మీ ఫ్రెండ్స్ ఫిట్‌గా లేరా? అయితే వాళ్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, సిటీ పేరు వంటి వివరాలివ్వండి. నేను వాళ్లతో పెప్‌టాక్ చేస్తా (ఉత్సాహపరుస్తాను) అని క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఓ బ్యాంక్ ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా సచిన్ తన ఫాలోయర్లకు చేసిన ఈ ట్వీట్ పై సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పర్సన్ డిటైల్స్ ( పేరు, ఫోన్‌నెంబర్, మెయిల్ ఐడీ వంటివి) ఆ వ్యక్తికి తెలియకుండా బయటపెట్టడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. అందునా సచిన్ లాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సెలబ్రిటీ ఇలాంటి ట్వీట్లు చేయడంపై అభ్యంతరం ప్రకటించారు.
సరిదిద్దుకున్న సచిన్ టీమ్
దీనిపై ట్రోయ్ హంట్ అనే సెక్యూరిటీ రీసెర్చర్ సీరియస్‌గా రీట్వీట్ చేశారు. సచిన్ లాంటి ఫేమస్ క్రికెటర్ మీ ఫ్రెండ్స్ నెంబర్స్ ఇవ్వండి.. నేను మాట్లాడతా అంటే దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందో ఊహించరా? ఇలా ఫోన్ నెంబర్లను ట్విట్టర్ లాంటి ఓపెన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇమ్మని ఎలా అడుగుతారు అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీలాంటి పర్సనల్ డిటెయిల్స్‌ను ఇలా బయటపెడితే మార్కెటింగ్ సంస్థలకే కాదు ఆన్లైన్లో ఫ్రాడ్ చేసేవారికి, కూడా అవకాశమిచ్చినట్లే. సచినే కాదు ఎవరూ ఇలాంటి వివరాలను ఓపెన్‌గా అడక్కుండా ఉండడమే మంచిదని హంట్ ట్వీట్ చేశారు. సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉండే ప్రమాదముందని చాలా మంది రీట్వీట్ చేశారు.
డిలీట్ చేసినా ఆగని రెస్పాన్స్
ట్వీట్‌పై సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో టెండూల్కర్ సోషల్ మీడియా టీమ్ దాన్ని వెంటనే తొలగించింది. మీ ఫ్రెండ్స్ నెంబర్లు ఇస్తే కొంతమందిని సెలెక్ట్ చేసి నేనే మాట్లాడతా అని సచిన్ ఈ ట్వీట్లో చెప్పడంతో ఇప్పటికీ చాలా మంది దీనికి రిప్లై ఇస్తూనే ఉన్నారు.