• తాజా వార్తలు
  •  

నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గదర్శిణి - 10 - యాప్ తోనే మందులు.. ఇంటి వద్దకే డెలివరీ

 
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు కొరత, చిల్లర సమస్య అన్ని రంగాలపైనా పడుతోంది. ముఖ్యంగా అత్యవసర కొనుగోళ్ల సమయంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వివిధ వ్యాధులు, రోగాల బారిన పడేవారు మందులు కొనుగోలు చేయడం కూడా కష్టమవుతోంది. అయితే... నగరాలు, పట్టణాల్లో చాలావరకు ఇలాంటి సమస్యను అధిగమించడానికి మార్గాలున్నాయి. గ్రామాల్లో ప్రస్తుతానికి ఆన్ లైన్ సరఫరాల వ్యవస్థ అందుబాటులో లేనప్పటికీ నగరాల వరకు కొంతవరకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. ఇంటినుంచే మొబైల్ యాప్ లో ఆర్డర్ చేస్తే కావాల్సిన మందులు డోర్ డెలివరీ చేస్తారు. ఇలాంటి సేవలు అందించే యాప్ లు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. ఇక దేశవ్యాప్తంగా మందుల దుకాణాలున్న సంస్థలైతే వెబ్ సైట్, యాప్ లోనూ ఆర్డర్లు స్వీకరించి ఇంటికి పంపిస్తున్నాయి. చాలావరకు యాప్ లలో డాక్టర్ ప్రిస్కిప్షన్ కచ్చితంగా ఉండాల్సిందే. ప్రిస్కిప్షన్ ను ఫొటో తీసి అప్ లోడ్ చేసి అందులో ఏఏ మందులు కావాలో.. ఎన్నెన్ని కావాలో నమోదు చేస్తే బిల్లు ఎంతవుతుందో అక్కడే చూపిస్తుంది. పేమెంట్ పూర్తి చేయగానే నిర్దేశిత సమయంలో ఇంటికి మందులను డెలివరీ చేస్తారు. పలు యాప్ లలో సంబంధిత మందు ఏఏ కంపెనీలది, ఎంతెంత ధరలో ఉందో కూడా చూపిస్తుంది.
 

 

1) 1ఎంజీ:
ఇందులో తక్కువ ధరకు లభ్యమయ్యే జనరిక్ మందులూ ఉంటాయి. కేవలం మందులను విక్రయించడమే కాకుండా మందు పేరు కొట్టగానే అది దేనికి పనికొస్తుంది. ఎంత డోసేజిలో వాడాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్సు ఏంటనేదీ చూపిస్తుంది. ప్రధాన నగరాలన్నిట్లోనూ ఇది మందులను డోర్ డెలివరీ చేస్తోంది.  వీళ్లకు సొంత మందుల దుకాణాలు లేనప్పటికీ నగరాల్లోని అన్ని ప్రాంతాల్లోని మందుల దుకాణాలతో టై అప్ పెట్టుకుని కస్టమర్ ఉన్న చోటికి సమీపంలోని దుకాణం నుంచి మందులను సరఫరా చేస్తారు. ఇందులో ల్యాబ్ టెస్టులు, డాక్టర్ అపాయింట్ మెంట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.
- ఇందులో 10 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు.
- కావాల్సిన మందు పేరుతో తొలుత సెర్చి చేయాలి.
- అది కనిపించగానే అక్కడ చూపించిన వాటిలో కావాల్సిన మందును టిక్ చేసి ఎన్ని కావాలో నమోదు చేసి కార్టుకు యాడ్ చేయాలి
- కొన్ని మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అలాంటివాటికి అక్కడే ప్రిస్క్రిప్షన్ అడుగుతుంది. దాన్ని జత చేస్తే సరిపోతుంది.
- మన చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి ఆర్డర్ ఓకే చేసిన తరువాత మనకు సమీపంలోని నమ్మకమైన మందుల దుకాణం నుంచి మనకు మందులు పంపించే ఏర్పాటు చేస్తుంది 1ఎంజీ.
- ఇందుకుగాను ఆన్ లైన్లో పే చేసుకోవచ్చు. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.
- అయితే, ప్రస్తుత నగదు కొరత నేపథ్యంలో ఆన్ లైన్ పేమెంటే బెటర్.

