• తాజా వార్తలు
  •  

ఆ వెబ్ సైట్లో బాహుబలి టిక్కెట్లు కొంటే మోసపోయినట్లే

బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను ఆ వెబ్ సైట్ క్యాష్ చేసుకోవాలనుకుంది. ప్రేక్షకులను మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. అందులో కొంత వరకు సఫలమై చాలామందిని మోసగించిన తొందరలోనే మోసం బయటపడింది. వివిధ థియేటర్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో టిక్కెట్‌ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్‌ నేరాల అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి అది నకిలీ వెబ్ సైట్ అని తేల్చారు.

టిక్కెట్ 120
బాహుబలి-2 సినిమా టిక్కెట్ల విక్రయం కోసం కొత్తగా www.newtickets.in పేరిట ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు హైదరాబాద్‌తోపాటు అమెరికా, ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు అందులో చూపిస్తోంది. సైట్‌లోకి వెళ్లాక సినిమాహాళ్ల పేర్లన్నీ చూపిస్తూ, సీట్లు కూడా ఖాళీ ఉన్నట్లు చూపిస్తోంది. టిక్కెట్లు బుక్‌ చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు చెల్లించగానే ఆ అంశాన్ని కన్ఫర్మ్ చేస్తూ వెంటనే ఫోన్‌కు సందేశం వస్తుంది. ఒక్కో టిక్కెట్‌ రూ.120 చొప్పున అమ్ముతున్నారు.

హౌస్ ఫుల్ అయినా ఖాళీగానే..
సాధారణంగా ఒక టిక్కెట్ల విక్రయ వెబ్ సైట్లో అన్ని థియేటర్లూ ఉండవు. కానీ, ఇందులో దాదాపుగా అన్ని థియేటర్లూ ఉన్నాయి. అంతేకాదు... ఆల్రెడీ టిక్కెట్లు అయిపోయిన థియేటర్లలోనూ భారీగా ఖాళీలు చూపిస్తోంది. దీంతో అనుమానించి తెలంగాణ సీఐడీ సైబర్‌ నేరాల విభాగానికి కంప్లయింట్ చేయడంతో వారు అసలు సంగతి తేల్చారు. అంతేకాదు... థియేటర్ల వారు కూడా ఆ వెబ్ సైట్ తో తాము ఒప్పందాలు చేసుకోలేదని చెబుతున్నారు.

ఐపీ అడ్రస్ దుబాయ్ లో
ఈ సైట్‌కు ఐపీ అడ్రస్ దుబాయిలో ఉంది. కోయంబత్తూర్‌ చిరునామాతో ఈ నెల 7న వెబ్‌సైట్‌ రిజిష్టర్ అయింది. ఏడాది కోసం సర్వర్‌ను లీజుకు తీసుకున్నారు. పేమెంట్ల కోసం ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకున్నారు. అయితే... ఇది నకిలీ వెబ్ సైట్ అని సీఐడీ సైబర్‌ నేరాల విభాగం అధికారులు చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు