ఈ టెక్ ప్రపంచంలో ఫేస్బుక్ అంటే తెలియని వారు చాలా తక్కువమంది ఉంటారు. ముఖ్యంగా భారత్‌లో ఎఫ్బీ వాడకం చాలా ఎక్కువ. ఒకప్పుడు ఫేస్బుక్ వాడలంటే పీసీ లేదా ల్యాప్‌టాప్‌నో ఉపయోగించేవాళ్లు. కానీ ఇప్పుడు ఎక్కువశాతం మొబైల్లోనే ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆ మొబైల్ వాడకమే తంటా తెచ్చిపెడుతోంది. మనకు తెలియకుండానే మనల్ని ఒక స్కామ్‌లోకి లాగుతోంది. మొబైల్లో ఫేస్బుక్ వాడేవాళ్లే టార్గెట్‌గా హ్యాకర్లు విజృంభిస్తున్నారు. వినియోగదారులకు తెలియకుండా పర్సనల్ డేటాను సంగ్రహిస్తున్నారు.
యూఆర్ఎల్ ప్యాడింగ్
ఫేస్‌బుక్‌ను పీసీ, ల్యాప్‌టాప్‌లో కాకుండా మొబైల్లో యూజ్ చేయడమే ఇప్పుడు హ్యాకర్లకు అవకాశంగా మారింది. పీసీ ట్రాఫిక్‌తో పోలిస్తే మొబైల్ ట్రాఫిక్ పెరగడంతో హ్యాకర్ల దృష్టి దీనిపై పడింది. పీసీలతో పోలిస్తే మొబైల్స్‌కు తక్కువ రక్షణ ఉండడంతో హ్యాకర్లు సులభంగా చొచ్చుకెళిపోతున్నారు. ఇబ్బంది లేకుండా విలువైన డేటాను తస్కరిస్తున్నారు. యూఆర్ఎల్ ప్యాడింగ్ టెక్నిక్ ద్వారా మనకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ దొంగలు సులభంగా లాగేస్తున్నారు. ఎం.ఫేస్బుక్.కామ్ అనే పేరుతో వీళ్లు మొబైల్స్‌లోకి ప్రవేశిస్తున్నారు. మీ బ్రౌజర్ అడ్రెస్ బార్లో మీకు ఈ సైట్ కనబడుతుంది. సబ్ డొమైన్, డొమైన్ కాంబినేషన్ పేరుతో ఫేస్బుక్ మొబైల్ వెర్షన్ అంటూ అందర్ని నమ్మిస్తున్నారు. చూసేందుకు ఇది బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి మీ డిటైల్స్ ఎంటర్ చేసి ఒకే చేస్తే చాలు మీ పని అయిపోయినట్లే. మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్లే. దీన్నే యూఆర్ఎల్ ప్యాడింగ్ అంటారు.
అచ్చం ఒరిజినల్ లాగే..
నిజానికి ఫేస్బుక్ ఒక మొబైల్ వెర్షన్ ఉంది. అచ్చం ఒరిజినల్ మొబైల్ వెర్షన్ ను పోలి ఉండే మరో డూప్లికేట్ వెర్షన్ కూడా ఉంది. మీకు అడ్రెస్ బార్లో హెచ్‌టీటీపీఎస్ అనే అక్షరాలను గమనించకుండా ముందుకు వెళితే ఉచ్చులో చిక్కుకున్నట్లే. దీనిలో మీరు లాగిన్ అయి మీకు సంబంధించిన వివరాలు ఇస్తే... మీకు ఖేల్ ఖతమే. ముందుగా ఇది ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అయితే మనకు అప్పుడు తెలియదు ఏమైనా లాగిన్ ప్రాబ్లమేమో అనుకుంటాం.. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేది వేరు. మనకు తెలియకుండానే అన్ని వివరాలు వేరే వాళ్లు గుప్పిట్లోకి వెళ్లిపోతాయి. మీ ఫేస్‌బుక్‌ను ఏమైనా ఇతర అకౌంట్లకు యూజర్ ఐడీగా ఇస్తే మరింత ప్రమాదం. ఆ అకౌంట్లు కూడా ఇబ్బందుల్లో పడినట్లే. ప్యాడెడ్ యూఆర్ఎల్స్ సాధారణంగా ఈమెయిల్, టెక్ట్ మెసేజ్‌లు, యాప్‌ల రూపంలో వస్తాయి. వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి.