ఇంటర్నెట్ను షాపింగ్‌కు, ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి ఎంత సాధారణంగా ఉపయోగిస్తున్నామో చాలా మంది డేటింగ్‌కు కూడా అలాగే ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో వందలు, వేలకొద్దీ డేటింగ్ వెబ్సైట్లు ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు ఆన్లైన్ డేటింగ్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇందులో చాలా డేటింగ్ వెబ్సైట్లలో చాలా వరకు ఫేక్ ప్రొఫైల్స్‌తో వచ్చే మాయగాళ్లు ఉంటారు. డేటింగ్ కోసం వెబ్సైట్లను చూసేవారిని ఎట్రాక్ట్ చేసి మెల్లగా ముగ్గులోకి దింపి అందినంత డబ్బులు గుంజేస్తారు. ఇలాంటి ఆన్లైన్ డేటింగ్ స్కామ్‌లు చేసేవాళ్లు చాలా స్మార్ట్‌గా ఉంటారు. వారి మాయలో పడకుండా డేటింగ్ వెబ్సైట్లను వాడుకోవాలనుకునేవారికి ఈ టిప్స్.
ఎలా గుర్తుపట్టాలి?
1. ప్రొఫైల్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.
స్కామర్లు పద్ద ఇల్లు, లగ్జరీ కార్లున్నవాళ్లుగా కనిపించేలా అలాంటి ఇమేజెస్ ప్రొఫైల్‌లో పెడతారు. తాము రిచ్ అన్నట్లు, లావిష్‌గా బతుకుతున్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తారు. ఫారిన్లో జాబ్ చేస్తున్నామని, ఆర్మీలోనో నావీలోనో పెద్ద ఆఫీసర్లమని నమ్మిస్తారు.
2.ఫొటోలు జాగ్రత్తగా చెక్చేయండి
వారు ప్రొఫైల్‌లో పెట్టేవి మార్ఫింగ్ ఫొటోలేమో పరిశీలించండి. లేదంటే ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసినవేమో చూడండి. ప్రొఫైల్‌లో ఉన్న ఫొటోను డౌన్లోడ్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ కొడితే ఫొటో జాతకం బయటపడుతుంది.
3 చాటింగ్‌కు రారు..ఫొటోలు పంపరు
ఇలాంటి వారు తమ ఫోటోలు పంపరు. వీడియో చాటింగ్‌కు కూడా ఇష్టపడరు. ఎందుకంటే వారు పంపే ఫొటోల్లో ఉన్నట్లు లేమని తెలిసిపోతుంది కాబట్టి.
4. మీరే లోకం అంటారు
మీరు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీరంటే ఎంతో ఇష్టపడుతున్నట్లు చెప్పేస్తారు. వాళ్ల సంభాషణ కూడా డియర్, స్వీట్ హార్ట్, డాళింగ్ ఇలా సాగిపోతుంటుంది. మీరు లేకపోతే బతకలేమన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.
5. ప్రైవేటు ఫోటోలు అడుగుతారు
మీరు కాస్త దగ్గరవగానే ప్రైవేటు ఫోటోలు అడుగుతారు. ఇవ్వకపోతే నామీద నమ్మకం లేదా? మన బంధం ఇంతేనా లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్‌కి దిగుతారు. వాళ్లేం చేసినా ఆ వ్యక్తిని నేరుగా కలిసి ఓకే చేసుకునే వరకు అలాంటి పర్సనల్ ఫొటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకండి.
6. సెంటిమెంట్‌తో కొడతారు
తాము వేరేవాళ్ల చేతిలో మోసపోయామని, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లవ్ దొరకలేదని, తనకు ఎవరూ మనసుకు దగ్గరయిన వాళ్లు లేరని మనసును తాకేలా కథలు చెబుతారు. కరిగిపోయి ఏమాత్రం సానుభూతి చూపించినా మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఫేస్బుక్ ఐడీ లాంటివి అడుగుతారు. ఆ ఎమోషనల్ డ్రామాకు లొంగి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు ఇవ్వకండి.
7. కలవడానికి ఇష్టపడరు
మీరు వాళ్లను కలుద్దామన్నా ఎంత ప్రయత్నించినా దొరకరు. తాము విదేశాల్లో ఉన్నామనో, జాబ్‌లో సెలవు దొరకడం లేదనో ఏదో కహానీ చెబుతారు. మ్యాగ్జిమం మిమ్మల్ని కలవకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఫ్లైట్ టికెట్ నకిలీది సృష్టించి తాము రావాలనుకుంటున్నట్లు మీకు చూపించి నమ్మిస్తారు.చివరిలో ఏదో అర్జంట్ పని ఉండి ఆగిపోయామని చెబుతారు.
8 సడెన్‌గా డబ్బులడుగుతారు
తాము అనుకోకుండా ఓ ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఇరుక్కున్నామని చెబుతారు. లేదంటే బిల్లు ఆగిపోయిందని, తాను ఇప్పుడు అర్జెంటుగా వేరేవాళ్లకు కట్టకపోతే తనకు చాలా ప్రమాదమని చెబుతారు. క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ చెప్పమని బలవంతపెడతారు. కొంతమంది మన ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తున్నామంటూ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంత డబ్బు వేయమని అకౌంట్లో వేయించుకుని అవి మింగేస్తారు.
ఇప్పటికే ఫేస్చేస్తున్నారా?
* పైన చెప్పినవి ఇప్పటికైనా ఎవరైనా ఫేస్చేస్తుంటే వెంటనే ఆ డేటింగ్ వెబ్‌సైట్‌కు కంప్లయింట్ చేయాలి. ఆ సైట్ అలాంటి స్కామర్లను బ్లాక్ చేసేస్తుంది.
* ఇప్పటికే మీ బ్యాంక్ డిటెయిల్స్ లేదా క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ వారికి షేర్చేసి ఉంటే వెంటనే బ్యాంక్‌కు కాల్ చేసి వాటిని బ్లాక్ చేయించండి. మీ ఆన్లైన్ పాస్‌వర్డ్‌లన్నీ మార్చేయండి.
* అయినా వాళ్లు మిమ్మల్నిఇబ్బంది పెడుతుంటే సైబర్ పోలీసుల్ని సంప్రదించండి.