• తాజా వార్తలు
  •  

నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గదర్శిణి 11 - డాక్ట‌ర్ అపాయింట్ మెంట్‌కూ.. ఓ యాప్!

 

న్ లైన్‌.. ఆన్‌లైన్.. ఇప్ప‌డు అన్నింటికీ ఇదే మంత్రం. కూర‌గాయ‌లు, పండ్లు, కిరాణా స‌ర‌కుల నుంచి ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డ‌ర్ ఇచ్చి నేరుగా ఇంటికే తెప్పించుకునే వెసులుబాటు వ‌చ్చింది. మందుల దుకాణానికి వెళ్లి కొనుక్కోవాల్సిన ప‌ని లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లేస్టోర్‌లో చాలా మొబైల్ యాప్‌లు ఉన్నాయి.  వీటిలో చాలా వ‌ర‌కు మందులు అమ్మ‌డ‌మే కాదు డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకునే సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తున్నాయి.  సాధార‌ణ వ్యాధుల వైద్య‌లు నుంచి గుండె, మూత్ర‌పిండాల నిపుణుల వ‌ర‌కు ఎలాంటి డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ అయినా యాప్ ద్వారా తీసుకోవ‌చ్చు. డాక్ట‌ర్ ఇచ్చిన టైంకు వెళ్లి  నేరుగా చూపించుకోవ‌చ్చు. దీనివల్ల స‌మ‌యం ఆదా అవుతుంది. ఏ వ్యాధికి సంబంధించిన నిపుణులు ఎక్క‌డున్నారో స‌మాచారం సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. చిరునామా యాప్‌లో ఉంటుంది క‌నుక నేరుగా వెళ్లొచ్చు. ముఖ్యంగా న‌గ‌రాల్లో ఉండేవారికి ఇది చాలా సుల‌భంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికో, పట్టణానికో వచ్చి వైద్యం చేయించుకునేవారు ముందుగా యాప్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకుంటే నేరుగా అదే సమయానికి డాక్టర్ దగ్గరికి రావచ్చు.

ప్రయాణాల్లో ఉండవచ్చు. అర్ధరాత్రులు కావచ్చు. అర్హత ఉన్న వైద్యులు, వైద్య నిపుణులు అందుబాటులో లేని గ్రామాలు కావచ్చు. ప్రత్యేక నిపుణులు లేని చిన్న పట్టణాలు కావచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా పీసీ ఉంటే వైద్య సాయం పొందడం తేలిక. నిజానికి ఈ సదుపాయం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ఎంతో మందికి అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది.

నిర్ధ‌ర‌ణ ప‌రీక్ష‌లు కూడా..

డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకోవ‌డ‌మే కాదు వారు సూచించిన రోగ నిర్ధ‌ర‌ణ ప‌రీక్ష‌లు కూడా యాప్ ద్వారా చేయించుకునే సౌక‌ర్యం కూడా చాలావాటిలో ఉంది. డాక్ట‌ర్ సూచించిన టెస్ట్‌ల వివ‌రాలు యాప్‌లో న‌మోదు చేస్తే లాబ్ టెక్నీషియ‌న్ వ‌చ్చి శాంపిల్స్ తీసుకెళ‌తారు. ప‌రీక్ష‌లు చేసి రిపోర్టుల‌ను నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.

 

‘1 ఎంజీ’తో ఎంతో ఈజీ..

1. ఈ యాప్‌ను  ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీకు ఎలాంటి వైద్య‌స‌హాయం అవ‌స‌ర‌మో ఆ వైద్య నిపుణుడి అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. గుండెజ‌బ్బుల‌కైతే కార్డియాల‌జిస్ట్‌, మూత్ర‌పిండాలు, మూత్ర సంబంధిత వ్యాధుల‌కు అయితే యూరాల‌జిస్ట్‌, సాధార‌ణ ఇబ్బందుల‌కు జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్ ఇలా అన్ని ర‌కాల వైద్య‌నిపుణుల విభాగాలు క‌నిపిస్తాయి.

 

2. కావ‌ల్సిన విభాగంలోకి వెళితే అందుబాటులో ఉన్న వైద్యుల వివ‌రాలు చూపిస్తుంది. వైద్యుణ్ని ఎంచుకుని వారు సూచించిన స‌మ‌యానికి వెళ్లి చూపించుకోవ‌చ్చు.

 

3. రోగ నిర్ధ‌ర‌ణ ప‌రీక్ష‌ల‌కు కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. టెక్నీషియ‌నే ఇంటికి రావ‌డం బాగా పెద్ద టెస్టుల‌యితే మ‌నం నేరుగా అక్క‌డికెళ్లి చేయించుకోవ‌చ్చు.

 

 లిబ్రేట్‌, డాక్ట‌ర్ ఆన్ డిమాండ్ వంటి చాలా యాప్‌లు ఇలాంటి సేవ‌లందిస్తున్నాయి. అపోలో ఆసుప‌త్రి ఆన్‌లైన్ సేవ‌ల కోసం అపోలో ఎం కేర్ యాప్‌ను వాడుకోవ‌చ్చు.

