• తాజా వార్తలు

రెడ్ మీ నోట్ 4 రూ.1,099కే అంటూ వాట్సాప్ వేదికగా ప్రీజీఎస్టీ సేల్ పేరుతో స్కాం.. ఉచ్చులో పడొద్దు

జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ దెబ్బకు ఈ-కామర్స్ సైట్లు మొదలుకొని ఆఫ్ లైన్ స్టోర్ల వరకు అన్ని రకాల ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించాయి. సందట్లో సడేమియాలా సోషల్ మీడియా వేదికగా నకిలీ ఆఫర్లు కూడా ప్రచారంలోకి వచ్చేశాయి.  పాపులర్ స్మార్టు ఫోన్ షియోమీ రెడ్ మీ నోట్ 4కి సంబంధించి కూడా అలాంటిదే ఒక ఫేక్ ఆఫర్ ఒకటి వాట్సాప్ లో ప్రచారమవుతోంది. రూ. 1,099కే రెడ్ మీ నోట్ 4 కొనుక్కోవచ్చంటూ వాట్సాప్ లో ఒక మెసేజ్ తెగ స్ర్పెడ్ అయింది. కానీ... రెడ్ మీ నోట్ 4పై ఇలాంటి ఆఫర్ ఎక్కడా లేకపోవడంతో ఇది నకిలీదని తేలింది.
    నిజానికి జులై 1 తోనే చాలావరకు ప్రీ జీఎస్టీ సేల్స్ ఆఫర్లు ముగిసిపోయాయి. కానీ... అమెజాన్లో రెడ్ మీ నోట్ 4 రూ.1099కే విక్రయిస్తున్నారంటూ తప్పుడు సందేశం ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఇలాంటివి చాలా మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నా అందులో ఒకటి మాత్రం వైరల్ అయింది. నోట్ 4 32జీబీ వేరియంట్ రూ.1099కి... 64జీబీ వేరియంట్ రూ.1299కి అమెజాన్ ఎక్స్టెండెడ్ జీఎస్టీ సేల్ లో అమ్మకానికి ఉందన్నది దాని సారాంశం. 
    ఒక్క రెడ్ మీ నోట్ 4 మాత్రమే కాదు... హెచ్ పీ 16జీబీ పెన్ డ్రైవ్ రూ.6 ధరకు.. సిస్కా 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ రూ.99కి దొరుకుతోందంటూ తప్పుడు మెసేజ్ లు చాలామందికి వస్తున్నాయి. ఇంకా ట్రిమ్మర్లు, జేబీఎల్ హెడ్ ఫోన్లు వంటివీ ఇందులో చూపిస్తున్నారు.
    
పర్సనల్ డాటా కోసమే ఈ మోసం..
ఇలాంటి మోసాలు వ్యక్తుల పర్సనల్ డాటా సేకరించడానికి వాడుతున్నారు. ఈ సందేశంలోనే అమెజాన్ వెబ్ సైట్ దంటూ ఓ లింకు ఉంటుంది. కానీ... అది అసలైన అమెజాన్ ది కాకుండా నకిలీ వెబ్ సైట్ ది ఉంటుంది. అందులో అచ్చంగా మనం ప్రొడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు చేసినట్లే మన డీటెయిల్స్ అన్నీ నింపాలి. అంతేకాదు.. ఆ సందేశాన్ని మరికొందరికి కూడా పంపాలంటూ ఉటుంది. చాలామంది అలా పంపిస్తారు కూడా. ఇలా డాటా ఫిల్ చేసినవారు, వారి నుంచి సందేశం అందుకున్నవారిలోనూ డాటా ఫిల్ చేసినవారికి సంబంధించి చిరునామాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలను ఈ నకిలీ సైట్ల సేవ్ చేసుకుని మార్కెటింగ్ సంస్థలకు ఆ డాటాను అమ్ముకుంటాయి. 
    క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందంటూ ఈ ప్రొడక్టులను చూపిస్తారు కాబట్టి ఆర్డర్ చేసినా మనం డబ్బేమీ నష్టపోం. ఈ ప్రొడక్టు డెలివరీ చేయరు, మన వద్ద డబ్బు తీసుకోరు కానీ మన సమాచారం మాత్రం సేకరించేసి అమ్ముకుంటారు. ఇలాంటి స్కాంలు ఎక్కువవుతున్నాయి కాబట్టి వీటి బారిన పడి మన విలువైన సమాచారం ఇలాంటి నకిలీల చేతికి చిక్కకుండా మనమే జాగ్రత్త పడాలి.

జన రంజకమైన వార్తలు