• తాజా వార్తలు

ఇన్ కం టాక్స్ ఎగ్గొడతారా?...

అయితే మిమ్మల్ని పట్టుకోవడానికి IT వారు టెక్నాలజీ ని ఎలా వాడుతున్నారో తెలుసుకోండి

వెంటనే టాక్స్ కట్టడానికి క్యూ లో ఉంటారు.

మీ సంవత్సరాదాయం ఎంత ఉంది ? మీరు ఇన్ కం ట్యాక్స్ పరిధి లోనికి వస్తున్నారా? అయినా కట్టకుండా ఎగవేత ధోరణితో ఉంటున్నారా? లేక మీ ఆదాయాన్ని దాచేస్తున్నారా? అయితే ఇకపై ఇది ఎంత మాత్రం కుదరదు. మీరు మీ ఆదాయ వివరాలు వెల్లడించినా, వెల్లడించకపోయినా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అది తెలిసిపోతుంది. మీరు పన్ను కట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదెలాగో మీరే చూడండి.

మీరు ఒక కార్ కొంటున్నారని అనుకోండి. దాని ఖరీదు సుమారు 11 లక్షల రూపాయలు ఉంది అనుకోండి. ఆ షో రూమ్ వాళ్ళు మీకు ఇచ్చిన ఇన్ వాయిస్ ధరకు అదనంగా మరొక 11 వేల రూపాయలు అంటే అ కార్ యొక్క ధర మొత్తం లో 1 శాతం మీరు చెల్లించవలసి ఉంటుంది. దీన్నే TCS అంటారు. TCS అంటే  tax collected at source.

TCS అంటే ఏమిటి?

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు TCS అంటే Tax Collected at Source. 10 లక్షలు దాటిన ప్రతీ కొనుగోలుపై వినియోగదారుడు 1 శాతం అదనంగా చెల్లించవలసిన సొమ్ము ఇది. ఇదేమీ కొత్తగా ప్రవేశపెట్టిoది కాదు.. ఇన్ కం టాక్స్ చట్టం 206 C , 1961 లోనే దీనిని ప్రతిపాదించడం జరిగింది. 2012 వ సంవత్సరం నుండీ ఇది అమలులో ఉంది. అయితే అమ్మకందారులు ఏదో ఒక మాయ చేసి దీనిని కనపడనీయకుండా వేరే పన్నుల్లో కలిపేవారు. దీనివలన వినియోగదారునికి కూడా లాభం ఉండడం తో ఇది బయటకు వచ్చేది కాదు. కానీ ఇకపై అలా జరగడానికి వీల్లేదు. ఇన్ వాయిస్ ధర కాకుండా ఈ TCS ను ప్రత్యేకంగా జమ చేయవలసి ఉంటుంది. అంతేగాక కొనుగోలుదారుల యొక్క పూర్తీ వివరాలు అంటే వారి ఆర్థిక స్థితి గతులతో సహా ఈ TCS తో పాటు ఆదాయ పన్ను శాఖ కు సమర్పించవలసి ఉంటుంది. సదరు వివరాలన్నీ ఆదాయ పన్ను శాఖ తన దగ్గర ఉంచుకుని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది.

   మన దేశం లో 660 మిలియన్ ల మంది అంటే సుమారు 66 కోట్ల మంది ఏదో ఒక పనిచేస్తూ ఉండగా వీరిలో కేవలం 39.1 మిలియన్లు అంటే 3.91 కోట్ల మంది మాత్రమే 2014/15 లో ఆదాయ పన్ను చెల్లించారు. వీరిలో కూడా 93,76,033 మంది మాత్రమే తమ సంవత్సరాదాయం 5 లక్షల రూపాయలు కు పైగా ఉన్నాడని అంగీకరించారు.  దీనికి ప్రధాన కారణం మన దేశం లో ఉన్న ఆదాయ చట్టాలు . ఇండియా లో ఆదాయ పన్ను అనేది కట్టేవాడి ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. అంటే ఎవడి ఆదాయం వాడు ప్రకటించినపుడు మాత్రమే ఇన్ కం టాక్స్ కలెక్ట్ చేయడం సులువు అవుతుంది. కఠోర వాస్తవం ఏమిటంటే సంవత్సరానికి రెండున్నర లక్షల పైన సంపాదించేవారు మన దేశం లో చాలా మంది ఉంటారు. అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే తమ ఆదాయాన్ని ప్రకటిస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే అవడం గమనార్హం. లేకపోతే వీరు కూడా ప్రకటించే వారు కాదేమో!

ఈ పరిస్థితిని రూపు మాపడానికి దేశం లో మరింత మందిని ఆదాయ పన్ను పరిధి లోనికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుంది. అందులో భాగం గానే TCS ను బలోపేతం చేసింది. కొన్ని సంవత్సరాల నుండీ దేశం లోని వ్యక్తుల ఆదాయ వివరాలు మరియు బ్యాంకు లావాదేవీ లను ఉపయోగించి ఒక అతి పెద్ద డేటా బేస్ ను ఏర్పాటుచేసింది. దీని సహాయం తో మొండి బకాయి దారుల మరియు పన్ను ఎగవేత దారుల భరతం పట్టడానికి నిశ్చయించుకుంది. అదెలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం .

