• తాజా వార్తలు

నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-2, చేతిలో డబ్బులేదని చింత వద్దు , వ్యాలట్ వ

దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే కావొచ్చు కానీ, ఆ నిర్ణయం ప్రభవంతో ప్రజలకు నగదు దొరక్క ఏ పనీ చేయలేకపోతున్నారు. అయితే... కొందరు మాత్రం చీకూచింతా లేకుండా ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఎప్పట్లాగానే బిందాస్ గా గడిపేస్తున్నారు. అంటే వారికి డబ్బు అవసరం లేదని కాదు, ఆర్థిక లావాదేవీలు ఉండవనీ కాదు.. షాపింగ్ చేయడం, బిల్లులు కట్టడం వంటి పనులు లేవనీ కాదు. అందరిలాగానే అన్ని ఆర్థిక లావాదేవీలు అవసరమే అయినా వారికి నగదు అవసరం లేదు.. నగదు లేకుండా కార్డులుతో చెల్లింపులు, ఆన్ లైన్ చెల్లింపులు, వ్యాలట్ పేమెంట్లతో హ్యాపీగా గడిపేస్తున్నారు. ఇవేమీ తెలియనివారు మాత్రం నిత్యం ఏటీఎంలు, బ్యాంకులు చుట్టూ తిరుగుతూ టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు. ఏ పనీ పూర్తికాక తిప్పలు పడుతున్నారు. అలాంటి తిప్పలు తప్పాలంటే టెక్నాలజీని వాడుకోవాల్సిందే. అంటే.. సాఫ్ట్ వేర్ పుస్తకాలు ముందేసుకుని బుర్రలు పగలుగొట్టుకోవాల్సిన పనేలేదు. మీరు రోజంతా వాట్స్ యాప్, ఫేస్ బుక్ అంటూ క్షణం కూడా వదలకుండా వెంట తిప్పుకొనే స్మార్టు ఫోన్ తోనే నగదు కష్టాలకు చెక్ చెప్పేయొచ్చు.  ఆన్ లైన్ బ్యాంకిగుల పేరుతో యూజర్ ఐడీ, పాస్ వర్డు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లే పనే లేకుండా సింపుల్ గా వ్యాలట్ పేమెంట్ల బాట పట్టడమే దీనికి పరిష్కారం. 
నగదు రహిత జీవనంతో ప్రస్తుత కష్టాలకు తెర దించడమే కాకుండా భవిష్యత్తులోనూ సమయం, డబ్బు ఆదా చేసుకునేలా, ప్రయాస లేకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేలా ప్రజలకు సాయపడేందుకు ‘కంప్యూటర్ విజ్ఞానం’ ఇప్పటికే తొలి అడుగు వేసింది. అత్యంత పాపులర్ వ్యాలట్ అయిన పేటీఎంను ఎలా వాడాలో ఇప్పటికే వివరించింది. ఇప్పుడు మరో వ్యాలట్ మొబిక్విక్ నూ మీ స్మార్టు పేమెంట్లకు వారథిగా మార్చుకోవడానికి సహకరిస్తోంది.
మొబిక్విక్(mobikwik).. దేశంలో పాపులర్ అయిన వ్యాలట్లలో ఇది కూడా ఒకటి. ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకుల వ్యాలట్లను దాటుకుని ఇది తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతోంది. ఆన్ లైన్ పేమెంట్లతో పాటు ఆఫ్ లైన్ పేమెంట్లలోనూ దూసుకెళ్తోంది. మొబైల్ వ్యాలట్లలో పేటీఎంను రారాజుగా చెప్పుకొంటే ఆ రారాజును కూలదోసి సింహాసనం ఎక్కడానికి పోటీపడుతున్న వ్యాలట్ గా మొబిక్విక్ ను చెప్పుకోవచ్చు. మోడీ డీమోనిటైజేషన్ నిర్ణయం వెలువరించడానికి ముందునుంచే పేటీఎంతో పోటీపడుతున్న మొబిక్విక్ డీమోనిటైజేషన్ తరువాత మరింతగా విజృంభించింది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వేగం పెంచింది. ఫలితంగా పెద్ద నోట్లు రద్దయిన పది రోజుల్లోనే మొబిక్విక్ వ్యాలట్ నుంచి బ్యాంకు ఖాతాలకు చేసే నగదు ట్రాన్సఫర్లలో 7000 శాతం వృద్ధి సాధించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు... ఇది తన సేవలను ఎంతగా విస్తరిస్తుందో చెప్పడానికి.
 
ఇదంతా సరే... అసలు మొబిక్విక్ తో ఏం చేయొచ్చు.. ఎలా ఉపయోగించుకోవచ్చు.. దానివల్ల ప్రయోజనాలేమిటి? అనేది చూద్దాం.
మొబిక్విక్ ను స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో యాప్ రూపంలో ఉపయోగించవచ్చు. లేదంటే డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లలోనూ ఉపయోగించుకోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో వ్యాలట్లలో పేటీఎం, మొబిక్విక్ కూడా అంతకుమించి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. దీనిని ఉపయోగించడం చాలా తేలిక. చేయాల్సిందంతా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అందులో రిజిష్టర్ చేసుకోవడం.. నగదు అన్నది అవసరమే లేకుండా లావాదేవీలు జరుపుకోవడమే తరువాయి.
 
1) మొబిక్విక్ ను డౌన్ లోడ్ చేసుకోవడం.

 

అన్ని మొబైల్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నట్లే దీన్ని కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారంతా గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి సెర్చిలో mobikwik అని టైప్ చేస్తే చాలు. ఈ యాప్ ను మొట్టమొదట చూపిస్తుంది. అక్కడ ఆకుపచ్చ రంగులో ఇన్ స్టాల్ అని ఉన్న చోట క్లిక్ చేస్తే డౌన్ లోడ్ అయి ఇన్ స్టాల్ అవుతుంది. ఇక అక్కడ నుంచి  క్యాష్ లెస్ గా కొత్త లైఫ్ మొదలుపెట్టడమే తరువాయి.
 
2) మొబిక్విక్ లో రిజిష్టర్ చేసుకోవడం (లేదా) మొబిక్విక్ వ్యాలట్ ను క్రియేట్ చేసుకోవడం

 

డౌన్లోడ్ చేసుకున్న యాప్ పై క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. ‘యువర్ మొబైల్ నంబర్’ అని కనిపిస్తుంది. అక్కడ నంబరు నమోదు చేసిన తరువాత ఆ దిగువనే ఉన్న ‘సెండ్ ఓటీపీ’ అనే క్లిక్ చేయాలి. 
అలా క్లిక్ చేయగానే మొబైల్ నంబరుకు ఓటీపీ ఎస్ ఎం ఎస్ లో వస్తుంది. ఓటీపీ అంటే వన్ టైం పాస్ వర్డ్. అంటే ఆ ఒక్కసారి మాత్రమే ఉపయోగించడానికి పనికొచ్చే పాస్ వర్డ్ అది.  ఓటీపీని నమోదు చేసిన తరువాత ఈమెయిల్ చిరునామా, 4 డిజిట్ పిన్ అడుగుతుంది.  ఈ 4 అంకెల్ పిన్ నంబరు మీ డెబిట్(ఏటీఎం) కార్డు పిన్ నంబరు వంటిది అనుకోవాలి.  దాన్ని గుర్తుంచుకోవడంతో పాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలి. అలా చేయడం వల్ల మీ ఫోన్ ఎవరి చేతికైనా చిక్కినా కూడా వారు మీ మొబిక్విక్ వ్యాలట్ వినియోగించలేరు.
వ్యాలట్ ను ఉపయోగించేటప్పుడు ఈ పిన్ నంబరు అడుగుతుంది. పిన్ నంబరు నమోదు చేస్తే వ్యాలట్లోని ఆప్షన్లు కనిపిస్తాయి. 

3) ఏమేం చేయొచ్చు..

