ఆంధ్రా బ్యాంకు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యంత కీలకమైంది. భారీ స్థాయిలో కస్టమర్లున్న ఈ బ్యాంకు ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ దిశగా ఖాతాదార్లను ప్రోత్సహిస్తోంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను మరింత పెంచేందుకు ఖాతాదారులందరూ నెట్‌బ్యాంకింగ్ ను వినియోగించుకోవడం ఉత్తమం. అందుకు ఏం చేయాలో.. నెట్ బ్యాంకింగ్‌ను ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి..
ఆంధ్రా బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలంటే లాగిన్ ఐడీ, లాగిన్ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉండాలి. లాగిన్ ఐడీ అంటే ఖాతాదారుకు ఇచ్చే కస్టమర్ ఐడీ. లాగిన్ పాస్వర్డ్ ను బ్యాంకు మీ చిరునామాకు కవర్లో పంపిస్తుంది. ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్‌ను మీరు మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.
* ఆంధ్రా బ్యాంకు.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి డౌన్లోడ్ అప్లికేషన్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే పలు అప్లికేషన్లు కనిపిస్తాయి. ఆంధ్రా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఫాంను పీడీఎఫ్ ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిచేసి మీ బ్రాంచిలో ఇస్తే మీకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు.
* డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఆన్‌లైన ఆంధ్రా బ్యాంకు. నెట్.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి నెట్ బ్యాంకింగ్ కోసం ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ కస్టమర్ ఐడీని, మీ బ్యాంకు అకౌంట్లో రిజిస్టరయిన మీ మొబైల్ నెంబర్ సాయంతో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి?
ఆంధ్రా బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేస్తే హోం పేజీలోకి వెళతారు. దీనిలో టాప్‌లోనే అకౌంట్స్, పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్స్, టాక్స్ పేమెంట్స్, డొనేషన్స్ వంటి పలు కేటగిరీలు కనిపిస్తాయి.
ఖాతా వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షం
అకౌంట్స్‌లో మీ ఆపరేటివ్ అకౌంట్స్, డిపాజిట్ అకౌంట్స్, లోన్ అకౌంట్స్, టాక్స్ డిడక్షన్ వివరాలు అన్నీ ఉంటాయి. వీటిలో చివరి 10 ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవాలంటే క్విక్ వ్యూ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అకౌంట్ పూర్తి వివరాలు కావాలంటే అకౌంట్ స్టేట్మెంట్లో చూసుకోవచ్చు. కావాలంటే దీన్ని ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు.
* పేమెంట్స్ లో మీ పేమెంట్స్ వివరాలు, పెండింగ్ బిల్లులు, పేమెంట్స్ హిస్టరీ వివరాలు తెలుసుకోవచ్చు.
మనీ ట్రాన్స్ఫర్ చేయండి ఇలా..
ఫండ్స్ ట్రాన్స్ఫర్ విభాగంలోకి ఎంటరయితే మీరు ఎవరికైనా డబ్బులు పంపొచ్చు.
సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్: దీని ద్వారా మీ సొంత అకౌంట్ నుంచి మీదే గనుక మరో అకౌంట్ ఉంటే దానికి డబ్బులు పంపుకోవచ్చు.
థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్: మీ అకౌంట్ నుంచి వేరే వ్యక్తి లేదా సంస్థ ఖాతాకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఆప్షన్‌ను వాడుకోవాలి.
థర్డ్ పార్టీని ఎలా రిజిస్టర్ చేయాలి?
* ఫండ్స్ ట్రాన్స్ఫర్ విభాగంలోకి వెళ్లి థర్డ్ పార్టీని క్లిక్ చేయాలి.
* అందులో మేక్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.దీనిలో యాడ్ న్యూ పేయీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ ఫాం వస్తుంది. దీనిలో పేయీ పేరు, అడ్రస్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఏ బ్యాంకు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేసి వాలిడేట్ బటన్ ప్రెస్ చేయాలి.