మొదటి దశ :-

మొదటి దశ లో భాగంగా Non filers Monitoring System ( NMS ) ను 2013 లోనే  ఏర్పాటు చేసింది. పన్ను ఎగవేతదారులుగా అనుమానిస్తున్న వారి యొక్క సమగ్ర వివరాలను మూడు రకాలుగా సేకరించి డేటా బేస్ లో ఉంచుతారు. మొదటగా ఒక నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ విలువ కలిగిన ఫిక్సడ్ డిపాజిట్ లపై వచ్చే Annual Information Return ( AIR ) ద్వారా సేకరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారి వివరాలను కూడా సేకరిస్తారు.  అలాగే ఏదైనా ప్రాపర్టీ ని కొన్నపుడు లేదా విపరీతంగా క్రెడిట్ కార్డు ను ఉపయోగిస్తునపుడు ఇలా పైన చెప్పుకున్న అన్ని సందర్భాల లోనూ బ్యాంకు లు, అమ్మకం దారులు  మరియు ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ ల, కొనుగోలుదారుల వివరాలను ఆదాయ పన్ను శాఖ కు సమర్పిస్తారు. దీనితో పాటు TCS చెల్లింపుదారుల జాబితానూ, Tax Deduction at Source ( TDS ) యొక్క డేటా తో కలిపి నిశితంగా పరిశీలిస్తారు. 

ఎవరిమీదైనా అనుమానం వస్తే ఆదాయ పన్ను శాఖ లో భాగమైన CIB ( Centralised Information Branch )  కు రిపోర్ట్ చేస్తారు. వీరు వెంటనే సదరు వ్యక్తులపై దాడి చేసి వారి చే పన్ను కట్టిస్తారు. పన్ను తో పాటు జరిమానా కూడా ఉండే అవకాశం ఉంది. 2013 లో ఈ NMS ను ప్రారంభించాక ఇప్పటివరకూ ఈ విధంగా సుమారు రూ 12,000 కోట్ల రూపాయలను భారత ఆదాయ పన్ను శాఖ వసూలు చేసింది.

దీని తదుపరి చర్యలేమిటి?

ఈ NMS ప్రయోగం విజయవంతం అవడం తో 2017 మే నుండీ Project Insights అనే మరొక కార్యక్రమాన్ని ఆదాయ పన్న శాఖ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం లో మానవ ప్రమేయం తక్కువగా ఉంటుంది. మనం పైన ఉదాహరించిన లావాదేవీ లన్నింటినీ ఒక అధునాతన సాఫ్ట్ వేర్ పరిశీలిస్తుంది. అనుమానితులు లేదా పన్ను ఎగవేత దారులు ఎక్కడ ఏది ఖరీదు చేసినా GPS ద్వారా వారు ఖరీదు చేసిన ప్రదేశo అక్షాంశాల , రేఖాంశాల తో సహా ఈ సాఫ్ట్ వేర్ గ్రహిస్తుంది. ఒక ప్రత్యేక మైన అల్గోరిథం ద్వారా ఈ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. బ్యాంకు లు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు, ఇతర కంపెనీలు, అన్నీ దీని పరిధిలోనికి వస్తాయి. ఇవన్నీ తమ కస్టమర్ ల వివరాలను విధిగా సమర్పించవలసి ఉంటుంది. ఆస్తులు కొన్నపుడు రిజిస్టర్ చేయిస్తారు కాబట్టి ఆ సమాచారం ఎటూ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. అంతేగాక విదేశాల్లో ప్రత్యేకించి US, జి 20 దేశాలు, OECD దేశాలలో ఉన్న కంపెనీలు మరియు పెట్టుబడిదారులు కూడా తమ వివరాలను భారత ఆదాయపన్ను శాఖతో పంచుకుంటారు. కాబట్టి మీరు డబ్బు విదేశాల్లో కూడా దాచుకోలేరు.  ఇలాంటి డేటా బేస్ ను 1995 నుండీ తయారు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. డీ మానిటైజేషన్ ప్రభావం వలన నగదు ఆర్థిక వ్యవస్థ స్థానం లో నగడు రహిత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న నేపథ్యం లో ముందు ముందు దాదాపు అన్ని లావాదేవీలు ఎలక్రానిక్ పద్దతిలోనే జరిగే అవాకాసం ఉన్నది. దీనితో ప్రతీ లావాదేవీ యొక్క సమాచారాన్నీ ఆదాయ పన్ను శాఖ నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది. మీర్రు ఒకవేళ ఆదాయ పన్ను పరిధి లో ఉన్నట్లైతే వెంటనే పన్ను చెల్లించండి. లేకుంటే జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నదీ ఒక వ్యవస్థ గమనిస్తూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త.!

జన రంజకమైన వార్తలు