 

 
2) నెట్ మెడ్స్:
విస్తృతమైన కవరేజి ఉన్న యాప్ ఇది. నగరాలు, ప్రధాన పట్టణాలే కాకుండా చిన్నచిన్న పట్టణాలు, మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్న గ్రామాలకూ వీరు మందులు డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామాలకు మందులు సరఫరా చేస్తున్నవాటిలో ఇది 0ధానమైంది.  అందరూ కొనగలిగేలా జనరిక్ ఉత్పత్తులను ఎక్కువగా అందుబాటులో ఉంచుతుంది. మందులతో పాటు వెల్ నెస్ గాడ్జెట్స్ వంటి అన్నీ సరఫరా చేస్తుంది.  ఆన్ లైన్ గేట్ వే, కార్డులు, వ్యాలట్ల నుంచి పే చేయొచ్చు.
3) బుక్ మెడ్స్:
ఇది ప్రధానంగా హైదరాబాద్, కోల్ కతాలో ఎక్కువ సర్వీసులు అందిస్తోంది. 24 గంటల్లోనే కోరుకున్న మందులను అందిస్తారు. రిజిష్టర్డ్ ఫార్మసిస్టులు... డిస్ట్రిబ్యూటర్లతో టై అప్ పెట్టుకుని సరఫరా చేస్తున్నారు.
4) ప్లస్ యాప్:
గుర్గావ్ కేంద్రంగా 2015లో దీన్ని ప్రారంభించారు. ఉత్తరాదిలో కొద్దికాలంలోనే మంచి ఆదరణ పొందింది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో బుక్ చేసిన రోజునే ఒక్క రూపాయి కూడా డెలివరీ ఛార్జీలు తీసుకోకుండా ఇంటికే మందులను తెచ్చిస్తోంది. అన్ని రకాల మందులు పర్సనల్ కేర్ ఉత్పత్తులు, పెట్ కేర్, బేబీ కేర్ ఇలా మందుల దుకాణాల్లో దొరికే ప్రతిదీ ఇంటికి తెచ్చి ఇస్తారు. చాలా ప్రాంతాల్లో అయితే బుక్ చేసిన నిమిషాల్లోనే వచ్చి వాలుతున్నారు.
- ఇవి కాకుండా ఇనాయో, మిరా వంటి యాప్ లూ మందుల డోర్ డెలివరీ చేస్తున్నాయి. మెడ్ ప్లస్, అపోలో వంటి నెట్ వర్క్ ఫార్మసీలూ డోర్ డెలివరీ ఇస్తున్నాయి. ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఆన్ లైన్లోనే పేమెంట్ చేసుకుని ఇంటికే మందులు తెప్పించుకోవచ్చు.

 

 
ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయ్..
- మందులు ఎప్పుడెప్పుడో వేసుకోవాలో అలారమ్ పెట్టుకోవచ్చు.  ఆ సమయానికి అది గుర్తు చేస్తుంది. 
- మందులు ఎలా వేసుకోవాలి. ఎంత మోతాదులో వేసుకోవాలి కూడా చెబుతాయి.
- 1ఎంజీ వంటి యాప్ లలో ఆరోగ్య సంబంధిత వార్తలు, స్టోరీలు ఉంటాయి.
- 1ఎంజీలో ప్రతి మందు యొక్క చరిత్రా ఉంటుంది. దేనికి పని చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎపెక్టులు ఉంటాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలన్నీ అందులో ఉంటాయి.
 
అయితే.. ఆన్ లైన్ లో మందులు కొనడం సులభమే అయినా ఇది ఇంకా ఎక్కువగా నగరాలు, పట్టణాలకే పరిమితమైంది. కొన్ని యాప్ లలో మాత్రం గ్రామీణ ప్రాంతాలవారూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఇవి గ్రామాలకూ చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తుండడం ఎంతైనా  మంచి పరిణామమే.
 
 

జన రంజకమైన వార్తలు