మొబైల్, డీటీహెచ్ రీఛార్జిలు చేయొచ్చు. పోస్ట్ పెయిడ్ నంబర్ల బిల్లు చెల్లించొచ్చు. కొన్ని డిస్కంల కరెంటు బిల్లులు కట్టొచ్చు. డాటాకార్డులు రీఛార్జి చేయొచ్చు. గ్యాస్, వాటర్ బిల్లులూ కట్టుకోవచ్చు. కొన్ని కంపెనీల ఇన్సూరెన్సు ప్రీమియంలు కూడా చెల్లించే వీలుంది. వీటన్నిటికోసం ముందుగా వ్యాలట్లలో డబ్బు నింపాల్సి ఉంటుంది.
 
4) వ్యాలట్లలో డబ్బు నింపడం

 

యాప్ ఓపెన్ చేయగానే + గుర్తు తో యాడ్ మనీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మళ్లీ ఇంకో టెంప్లేట్ వస్తుంది. అందులో యాడ్ మనీ అని కనిపిస్తుంది. ఆ దిగువనే  వ్యాలట్ బ్యాలన్స్ అని చూపిస్తుంది. అప్పటి వరకు వ్యాలట్లో డబ్బు లోడ్ చేయకపోతే బ్యాలన్సు 0 చూపిస్తుంది.  ఆ దిగువనే 1000,500,100 అని అంకెలు ఉంటాయి. ఆ మొత్తాలు నింపాలంటే అవి క్లిక్ చేయాలి. లేదంటే ఆ కింద ఉన్న స్పేస్ లో ఎంత డబ్బు వేయాలనుకుంటున్నామో అంతమొత్తం ఎంటర్ చేయాలి.  స్క్రీన్ దిగువన ఉన్న కంటిన్యూ అనేది క్లికి్ చేయాలి. 
- అది క్లిక్ చేయగానే మూడు ఆప్షన్లు వస్తాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, క్యాష్ పికప్ అని వస్తాయి. 
- అందులో డెబిట్, క్రెడిట్ కార్డు అన్నది క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. కార్డు నంబరు, కార్డు ఎక్స్ పెయిరీ డేట్, సీవీవీ నంబరు(మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వెనుక భాగంలో చిన్న కాగితంపై అతికించి ఉండే మూడంకెల సంఖ్య ఇది) ఎంటర్ చేయాలి. సీవీవీ నంబరు చాలా కీలకం కాబట్టి ఇది ఎవరికీ చెప్పరాదు.  ఆ వివరాలు ఎంటర్ చేసిన తరువాత మొబిక్విక్ ఆఫర్లలో భాగంగా ఏదైనా కూపన్ కోడ్ ఇచ్చి ఉంటే అది ఎంటర్ చేయాలి. దానివల్ల ఆపర్ ప్రయోజనం వస్తుంది. ఆ దిగువనే ‘సేవ్ మై కార్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్’ అని ఉంటుంది. దాన్ని టిక్ చేస్తే సీవీవీ నంబరు తప్ప మిగతా కార్డు వివరాలన్నీ మొబిక్విక్ యాప్ లో నిక్షిప్తమై ఆ తరువాత ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు వివరాలు దానికవే నమోదవుతాయి. సీవీపీ నంబరు మాత్రం ప్రతిసారీ మనం ఎంటర్ చేయాలి. ఇదంతా చేశాక.. పే నౌ అన్నది క్లిక్ చేస్తే మీరు అనుకున్నంత మొత్తం వ్యాలట్ కు యాడ్ అవుతుంది. 
- అదే నెట్ బ్యాంకింగ్ అయితే... అక్కడ లిస్టులో ఉన్న బ్యాంకులను ఎంచుకుని మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మొబిక్విక్ వ్యాలట్ కు డబ్బు ట్రాన్సఫర్ చేయాల్సి ఉంటుంది.
- క్యాష్ పికప్ ఆప్షన్ పెడితే మీరున్న చోటికి వచ్చి డబ్బు తీసుకెళ్తారు. అది మీ వ్యాలట్ కు యాడ్ అవుతుంది. 30 నిమిషాల్లో వచ్చి తీసుకెళ్తారు. దీనికోసం ఫోన్ నంబరు, జీపీఎస్ లో లొకేషన్ పిన్ చేయాలి. కానీ... ప్రస్తుతం ఈ సౌకర్యం ఢిల్లీ, ముంబయి, జైపూర్, సూరత్ నగరాల్లో మాత్రమే ఉంది. 
.. ఇలా క్యాష్ యాడ్ చేసిన తరువాత యాప్ లో పూర్తిగా వెనక్కు వచ్చి పేజీ దిగువన వ్యాలట్ అని ఉన్న వద్ద క్లిక్ చేసి చూడొచ్చు. అందులో వ్యాలట్ బ్యాలన్స్ ఇతర వివరాలు చూపిస్తుంది.
 
