కంప్యూటర్లు, మొబైల్‌లు హ్యాక్ అవడం గురించి మీకు తెలుసు. మరి స్మార్ట్ టీవీలు హ్యాక్ అయితే! ఏంటి సరదాగా అంటున్నారా! కాదండీ ఇది నిజం! కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లే కాదు ఇప్పుడు స్మార్ట్‌టీవీలు కూడా హ్యాక్ అయిపోతున్నాయి. ఇటీవల కొన్ని స్మార్ట్ టీవీలు హ్యాక్ అయిన సంఘటనలు రిపోర్ట్ కావడమే దీనికి నిదర్శనం. మరి స్మార్ట్ టీవీలు ఎందుకు హ్యాక్ అవుతున్నాయి.. దీని వల్ల ఏంటి ఉపయోగం? అసలు స్మార్ట్ టీవీల హ్యాకింగ్ ఎలా సాధ్యం?
అచ్చంగా కంప్యూటర్ల మాదిరే...
టీవీలకు కంప్యూటర్లకు సంబంధం ఒకటే మానిటర్. ఈ రెండు మానిటర్లు దాదాపు సమానమే. ఇప్పుడు ఎల్సీడీ, ఎల్ఈడీ మానిటర్లు వచ్చాక టీవీలేవో కంప్యూటర్లేవో తెలుసుకోలేని పరిస్థితి వచ్చేసింది. మానిటర్ తప్ప మిగిలిన విషయాల్లో ఈ రెండింటికి ఏం సంబంధం లేదన్నది సాధారణంగా మన అంచనా. కానీ టీవీలు కూడా స్మార్ట్ అయిపోయిన తర్వాత మన అంచనాలు పటాపంచలైపోయాయి. కంప్యూటర్, మొబైల్స్‌తో పాటు టీవీలకు కూడా హ్యాకింగ్, బగింగ్ ప్రాబ్లమ్స్ పొంచి ఉన్నాయి.
వైఫై వల్లేనా...
స్మార్ట్ టీవీ ఉందంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. లేదా వైఫై ద్వారా ఉపయోగించుకుంటాం. ఇదే హ్యాకర్లు చొరబడేందుకు పెద్ద మార్గం. మన టీవీలో సరిగ్గా సెక్యూరిటీ సిస్టమ్ లేకపోతే వెంటనే హ్యాకర్ల వాలిపోతారు. టీవీలో కీలకమైన సమాచారాన్ని దోచుకుంటారు. మనం స్మార్ట్ టీవీలో కొన్ని ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు, ఫొటోలు కూడా దాచుకోవచ్చు వీటిని కూడా మిస్ యూజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కాపాడుకునేదెలా?
కంప్యూటర్లను, ఫోన్లను కాపాడుకున్నట్లే స్మార్ట్ టీవీలను కూడా రక్షించుకోకపోతే మన విలువైన డేటా తస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి. టీవీలకు కూడా పాస్వర్డ్లు ఉంటాయి వాటిని ఫిక్స్ చేసుకోవాలి. ఇక టీవీల దగ్గర్లో కన్వర్సేషన్ చేయకపోవడం బెటర్. స్మార్ట్ టీవీలకు యాంటీ వైరస్ ఇన్‌స్టాలేషన్స్ ఉంటాయి. వాటిలోనూ బెస్ట్ ఎంచుకోవాలి. వీలైనంత తక్కువగా ఇంటర్నెట్ వాడాలి. వైఫై అవసరం తీరిన తర్వాత వెంటనే డిస్కనెక్ట్ చేయడం ముఖ్యం. రాత్రి వేళల్లోనూ అలా వదిలేయడం చాలా ప్రమాదం.