 

ఆన్‌లైన్లో  డాక్ట‌ర్ స‌ల‌హాలు

ఆన్‌లైన్‌లో డాక్ట‌ర్‌ను ఎంపిక చేసుకుని వీడియో  లేదా ఆడియో చాట్ ద్వారా గానీ మెసేజ్ రూపంలోగానీ డాక్ట‌ర్‌కు మ‌న వ్యాధి ల‌క్ష‌ణాలు చెప్ప‌వ‌చ్చు. ఇలాంటివి చాలా యాప్‌లు , వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. డాక్ట‌ర్ ఆ ల‌క్ష‌ణాల‌ను విశ్లేషించి చికిత్స సూచిస్తారు.

 

జ‌స్ట్ డాక్‌ తో డాక్టరు కన్సల్టేషన్ ఇలా..

1. జ‌స్ట్ డాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

2. జాబితాలో నుంచి అవ‌స‌ర‌మైన డాక్ట‌ర్‌ను ఎంచుకోవాలి.

 

3. ఆడియో లేదా వీడియో చాట్‌ను ఎంచుకుని మీ వ్యాధి ల‌క్ష‌ణాలు చెప్ప‌వ‌చ్చు. లేదా మెసేజ్ రూపంలో పంపవ‌చ్చు.

 

4. డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకుని ఆన్‌లైన్‌లో బిల్లు పే చేయాలి.

 

5. వైద్య విభాగాన్ని బట్టి ఫీజులు 99 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయి. ఐదు నిమిషాల్లోనే వైద్యులను సంప్రదించడానికి ఈ యాప్ అవకాశం కల్పిస్తోంది. 

 

డెస్కుటాప్ నుంచి కూడా..

* ఐ క్లినిక్ డాట్ కామ్ https://www.icliniq.com/

అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నారు. ఐక్లినిక్ యాప్ కూడా ఉంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని స్మార్ట్ ఫోన్ నుంచే వైద్య సలహాలు పొందవచ్చు. వైద్య పరమైన సలహాలు కావాలంటే ఉచితంగానే పొందే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అదే విషయాన్ని పోస్ట్ చేయవచ్చు. అప్పుడు అందుబాటులో ఉన్న వైద్యుల్లో ఒకరు స్పందిస్తారు.

పూర్తి స్థాయి కన్సల్టేషన్ 99 రూపాయలు చెల్లించి పొందవచ్చు.  వెంటనే వేగంగా వైద్య సలహా కావాలనుకుంటే 299 రూపాయలు చెల్లించడం ద్వారా కాల్ చేసి వైద్యులతో మాట్లాడవచ్చు. వీడియో చాట్ కన్సల్టేషన్ కు కూడా ఇదే చార్జీ. వైద్యులు పరీక్షలు సూచిస్తే చేయించుకుని రిపోర్టులను అప్ లోడ్ చేస్తే పరిశీలించి చికిత్స సూచిస్తారు. అదే సైట్ ద్వారా పరీక్షలకు ఆర్డర్ ఇస్తే ఇంటి వద్దకే వచ్చి నమూనాలను తీసుకెళతారు. దేశీయంగా అందుబాటులో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ వైద్య సేవల సంస్థల్లో ఇది ఒకటి. ప్రతి రోజు వేల సంఖ్యలో ఈ సంస్థ ద్వారా వైద్య సలహాలు పొందుతున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా కొద్ది మేర అందుబాటులో ఉన్నారు. 80కుపైగా స్పెషాలిటీల నుంచి 1270కు పైగా డాక్టర్లు ఐక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచితంగా అడిగే ప్రశ్నలు, వైద్యుల సమాధానాలు ఇతరులు సైతం చదివి తెలుసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగతంగా చేసే విచారణలు మాత్రం గోప్యంగా ఉంచుతారు. వైద్యులు వివిధ వ్యాధులపై రాసిన ఆర్టికల్స్ ను సైతం చదువుకోచ్చు.

 

* విరించి వీ కనెక్ట్ v-Connect

ఇటీవలే హైదరాబాద్ కు చెందిన విరించి హెల్త్ కేర్ వీ కనెక్ట్ పేరుతో ఓ యాప్ విడుదల చేసింది. ఆగస్ట్ నుంచి ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతోంది. దీని సహాయంతో వైద్యుడిని వీడియో కాల్ ద్వారా సంప్రదించొచ్చు..   డాక్టరు చెప్పిన మందులతో తగ్గకపోతే  వీ కనెక్ట్ యాప్ ద్వారా అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడం ఎలా అన్నది కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి చెబుతారు. 

 

* ఈ క్లినిక్ https://www.eclinic247.com/

ఉచితంగా సలహాలు పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది. పెయిడ్ కన్సల్టేషన్ కూడా ఉంది. మెయిల్, ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చు. కన్సల్టేషన్ సమ్మరీ, వైద్యులు డిజిటల్ సంతకంతో కూడిన ప్రిస్క్రిప్షన్ పొందవచ్చు. 