* వెబ్సైట్ ఈ నెంబర్ సరైనదా కాదా చెక్ చేస్తుంది. అన్నీ సరిగా ఉంటే వాలిడేట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
* తర్వాత పేయీ నిక్‌నేమ్ అడుగుతుంది. మీకు నచ్చిన పేరు పెట్టి యాడ్ పేయీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే మెసేజ్‌ను చూసుకుని కన్ఫర్మ్ పేయీ బటన్‌ను నొక్కాలి.
* టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసిన తర్వాత ఆన్లైన్ ఆథరైజేషన్ కోడ్ (ఓఏసీ) వస్తుంది. ఈ ఓఏసని ఎంటర్ చేసి పేయీని ఆథరైజ్ చేసుకోవాలి. ఈ ఆథరైజేషన్ ప్రక్రియ పూర్తవడానికి ఆరు గంటల సమయం తీసుకుంటుంది.
థర్డ్ పార్టీకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా?
* ఫండ్స్ ట్రాన్స్ఫర్ విభాగంలోకి వెళ్లి థర్డ్ పార్టీని క్లిక్ చేయాలి.
* అందులో మేక్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. మీరు మనీ పంపాల్సిన పేయీ ని సెలక్ట్ చేసుకుని ఎంత అమౌంట్ పంపాలో ఎంటర్ చేయాలి. మీరు అదే రోజు అమౌంట్ పంపాలంటే కింద ఉండే చెక్ బాక్స్‌లో క్లిక్ చేయాలి.
* పేమెంట్ తర్వాత రోజుకు ఎప్పుడైనా చేయాలంటే పేమెంట్ డేట్ అనే ఖాళీలో ఆ డేట్‌ను మెన్షన్ చేయవచ్చు.
* ఇవి పూర్తయిన తర్వాత పే అనే బటన్‌ను క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసి మీ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే..
ఆంధ్రా బ్యాంకు కాకుండా ఇండియాలో ఉన్న ఇతర బ్యాంకు ఖాతాదారులకు మీరు డబ్బులు పంపాలనుకుంటే అది ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్ కిందకు వస్తుంది.
ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్ పేయీని ఎలా యాడ్ చేసుకోవాలి?
* ఫండ్స్ ట్రాన్స్ఫర్ విభాగంలోకి వెళ్లి ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ను సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్ మెయిన్ పేజీలోకి వస్తారు.
అక్కడున్న ఆప్షన్లలో నుంచి యాడ్ యాన్ ఎక్స్టర్నల్ పేయీని క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫాం వస్తుంది. దాన్ని పేయీ పేరు, అడ్రస్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఏ బ్యాంకు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలతో నింపాలి.
* బ్యాంక్ పేరు, ఉన్న ప్రాంతాన్ని బట్టి దాని ఐఎఫ్ఎస్సీ కోడ్ తెలుసుకునే అవకాశం కూడా ఉంది.
* ఈ వివరాలన్నీ తెలుసుకున్నాక ఎకౌంట్ టైప్ (సేవింగ్స్, కరెంట్ వంటివి) సెలెక్ట్ చేసి యాడ్ పేయీని క్లిక్ చేయాలి. బెనిఫిషరీ వివరాలన్నీ మీకు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇవన్నీ సరిగా ఉన్నాయనుకుంటే ఆథరైజ్ పేయీ బటన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఓఏసీ నెంబర్ వస్తుంది.
* ఈ ఓఏసీ నెంబర్‌ను యాడ్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఆరు గంటల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత వారికి క్షణాల్లో డబ్బులు పంపుకోవచ్చు.
రోజుకు లక్ష..
ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా రోజుకు గరిష్టంగా లక్ష రూపాయలు పంపవచ్చు. అయితే వారానికి 5 లక్షలకు, నెలకు పది లక్షలకు, ఏడాదికి 25 లక్షలకు మించరాదు.
ఇతర సౌకర్యాలూ ఉన్నాయ్..
బిల్లులు పే చేసుకోవడం, క్రెడిట్ కార్డ్, అకౌంట్ వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవడం, చెక్ బుక్, లోన్ వంటి వాటికి రిక్వెస్ట్‌లు పంపడం అన్నీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇల్లు కదలకుండానే చక్కబెట్టుకోవచ్చు.
"