• తాజా వార్తలు

క్రెడిట్ కార్డులు, వ్యాలట్ల అంతం ఆరంభమయిందా?

యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) వచ్చేస్తే ఇది నిజమే

జేబులో కరెన్సీ పెట్టుకుని తిరిగే రోజులు పోయాయి.  షాపింగ్ చేసిన ప్రతిచోటా క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో ఇచ్చి పే చేస్తున్నారు.... ఒక్కో చోట మొబైల్ వ్యాలట్లతో పే చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల తరువాత ఈ కార్డులు, వ్యాలట్లకూ కాలం చెల్లేలా కనిపిస్తోంది.

యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అనే కొత్త విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేస్తే ఇక కార్డుల పని క్లోజే. ఆధార్ లేదా, నెట్ లో వర్చువల్ అడ్రస్ ఇస్తే చాలు. బ్యాంక్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు చేసుకునే వీలు కల్పిస్తుంది ఇది.  డిజిటల్ వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుండానే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. డబ్బు తీసుకోవాల్సిన వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక యునిక్ ఐడీ ఉంటేచాలు డబ్బు వెళ్లిపోతుంది. అంటే ఆధార్ నంబరుంటే క్యాష్ ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చన్నమాట.

మొబైల్ ఫోన్ ఆధారంగానే పేమెంట్స్ జరపవచ్చు. వ్యక్తులకు, కంపెనీలకు, చెల్లించవచ్చు. వారినుంచి డబ్బు స్వీకరించవచ్చు. జస్ట్ మొబైల్ నంబర్ లేదా… ఆధార్ నంబర్ ఇస్తే చాలు.  ఆధార్, మొబైల్, అకౌంట్ నంబర్లు లేకపోయినా ఫర్వాలేదు.. వర్చువల్ అడ్రస్ ఇచ్చినా లావాదేవీలు పూర్తవుతాయి. వర్చువల్ అడ్రస్ ఆన్ లైన్ సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఎవరు హ్యాక్ చేసినా మన సమాచారం వారికి తెలియదు. ఆధార్ నంబర్ మాత్రమే ఇచ్చినా లావాదేవీలు చేసుకోవచ్చు.  దేశంలో ఇప్పుడు 25 కోట్ల అకౌంట్లకు ఆధారే ఆధారం. వీరతా యూఐపీతో ఇంకా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీలు చేసుకోవచ్చు.

ఇందులో ఉన్న మరో సదుపాయం ఏమిటంటే… సరైన సమయానికే పేమెంట్ జరుగుతుంది. ఒక డేట్ ను ఫీడ్ చేసిపెడితే అదే రోజు లేదా అంతకన్నా కొంచెం ముందుగానే పేమెంట్ పూర్తవుతుంది.  ఒకేసమయంలో చాలా పేమెంట్స్ చేయవచ్చు. వేరు వేరు ఐడీలతో చెల్లింపులు జరిపే వీలుంది. ఒక్కసారి అథంటికేషన్ ఇస్తే చాలు. జీతాలిచ్చేటప్పుడు కంపెనీలకు ఇది చాలా ఉపయోగం.  బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్లేయర్స్ పని మరింత సులువు చేస్తుంది యూపీఐ. మొబైల్ అప్లికేషన్ లో యూపీఐ ఉపయోగిస్తే… బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మనమే ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ లో పాస్ వర్డ్స్, పిన్స్, బయోమెట్రిక్ లాంటి వర్చువల్ అడ్రస్ లతో… బ్యాంక్ అకౌంట్ ను ఖాతాదారులే నిర్వహించుకోవచ్చు. ఒక్కో బిల్లు  పేమెంటుకు ఒక్కో అడ్రస్ సృష్టించుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అక్షయపాత్రకు ప్రతి నెలా కొంతమొత్తం డొనేట్ చేయాలనుకంటే దానికో అడ్రస్ సృష్టించుకోవచ్చు.

దేశంలో యూపీఐ అమలు మొదలైతే… చెల్లింపులన్నీ సాఫీగా, తేలికగా సాగిపోతాయి. వాలెట్లలోకి డబ్బుల వేయడం, కంపెనీలకు కమీషన్లిచ్చి మళ్లీ వాడుకోవడం ఇలాంటి సమస్యలే ఉండవు. యూపీఐల వల్ల బ్యాంక్ కనెక్టివిటీ పెరుగుతుంది. డబ్బును వినియోగించడంలో మరింత స్వేచ్ఛ వచ్చినట్లే. భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. అంటే దాదాపు ప్రతివ్యక్తి ఒక బ్యాంకర్ అయిపోవచ్చన్నమాట. ప్రతి పేమెంట్ ఎన్పీసీఐ దృష్టికి వెళ్తుంది. మొత్తానికి పేమెంట్ల విధానంలోనే ఇది కొత్త శకం మొదలుపెడుతుందని భావిస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు