పండగల సీజన్ వచ్చిందంటే... ఇ-కామర్స్ సైట్లు కూడా ఆఫర్ల హంగామా మొదలుపెడతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్టు, స్నాప్‌డీల్ లాంటి పెద్ద ఇ-కామర్స్ సైట్లు ఒక దానితో ఒకటి పోటీపడి మరీ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. తాజాగా అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ సేల్‌ను తెర మీదకు తీసుకొస్తే.. ఫ్లిప్‌కార్టు మరో అడుగు ముందుకేసి డెబిట్ కార్డు మీద ఈఎంఐ ఇవ్వడానికి సిద్ధమైంది. ఒకప్పుడు ఈఎంఐ కొన్ని వస్తువుల మీదే ఉండేది. కానీ ఆ తర్వాత క్రెడిట్ కార్డుతో దాదాపు అన్నింటి మీదా ఆ సౌకర్యం ఇస్తున్నారు. తాజాగా ఫ్లిప్‌కార్టు డెబిట్ కార్డు మీద కూడా ఈఎంఐ ఇస్తోంది అదెలాగో చూద్దాం..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో
ఫ్లిప్‌కార్టుకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాటిలో బిగ్ బిలియన్ సేల్ ఒకటి. మామూలు రోజుల్లో కన్నా బిగ్ బిలియన్ డేస్‌లో ఫ్లిప్‌కార్టు రెవిన్యూ ఒక రేంజ్‌కు వెళ్లిపోతుంది. తాజాగా ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్‌లో ఆదాయన్ని మరింత పెంచుకునేందుకు వ్యూహాన్ని రచించింది. దీనిలో భాగంగానే ఈ ఆఫర్ టైమ్‌లోనే క్రెడిట్ కార్డులతో పాటు డెబిట్ కార్డుల మీద కూడా ఈఎంఐ ఆఫర్‌ను పెట్టనుంది. అయితే ఇది భారీ కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. చిన్నచిన్న కొనుగోళ్లకు డెబిట్ కార్డు ఎంఈఎం ఇవ్వలేమని.. పెద్ద కొనుగోళ్లు (టీవీ, కంప్యూటర్లు) లాంటి వాటిపై ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని ఫ్లిప్‌కార్టు తెలిపింది.
ఆ బ్యాంకులతో ఒప్పందం
అయితే ఫ్లిప్‌కార్టు తాజాగా ప్రవేశపెట్టబోతున్న డెబిట్ కార్డు ఐఎంఐ అన్ని బ్యాంకులకు వర్తించదు. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసినవాళ్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది .అదీ కూడా భారీ మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడే ఆఫర్ వర్తిస్తుంది. ఈ కొత్త ఆఫర్ వల్ల క్రెడిట్ కార్డులు లేనివాళ్లు కూడా ప్రొడెక్టులను కొనుగోలు చేసి.. ఆ తర్వాత సులభ వాయిదాల్లో కట్టుకునే అవకాశం కలుగుతుందని ఫ్లిప్‌కార్టు తెలిపింది. అంతేకాదు ఫ్లిప్‌కార్టు సేల్స్‌తో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. భారత్‌లో క్రెడిట్ కార్డులు వాడేవాళ్లతో పోలిస్తే డెబిట్ కార్డులు ఉపయోగించేవాళ్లే ఎక్కువ ఈ నేపథ్యంలో మిగిలినవాళ్లకు కూడా తమ సైట్ ద్వారా కొనుగోళ్లు చేసే అవకాశం కల్పించాలన్నదే తమ ఉద్దేశమని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది.