• తాజా వార్తలు

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్...అమజాన్ గ్రేట్ ఇండియన్ సేల్...స్నాప్ డీల్ ఎలక్ట్రానిక్ మండే .... ఇ

“ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్  అక్టోబర్ రెండు నుండీ ఫ్లిప్ కార్ట్ వారి బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రారంభం. మునుపెన్నడూ చూడని భారీ డిస్కౌంట్ లతో మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ఒక చక్కటి అవకాశం.”

ఈ మధ్య కాలం లో సాంకేతిక మీడియా లో రిలయన్స్ జియో తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన అంశం ఇదే అనడం లో అతిశయోక్తి లేదు.ఇది కేవలం ఒక్క ఫ్లిప్ కార్ట్ కు మాత్రమే పరిమితం కాదు. అమజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్,స్నాప్ డీల్ యొక్క ఎలక్ట్రానిక్ మండే ఇవి కొన్ని ఉదాహరణలు.ఈ కామర్స్ సైట్ లన్నీ దాదాపుగా ఇదే ధోరణి ని అనుసరిస్తున్నాయి. వీటిని చూసి ఉత్సుకత కు గురైన పే టిఎం ,మింత్రా,షాప్ క్లూస్ లాంటివి కూడా ఈ ఫెస్టివ్ సేల్ లను ప్రకటించకుంటే పాపం చేసినట్లుగా ఫీల్ అయిపోయి అవి అప్పటికే అందిస్తున్న మామూలు సేల్లను కూడా ఫెస్టివ్ సేల్లుగా ప్రకటించేస్తున్నాయి.

అసలు ఈ ఫెస్టివ్ సేల్ ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ కామర్స్ కంపెనీ లు ఇలా ఎందుకు తయారు అయ్యాయి? వాటి సంగతి సరే, పాఠకులకు సరైన సమాచారం అందించాల్సిన సాంకేతిక మీడియా ఇలా ఎందుకు మారిపోయింది?

ఈ ఫెస్టివ్ సేల్ ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

మీరు నిశితం గా గమనించినట్లయితే ఈ సేల్ లలో లభించే డీల్ లు అన్నీ ఏమంత గొప్ప డీల్ లుగా కనిపించవు.ప్రతి డీల్ లోనూ MRP లను పెంచేసి ఈ పెంచిన MRP లపై డిస్కౌంట్ లు ప్రకటించేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం అయిపోతుంది. అసలు మనం ఎప్పుడైనా MRP కే వస్తువులను కొంటామా? మరి అలాంటపుడు ఈ ఫెస్టివ్ సేల్ ల వలన మనకు ఒనగూరేది ఏమిటి?

సరే ఈ కంపెనీ లు ప్రకటించిన గొప్ప డీల్ (?) కు ఆకర్షితులము అయిపోయి ఆ వస్తువులను కొనేస్తాము. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఫెస్టివ్ డీల్ ద్వారా మనం కొన్న ఆ వస్తువు యొక్క అసలు మార్కెట్ రేట్ కంటే మనం వెచ్చించిన ధరే అధికం అని తెలిసేసరికి పరిస్థితులు మన చేయి దాటిపోతాయి. ఏదో ఒక సందర్భం లో ఇది మనకు చాలా చికాకు గానూ అసహ్యం గానూ ఉంటుంది. అదేదో సామెత చెప్పినట్లు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం?

మరొక అంశం. మనం ఈ సైట్ లలో 80 శాతం డిస్కౌంట్ లను చూస్తూ ఉంటాము.ఇది ఖచ్చితంగా వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే. ఇలాంటి భారీ డిస్కౌంట్ లను ఎవరూ నమ్మరు. నమ్మకపోగా ఇలాంటి డిస్కౌంట్ లను ప్రకటించిన సంస్థలపై వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి భారీ డిస్కౌంట్ అంటే భారీ మోసం అనుకోవడం ఉత్తమం. మరొక పక్క ఈ ఫెస్టివ్ సేల్స్ అనే ప్రకటనల వలన ఈ కామర్స్ సైట్ లకు వచ్చే విజిటర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.కానీ పరిస్థితులు చేయి దాటి పోయే సరికి ఇవన్నీ మరింత చెత్తగా కనిపిస్తాయి.

ఈ దారుణ విపరీత పోకడలకు ప్రస్తుతం ఉన్న ఏ సైటూ అతీతం కాదు.ఒకదాన్ని మించి మరొకటి తారాస్థాయిలో పోటీపడుతూ ఈ ఊహాతీత ధరలనూ నకిలీ డిస్కౌంట్ లనూ నిస్సిగ్గుగా ప్రకటించేస్తూ ఉంటాయి. దీనికి ఏదీ మినహాయింపు కాదు.

