హైదరాబాద్‌కు చెందిన శ్వేతకు గత నెల 30న ఓ కాల్ వచ్చింది. మేం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అబ్యూజ్ అయింది. కాబట్టి దీన్ని ఒక్కరోజులో డిలీట్ చేస్తున్నాం. మీ అకౌంట్ సస్పెండ్ కాకుండా ఉండాలంటే మీ అఫీషియల్ బిజినెస్ ఐడీ బదులు పర్సనల్ ఈ మెయిల్ ఐడీతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను లింక్ చేసుకోండి.. అనేది సారాంశం. ఉమెన్స్ గిఫ్ట్ షాప్ నడుపుతున్న శ్వేతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12వేల మంది, ఫేస్బుక్లో మరో 1000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. వైజాగ్‌లో ఉమెన్స్ క్లాత్ స్టోర్ రన్ చేస్తున్న స్వాతి కి కూడా ఇలాంటి కాలే వచ్చింది. మేం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫేస్బుక్ పేజీని చాలా మంది అబ్యూజ్ చేస్తున్నారు. దాన్ని వెరిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)ను చెప్పండి అని కాల్ చేశారు. స్వాతికి కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ కలిపి మొత్తం 35వేల మంది వరకు ఉన్నారు. అయితే ఈ రెండు కాల్స్ ఒకే నంబర్ నుంచి వచ్చాయి. శ్వేత వెంటనే తన పర్సనల్ మెయిల్ ఐడీతో లింక్ చేసింది. అర్ధగంటలోనే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆ ఫేస్బుక్ పేజీలో డిటెయిల్సన్నీఛేంజ్ చేసేశాడు. ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ కూడా మార్చేశాడు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్నవారి పేజీలను హైజాక్ చేసి డబ్బులు గుంజే క్రైమ్ ఇలాగే జరుగుతోంది.
ఎలా జరుగుతుంది?
ప్రతి ఫేస్బుక్ అకౌంట్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌తో లింక్ అయి ఉంటుంది. స్కామ్ చేసేవాళ్లు forgot password లింక్‌ను క్లిక్ చేస్తారు. దీనితో ఆ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ వెళుతుంది. వెంటనే స్కామ్ చేసేవాళ్లు ఆ అకౌంట్ హోల్డర్‌కు ఫోన్ చేసి తాము సైబర్ క్రైమ్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ అకౌంట్ థ్రెట్లో ఉందికాబట్టి ఓటీపీ చెప్పమని గట్టిగా మాట్లాడతారు. ఓటీపీ చెబితే వెంటనే ఆ అకౌంట్క్ లింకయి ఉన్న మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ మార్చేస్తారు. ఇక రెండో పద్ధతి మీ అకౌంట్ థ్రెట్లో ఉంది. దాన్ని పర్సనల్ మెయిల్ ఐడీతో లింక్ చేసుకోమని ఫోన్ చేస్తారు. అలా లింక్ చేస్తే వెంటనే దాన్ని హ్యాక్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఇలా రకరకాల కాంబినేషన్స్ ట్రై చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసి హ్యాక్ చేస్తారు. తర్వాత సోషల్ మీడియా అకౌంట్లో మెయిల్ ఐడీ ఫోన్ నెంబర్ మార్చేస్తారు. అంటే అన్నివేల లైక్స్, షేర్స్, ఫ్రెండ్, ఫాలోయర్స్ స్కామ్గాళ్ల చేతికి వెళ్లినట్టే. మీ అకౌంట్ మీ బిజినెస్కో లేదా పర్సనల్‌గా చాలా అవసరం కాబట్టి వాళ్లు దాన్ని మీకు తిరిగివ్వడానికి అకౌంట్ క్యాపబులిటీని బట్టి 20 వేల నుంచి 50వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. శ్వేతను ఇలాగే 5వేలు డిమాండ్ చేశారు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో చివరకు వెయ్యి రూపాయలకు దిగొచ్చారు. కొంతమందైతే ఇలా హ్యాక్ చేసిన అకౌంట్లను వేరేవాళ్లకు అమ్మేస్తున్నారు. అందులో ఉన్న ఫాలోయర్స్ సంఖ్యను బట్టి 1000 రూపాయల నుంచి 50 వేల వరకు కూడా బేరాలు నడుస్తున్నాయి.
ఫేస్బుక్ ఏమంటోంది?
శ్వేత దీని గురించి ఫేస్‌బుక్‌కు మెయిల్లో కంప్లయింట్ చేసింది. మేం ప్రైవసీ విషయంలో పక్కాగానే ఉంటాం. ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. కానీ మీరు చెప్పారు. ఈ విషయంలో మేమేమీ చేయలేమని ఫేస్బుక్ నుంచి రిప్లయి వచ్చింది. అయితే సోషల్ మీడియా కంపెనీలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి ఓ గ్రీవెన్స్ సెల్ పెట్టి దాని ఆఫీసర్ నెంబర్‌ను యూజర్లందరికీ అందుబాటులో ఉంచాలని రూల్ ఉంది. కానీ దాన్ని కంపెనీలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఓటీపీ చెప్పొద్దు. మీ అకౌంట్ డిటెయిల్స్‌ను మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లనో ఎవరో కాల్ చేసి చెప్పారని మార్చొద్దు.