• తాజా వార్తలు
  •  

బిట్ కాయిన్ బేస్డ్ తత్కాల్ రైల్ టికెట్ స్కాం చేసిన సిబిఐ టెకీ

మీరెపుడైనా తత్కాల్ లో టికెట్ లు బుక్ చేశారా? అయితే ఆ కష్టం మీకు తెలిసే ఉంటుంది. రైల్వే స్టేషన్ కు వెళ్లి కౌంటర్ లో సుమారు గంట కంటే ఎక్కువసేపే క్యూ లో నిలబడితే మన అదృష్టం బాగుంటే టికెట్ ఉంటుంది లేకపోతే లేదు. అయితే ఇక్కడ ఒక మోసగాడు ఉన్నాడు. అతను కేవలం ఒక సెకను వ్యవధిలోనే వందల కొద్దీ తత్కాల్ టికెట్ లను బుక్ చేసే సాఫ్ట్ వేర్ ను కనిపెట్టాడు. ఫలితంగా ఊచలు లెక్కపెడుతున్నాడు. ఒక సిబిఐ టెకీ. తను ఇంతకుముందు irctc లో ఉద్యోగం చేసిన అనుభవాన్ని ఉపయోగించి సెకన్ల వ్యవధిలోనే వందలకొద్దీ తత్కాల్ టికెట్ లను బుక్ చేసే ఒక మ్యాజికల్ సాఫ్ట్ వేర్ ను రూపొందించాడు. తత్కాల్ సిస్టం ను మోసం చేయడానికి అతను సిబిఐ వనరులను వాడుకోవడమే గాక పేమెంట్ ల కోసం బిట్ కాయిన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.అదృష్టవశాత్తూ ఆ స్కాం బయట పడింది. అతడిని అరెస్ట్ చేసారు.

అసలు ఇది ఎలా జరిగింది ?

సిబిఐ లో అసిస్టెంట్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న అజయ్ గార్గ్ తన స్నేహితుడు అయిన అనిల్ గుప్తా తో కలిసి ఈ తత్కాల్ ర్యాకెట్ ను తయారు చేశాడు. అజయ్ 2012 వ సంవత్సరం లో సిబిఐ లో జాయిన్ అయ్యాడు. అంతకుముందు 2007 నుండీ 2011 వరకూ నాలుగు సంవత్సరాల పాటు irctc లో పనిచేశాడు. అక్కడ ఉద్యోగం చేసిన అనుభవం తో తత్కాల్ సిస్టం ను మోసం చేసే ఒక పద్దతిని కనిపెట్టాడు. దీనికోసం అతను ఉన్నత స్థాయి సిబిఐ వనరులను వాడుకున్నాడు. తద్వారా ఒక్క క్లిక్ లోనే వందల కొద్దీ తత్కాల్ టికెట్ లను బుక్ చేసే ఒక సాఫ్ట్ వేర్ ను రూపొందించాడు. అతని సహాయకుడు అయిన అనిల్ గుప్తా ఈ టికెట్ లను ట్రావెల్ ఏజెంట్ లకు అమ్మే బాద్యత ను తీసుకున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు కొందరు బిట్ కాయిన్ లు, హవాలా మరియు ఇతర మార్గాల ద్వారా చట్ట వ్యతిరేకమైన లావాదేవీలు నిర్వహించేవారు. వీరందరినీ సిబిఐ అరెస్ట్ చేసింది.

సిబిఐ అధికారుల చెబుతున్న దాని ప్రకారం అసలు irctc సిస్టం లోనే కొన్ని లోపాలు ఇంకా ఉన్నాయి, అందువలన నే ఇలాంటి మోసానికి గురికావలసి వచ్చింది అని చెప్పారు. ముంబాయి, ఢిల్లీ తదితర  14 లొకేషన్ లలో రైడింగ్ చేసిన సిబిఐ అధికారులు మొత్తం 89 లక్షల రూపాయల నగదు, 61 లక్షల రూపాయల విలువచేసే నగలు, 15 ల్యాప్ ట్యాప్ లు, 15 హార్డ్ డిస్క్ లు, 52 మొబైల్ ఫోన్ లు, 24సిమ్ కార్డు లు,10 నోట్ బుక్స్ , 6 రూటర్ లు,4 డోంగిల్ లు  మరియు 19 పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు.   

సాధారణంగా తత్కాల్ టికెట్ లు ప్రయాణ తేదీ కి ఒక రోజు ముందు జారీ చేయడం జరుగుతుంది. AC టికెట్ లు ఉదయం 10 గంటల నుండీ నాన్ AC అయితే 11 గంటల నుండీ ప్రారంభం అవుతాయి. ఒక్కో ప్రయాణికునికి తత్కాల్ లో టికెట్ బుక్ చేయడానికి కనీసం 120 సెకన్ లు అంటే రెండు నిముషాలు పడుతుంది. కానీ ఇతను మాత్రం ఒక్క క్లిక్ లోనే వందల కొద్దీ తత్కాల్ టికెట్ లను బుక్ చేయగలిగాడు. ఈ సాఫ్ట్ వేర్ లో ముందుగానే ప్రయాణికుని వివరాలు అన్నీ ఫిల్ చేసి ఉంటారు.తత్కాల్ సమయం మొదలయ్యాక ఒక్క క్లిక్ తోనే వీరందరికీ టికెట్ లు బుక్ అయిపోతాయి. ఈ క్రమంలో ఇది irctc క్యాప్చా, బ్యాంకు OTP లాంటి అవసరమైన విషయాలను పక్కదారిపట్టించి వేలకొద్దీ US ఆధారిత ప్రాక్సీ సర్వర్ ల ద్వారా వేల సంఖ్య లో టికెట్ లను బుక్ చేసేవాడు. ఈ పనులన్నీ చేయడానికి అతనికి irctc లో పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది.

ఇందులో కొసమెరుపు ఏమిటంటే రైల్వే అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ టికెట్ లన్నీ జెన్యూన్ టికెట్ లే. వీటివలన రైల్వే లకు ఏ విధమైన ఆర్థిక నష్టం సంభవించలేదు. కాకపోతే సెకన్ల వ్యవధిలోనే టికెట్ లన్నీ అమ్ముడు పోవడం వలన ఇప్పటివరకూ కొన్ని లక్షల మంది సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

తత్కాల్ టికెట్ లు ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఎందుకు క్లోజ్ అయిపొతాయో, కొంతమంది ఏజెంట్ లు మాత్రం వీటిని ఎలా ఇవ్వగలుగుతున్నారో  ఇప్పుడు అర్థం అయిందా ? అజయ్ మరియు అతని టీం ప్రస్తుతానికి జైలు లో ఉన్నారు. విచారణ కొనసాగుతుంది.

జన రంజకమైన వార్తలు