 

* హెల్త్ ట్యాప్ https://www.healthtap.com

వైద్య పరమైన అంశాలు, అనారోగ్య సమస్యల గురించి ఈ సైట్ ద్వారా ప్రశ్నించవచ్చు. వైద్యులు తగిన విధంగా సమాధానమిస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. దాదాపుగా విదేశీ వైద్య నిపుణులే ఎక్కువ. ఒక్కోసారి మీరు వేసిన ప్రశ్నకు ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యులు కూడా స్పందిస్తారు. పెయిడ్ సేవలు కూడా ఉన్నాయి. డబ్బులు చెల్లిస్తే వైద్యులకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వీడియో కన్సల్టేషన్ కూడా పొందవచ్చు.

 

* వేయూ ఎండీ డాట్ కామ్ http://www.wayumd.com/

ఈ సంస్థ సత్వర వైద్య సేవలకు హామీ ఇస్తోంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న అనంతరం వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చు. సూచనలు, సలహాలు అందుకోవచ్చు.  

 

* దేశీమెడ్ http://www.desimd.com/

ఇది కూడా ఆన్ లైన్ సేవల్లో ఓ ప్రముఖ సంస్థగా ఉంది. వైద్యుల సలహాలను ఉచితంగా పొందవచ్చు. పెయిడ్ కన్సల్టేషన్లు కూడా ఉన్నాయి. ఇంటి వద్దకే నర్సింగ్ సేవలను అందిస్తోంది.

 

* మాంక్ మెడ్ https://www.monkmed.com/

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ భారతీయ వైద్య నిపుణుల సలహాలను ఈ సంస్థ ఆన్ లైన్ విధానంలో అందిస్తోంది. కన్సల్టేషన్ చార్జీ 10 డాలర్లు (సుమారు 670 రూపాయలు). అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది మరింత అనుకూలం. ముఖ్యంగా ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఫాలో అప్ సేవలు ఉచితంగా పొందే వెసులుబాటు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. వైద్యులతో ఫోన్ కాల్ ద్వారా ఎంత సేపయినా మాట్లాడవచ్చు. 

 

* ప్రాక్టో https://www.practo.com/consult

వైద్యులను మీ సందేహాల గురించి అడిగి ఉచితంగానే సలహా పొందవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే వైద్యులను బట్టి ఫీజులు ఉంటాయి. ఫీజులు చెల్లిస్తే సంబంధిత  డాక్టర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తగిన మందులు, చికిత్సలు సూచిస్తారు. సెకండ్ ఓపినీయన్ తీసుకోవచ్చు. ఉచితంగా ఇతరులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు ఇచ్చిన సమాధానాలను తెలుసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆ ప్రశ్న వేసిన వారి పేర్లను హైడ్ లో ఉంచుతారు. వెబ్ సైట్, యాప్ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి.  

 

* ఈ వైద్య https://www.evaidya.com/home.html#!/home

ఫ్యామిలీ డాక్టర్ కన్సల్టేషన్ కు 200 రూపాయలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ కు 499 రూపాయల ఫీజును చెల్లించుకోవాలి. ఉచితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నప్పటికీ స్పందన వస్తుందన్న పూచీ లేదు. 999 రూపాయలు చెల్లించడం ద్వారా ఏడాది పాటు ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందవచ్చు. స్పెషలిస్టు డాక్టర్ వైద్య సేవలను ఒకరి కోసం ఏడాది పొడవునా ఎన్ని సార్లయినా ఉచితంగా పొందేందుకు 2,499 రూపాయలు చెల్లించి చందాదారులు అయిపోవచ్చు. 

 

* క్యుపిడ్ కేర్ http://www.cupidcare.in/

దంపతుల మధ్య పైకి చెప్పుకోలేని ఎన్నో లైంగిక సమస్యలు ఉండవచ్చు. యుక్త వయసులో ఉన్న వారిలోనూ ఇలాంటి బిడియమే ఉంటుంది. లైంగిక, శృంగారపరమైన సమస్యలపై వైద్యుల విలువైన సలహాలను, చికిత్సలను ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవల కోసం ఉద్దేశించినదే క్యుపిడ్ కేర్. ఇది ప్రత్యేకంగా సెక్సాలజిస్టుల కోసం ఉద్దేశించిన ఆన్ లైన్ క్లినిక్. 

 

ఇంకా ఉన్నాయి..

https://www.geniedoc.com/

https://www.oyehelp.com/

https://www.imedilane.com/

యాప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు కావాలంటే.. CUREFY

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సలహాలు కావాలంటే.. https://www.askthedoctor.com/

 బేబీలాన్ హెల్త్ డాక్ట‌ర్ ఆన్‌లైన్‌, మేరా డాక్ట‌ర్ చాట్ విత్ డాక్ట‌ర్ ఆన్‌లైన్‌, టాక్ డాక్ట‌ర్ వంటి యాప్‌లు కూడా ఇలాంటి సేవ‌లు అందిస్తున్నాయి.

 

జన రంజకమైన వార్తలు