజీగా అన్నింటికీ యాక్సెప్ట్ కొడితే మీ డేటా ప్ర‌మాదంలో ప‌డుతుంది.  బ్యాంకింగ్‌, వాలెట్ యాప్స్‌తో ఆర్థిక లావాదేవీలు కూడా స్మార్ట్ ఫోన్ల‌లోనే చేస్తున్నందున మ‌న డేటాను భ‌ద్రంగా పెట్టుకోవడం అత్య‌వ‌సరం.
* చాలా యాప్స్ వాటికి అవ‌స‌రం లేని స‌మాచారాన్ని కూడా అడుగుతుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఓ ఫ్లాష్‌లైట్ యాప్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే  మ‌న నెట్‌వ‌ర్క్ ప‌ర్మిష‌న్ అడిగింది అనుకోండి అనుమానించాల్సిందే. ఎందుకంటే ఫ్లాష్ లైట్ యాప్ ఫోన్ ఫిజిక‌ల్ స్టేట‌స్ మీద ఆధార‌ప‌డి ప‌ని చేస్తుంది. దానికి మీ డేటా వ‌ర్క్‌తో అవ‌స‌రం లేదు క‌దా. ఇలాంటి ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌కుండా స్కిప్ చేయండి. అయినా యాప్ ప‌ని చేస్తే ఓకే.కానీ అవ‌స‌రం లేని ప‌ర్మిష‌న్స్ కోసం యాప్ ప‌దే ప‌దే రిమైండ్ చేస్తున్నా లేదంటే ఆ ప‌ర్మిషన్లు ఇవ్వ‌క‌పోతే ప‌ని చేయ‌ద‌ని చెబుతున్నా ఆ యాప్‌ను వాడ‌కండి. అన్ఇన్‌స్టాల్ చేసేయండి.
* చాలా యాప్స్ మీ ఫోన్ నుంచి కాల్స్ చేసుకోవ‌డానికి, మీ మెసేజ్‌లు రీడ్ చేయ‌డానికి కూడా పర్మిష‌న్స్ అడుగుతాయి. ఇది మీరిచ్చే ప‌ర్మిష‌న్ల‌న్నింటిలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంది. ఎందుకంటే ముఖ్యంగా పేమెంట్‌, బ్యాంకింగ్‌, క్యాబ్‌, ఫుడ్ స‌ర్వీస్ యాప్స్ ఎక్కువ‌గా ఈ ప‌ర్మిష‌న్ అడుగుతుంటాయి. ఎందుకంటే అవి జ‌న‌రేట్ చేసే ఓటీపీని మీరు టైప్ చేయ‌కుండా ఆటోమేటిగ్గా స‌బ్మిట్ చేయ‌డానికి  ఈ ప‌ర్మిష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నిజంగా అవ‌స‌ర‌మైతేనే యాక్సెస్ ఇవ్వండి. అస‌లు ఆ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కుండా ఓటీపీని మీరే టైప్ చేసుకోవడం ఇంకా మంచిది.

ఇట్స్ యాప్ 
రెడ్‌మార్ఫ్ అనే కంపెనీ మీ ఫోన్‌లోని యాప్స్ మీ డేటాను ఎంత వ‌ర‌కు తీసుకుంటున్నాయో ట్రాక్ చేయ‌డానికి ఇట్స్ యాప్ పేరిట ఓ యాప్ క్రియేట్ చేశారు. ఇది ఫ‌స్ట్ నెల ఫ్రీ. త‌ర్వాత నెల‌కు 50 రూపాయ‌లు చెల్లించాలి. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉన్న‌యాప్స్ మీద క‌న్నేస్తుంది. ఏవేవి ఏ డేటా తీసుకున్నాయో ట్రాక్ చేసి ప్ర‌తి రోజూ అర్ధ‌రాత్రి ఓ రిపోర్ట్ ఇస్తుంది. అంతేకాదు ఆ యాప్స్ మీ డేటాను ఏ యూఆర్ఎల్‌కు సెండ్ చేస్తున్నాయో కూడా లైవ్ స్ట్రీమింగ్‌లో చూడొచ్చు. దాని ద్వారా మీరు అదుపులో పెట్టాల్సిన యాప్‌లేంటి?  లేదంటే అన్ఇన్‌స్టాల్ చేయాల్సినంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌యాప్స్ ఏమిటో మీరే గుర్తించ‌గలుగుతారు.
 

జన రంజకమైన వార్తలు