ఈ పోకడలకు కారణం ఏమిటి?

అసలు ఈ కామర్స్ సంస్థలన్నీ ఇలాంటి ఫెస్టివ్ సేల్ లను ప్రకటించడానికి కారణం ఏమిటి?దీనికి సమాధానం చాలా సింపుల్. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వినియోగదారులను అందరినీ తమవైపుకు తిప్పుకోవాలి అనే పోటీ లో ఈ కంపెనీలన్నీ చావోరేవో అనే రీతిలో కూరుకుపోయాయి. వినియోగదారుని గురించి ఆలోచించే కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఒక తెలుగు సినిమా లో ఒక పాత్రధారి హైదరాబాదు కు సముద్రం తీసుకువస్తాను అని చెబుతాడు అది నమ్మిన మన జనాలు అతనిని ఎన్నికలలో గెలిపిస్తారు. ఈ సందర్భం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. మన భారతీయ వినియోగదారులపై ఈ కంపెనీలకు ఎంత నమ్మకం ఉందొ అనేదానికి ఈ ఫెస్టివ్ సేల్ లకు మించిన ఉదాహరణ లేదనేది మా దృఢ నమ్మకం. ఇక్కడ మనం అందరం గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ వస్తువుపై అయినా 25 శాతం డిస్కౌంట్ అనేది మనకు సాధారణంగా నే లభిస్తుంది. ఎప్పుడైతే వీటి MRP లు పెంచి వేసి ఆ డిస్కౌంట్ ను 80 శాతం గా చూపిస్తున్నారో వినియోగదారుడు తన విచక్షణ ను కోల్పోయి దానివైపు ఆకర్షితుడు అవుతున్నాడు.

ఈ విపరీత పోకడలకు మరొక కారణం ఈ కామర్స్ సైట్ ల దగ్గరా మరియు కంపెనీ ల దగ్గరా ఇబ్బడి ముబ్బడి గా పెరిగిపోతున్న స్టాక్. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ లూ, సరికొత్త వెరైటీ లో మార్కెట్ లోనికి వస్తూ ఉంటాయి. వినియోగదారుడు సహజంగానే  కొత్తవాటి వైపు ఆకర్షితుడు అవుతూ ఉంటాడు.అలాంటపుడు పాత స్టాక్ పేరుకుపోతుంది.దానిని ఎలాగోలాగా అమ్మి వేయక పోతే కొట్లలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే కొంచెం మార్జిన్ చూసుకుని అయినా సరే ఉన్న స్టాక్ ను వదిలించుకోవాలి అనే ఉద్దేశం తో డిస్కౌంట్ లు ప్రకటించేస్తూ ఉంటారు.

కంపెనీ ల సంగతి సరే, మరి మీడియా మాటేమిటి?

కొంచెం మనసు పెట్టి ఆలోచించే ప్రతి ఒక్కరి మదిలో ఈ ప్రశ్నతలెత్తుతుంది.దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సాంకేతిక మీడియా లో ఇచ్చే లింక్ ల ద్వారా ఫెస్టివ్ సేల్ లో షాపింగ్ చేస్తే వాటికి ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు ఒకటైతే వినియోగదారుని అయోమయానికి గురిచేయడం ద్వారా అతని ఆలోచనా శక్తి ని నాశనం చేయడం, వారు చెప్పిందే వినియోగదారుడు నమ్మాలి అనుకోవడం, ప్రతీ విషయం మేమే ముందు చెప్పాము అని గొప్పలు చెప్పుకోవడం ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వాటికీ ప్రాచుర్యం కల్పించడం ద్వారా నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు అనేది ప్రస్తుత మీడియా ట్రెండ్ గా మారిపోయింది. ఏదైనా వ్యాపారమే కాబట్టి ఎవరూ కాదనరు. కానీ ఇలాంటి ఆర్థిక వ్యవహారాలకే ప్రాముఖ్యత ఇస్తూ సాంకేతిక సాహిత్యాన్ని ఉద్దరిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుద్దులకు కొంచెం అయినా మనస్సాక్షి ఉందా అని సగటు సాంకేతిక పాఠకుడు ఆందోళన చెందుతున్నాడు.

మరి వీటికి పరిష్కారం ఏమిటి?

సాధరణం గా సమస్య ఉన్న చోట ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అసలు సమస్య ఏమిటంటే ఈ కంపెనీలు, వినియోగదారులు దీనిని ఒక సమస్య గానే గుర్తించడం లేదు ఇంక పరిష్కారం ఎక్కడ ఉంటుంది. వినియోగదారుని మనస్తత్వం, కంపెనీ ల విపరీత ధోరణి మారనంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు.

 

జన రంజకమైన వార్తలు