5) రీఛార్జి చేయడం

 

యాప్ తెరిచిన తరువాత కింద భాగంలో రీఛార్జి అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని కనిపిస్తాయి. అందులో ప్రీపెయిడ్ క్లిక్ చేయగానే కింద నంబరు ఎంటర్ చేయడానికి స్పేస్ వస్తుంది. అక్కడ నంబరు ఎంటర్ చేయగానే అది ఏ సర్వీసు ప్రొవైడర్ దో చూపిస్తుంది. అంటే నంబరు కొట్టగానే ఎయిర్ టెల్ అయితే ఎయిర్ టెల్ అని... బీఎస్సెన్నెల్ అయితే బీఎస్సెన్నెల్ అని చూపిస్తుంది. ఆ దిగువనే ఎంత మొత్తానికి రీఛార్జి చేయాలో ఆ మొత్తం వేయడానికి స్పేస్ ఉంటుంది.  ఒకవేళ అసలు ఆ సర్వీసు ప్రొవైడర్ వద్ద ఉన్న రీఛార్జి ప్లాన్లు తెలుసుకోవాలనుకుంటే పక్కనే ‘సీ ఆల్ ప్లాన్స్’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయగా ఎంత రీఛార్జికి ఎంత టాక్ టైం వస్తుంది. ఎంత డాటా వస్తుంది వంటివన్నీ చూపిస్తుంది. అందులో మనకు కావాల్సింది ఎంచుకోవచ్చు.
- ఒకవేళ పోస్టు పెయిడ్ బిల్లు కట్టాలన్నా ఇంతే. నంబరు నమోదు చేయగా సర్వీస్ ప్రొవైడర్ పేరు చూపిస్తుంది. బిల్లు మొత్తం అక్కడ నమోదు చేసి చెల్లించాలి.  
 
6) బస్సు, రైలు టిక్కెట్లు

 

యాప్ లో ఉండే టిక్కెట్ ఆప్షన్లను క్లిక్ చేసి ఎక్కడ నుంచి ఎక్కడకు... ఎన్నో తేదీన ప్రయాణం వంటి వివరాలు నమోదు చేసి వ్యాలట్ నుంచి పేమెంట్ చేసి టిక్కెట్లు పొందొచ్చు.
 
7) నగదు బదిలీ(అమౌంట్ ట్రాన్సఫర్) 

 

ప్రస్తుతం చాలామందికి ఇది ముఖ్యమైన అవసరం.  ఒక మొబిక్విక్ వ్యాలట్ నుంచి ఇంకో మొబిక్విక్ వ్యాలట్ కు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడానికి ఎలాంటి చార్జీలు ఉండవు. ఎవరికి ట్రాన్సఫర్ చేయాలో వారి నంబరు నమోదు చేసి ఎంత మొత్తమో ఎంటర్ చేసి సెండ్ కొడితే వారి వ్యాలట్ ఖాతాకు ఆ మొత్తం చేరుతుంది.
- బ్యాంకుకు ట్రాన్సఫర్ చేయాలంటే బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా నంబరు ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటివి నమోదు చేసి ఎంతమొత్తమో ఎంటర్ చేసి సెండ్ చేయాలి. వెంటనే సంబంధిత ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. సాధారణ మొబిక్విక్ వ్యాలట్ అయితే రూ.1000 వరకు ట్రాన్సు ఫర్ చేసుకోవచ్చు.
వ్యాలట్ ను అప్ గ్రేడ్ చేసుకుంటే రూ.5000 వరకు ఇలా బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం దీనికి ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ, తరువాత కాలంలో ఛార్జిలు విధించినా విధించొచ్చు. అయితే, చార్జీలున్నా కూడా సాధారణ ఖాతాల కంటే అప్ గ్రేడెడ్ ఖాతాలకు తక్కువ ఉంటాయి. 
- వ్యాలట్ అప్ గ్రేడ్ చేసుకోవాలంటే క్యాష్ ట్రాన్సఫర్ చేసుకునే చోటే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మొబిక్విక్ ఏజెంట్ వచ్చి వేలిముద్ర, ఫొటో, పాన్ కార్డు జిరాక్సు వంటివి తీసుకుని ఖాతా అప్ గ్రేడ్ చేస్తారు.
8) ఆఫ్ లైన్ చెల్లింపులు..

 

ఆన్ లైన్లో కాకుండా బయట మొబిక్విక్ నుంచి పేమెంట్లు తీసుకునేవారికి చెల్లించాలంటే అక్కడ వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. దీనికోసం యాప్ స్టార్టింగ్ లోనే పైన ‘‘పే ఆర్ ట్రాన్సఫర్ మనీ’’ అనేది క్లిక్ చేయాలి.. లేదంటే దాని పక్కనే ఉండే క్యూఆర్ కోడ్ సింబల్ క్లిక్ చేయాలి. అప్పుడు కోడ్ ను రీడ్ చేయడానికి కెమేరా ఓపెన్ అవుతుంది. దాని సహాయంతో సులభంగా చెల్లించొచ్చు. లేదంటే... యాప్ పైన కుడివైపు భాగంలో ఉంటే మెనూపై క్లిక్ చేస్తే అక్కడ పే ఎట్ స్టోర్స్ అని వస్తుంది. దాని సహాయంతో చెల్లించొచ్చు.
 
9) ఇవి కాకుండా నియర్ బై అన్నది క్లిక్ చేస్తే మీరున్న చోటికి సమీపంలో ఏఏ దుకాణాలు మొబిక్విక్ పేమెంట్లు తీసుకుంటాయో.. ఆ దుకాణాలు ఎక్కడున్నాయో కూడా చూపిస్తుంది. 

 

 
10) ఆఫర్లు సెక్షన్ చూస్తే అందులో ఏఏ వెబ్ సైట్లు, ఏఏ దుకాణాల్లో మొబిక్విక్ పేమెంట్లపై తగ్గింపు ఉంది... అందుకు కూపన్ కోడ్ ఏంటనేది ఉంటుంది. ఇతర నిబంధనలు అక్కడ ఉంటాయి. అవి ఫాలో అవుతూ కూపన్ అప్లయ్ చేస్తే తగ్గింపులు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు ఆన్ లైన్, ఆఫ్ లైన్లోనూ ఉంటాయి.

 

 

 

ఒకసారి మొబిక్విక్ వ్యాలట్ ను వాడడం ప్రారంభిస్తే ఒక్కటొక్కటిగా అన్ని ఆప్షన్లు అనుభవంలోకి వస్తాయి. వ్యాలట్ ఖాళీ అయితే మళ్లీ నింపుకోవాల్సి ఉంటుంది. ఇల్లు కదలకుండా బిల్లులు కట్టుకోవడం, రీఛార్జి చేసుకోవడం, టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో పాటు వాటిపై స్వల్ప రాయితీలు పొందొచ్చు. అంతేకాదు విలువైన సమయం ఆదా చేసుకోవచ్చు. చేతిలో డబ్బు లేకున్నా బ్యాంకు ఖాతాలోనో.. క్రెడిట్ కార్డులోనో ఉంటే చాలు హాయిగా ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయొచ్చు.

"

"

"

"

జన రంజకమైన వార్తలు