ఈ రోజు విడుదలైన సినిమా ఆ రోజు సాయంత్రమో లేదో మరుసటి రోజో మన మొబైలోకో లేదో సీడీ రూపంలోనూ వచ్చేస్తే నిర్మాతలకు, ఆ సినిమాలో పని చేసిన వాళ్లకు ఎలా ఉంటుంది? ఇప్పుడు సినిమా రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్తగా విడుదలైన సినిమాల ప్రింట్లు సంపాదించిన వెంటనే తమ సైట్లలో పెట్టి పేజీ వ్యూలను పెంచుకునే పనిలో ఉన్నారు వెబ్సైట్ అడ్మిన్లు. చాలా వెబ్సైట్లు ఇలాగే పైరసీ కంటెంట్‌తో పేజీలకు పేజీలు నింపేస్తున్నాయి. చిన్న చిన్న వార్తలైతే ఫర్వాలేదు కానీ ఏకంగా సినిమాలనే కాపీ కొట్టి నేరుగా సైట్లలో పెట్టేస్తున్నారు. తమిళ్ గన్.కామ్ అనే సైట్ అదే కోవకు చెందుతుంది. కొత్త సినిమాలను హెచ్డీ క్వాలిటీతో అందించడమే ఈ సైట్ ప్రత్యేకత. అందుకే ఈ సైట్‌కు ఒక రేంజ్లో ఆదరణ ఉంది. ఈ వ్యవహారాన్నంతా చాలా కాలంగా చూస్తున్న తమిళ ఇండస్ట్రీ చివరికి రంగంలోకి దిగింది. హీరో విశాల్ నేతృత్వంలోని నిర్మాతల మండలి ఈ పైరసీ సూత్రధారిని ట్రాక్ చేసి పట్టుకుంది.
పేరు.. గౌరి శంకర్
ఇది సినిమా టైటిల్ కాదు.. పైరసీ సూత్రధారి పేరు. తమిళ్ గన్.కామ్ కూడా అతనిదే. ఇదే కాదు అతను మరో 33 వెబ్సైట్లు నడుపుతున్నాడు. వీటిలో పోర్నోగ్రఫీ సైట్లు కూడా ఉన్నాయి. అతను కొంతమంది వ్యక్తులతో కలిసి చాలా కాలంగా సైట్లను నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గౌరి శంకర్ యాక్టివిటీస్ మీద చాలా కాలంగా కన్నేసిన విశాల్ బృందం..అతణ్ని పోలీసులకు పట్టించింది. అయితే గౌరిశంకర్ కేవలం అందులో సూత్రధారి మాత్రమే చాలామంది ఈ సైట్లతో సంబంధం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీనిపై లోతుగా దర్యాప్తు నిర్వహించి మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని వారు చెప్పారు.
తన టెకీ స్కిల్స్‌తో...
సాఫ్ట్వేర్ రంగంలో గౌరి శంకర్‌కు మంచి పట్టు ఉంది. అతను కొంత కాలంగా ఒక నెట్ సెంటర్‌ను కూడా నడుపుతున్నాడు. అయితే తామే ఒక పెద్ద సైట్ పెడితే మంచిగా సంపాదించొచ్చని ఆలోచించాడు. మామూలు సైట్ పెడితే సరిపోదని ఏకంగా సినిమా సైట్‌నే పెట్టేశాడు.అంటే సోర్సుల ద్వారా కొత్త సినిమాలకు సంబంధించిన లింక్స్‌ను సంపాదించి వాటిని తమ సైట్లలో అప్లోడ్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నాడు. తద్వారా యాడ్ రెవిన్యూతో పాటు బయట నుంచి ఆదాయం కూడా పొందుతున్నాడు. అయితే పైరసీ వీడియోలు, సినిమాల గొడవ రోజు రోజుకూ ముదరడంలో హీరో విశాల్ స్వయంగా రంగంలోకి దిగి... గౌరి శంకర్ ఆట కట్టించాడు.