బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్లు తీసుకు రావడంలో ఐసీఐసీఐ ముందంజలో ఉంటుంది. క్రెడిట్ కార్డులను ఎక్కువ జారీ చేయడంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ కస్టమర్ల కోసం ఇన్స్టంట్ వర్చువల్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని ఐసీఐసీఐ నిర్ణయించింది. అంటే క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు సేవలు వాడుకోవచ్చు. దీని వల్ల లక్షలాది మంది ప్రి క్వాలిఫైడ్ కస్టమర్లకు వర్చువల్ క్రెడిట్‌కార్డులు అందనున్నాయి. దీంతో సులభంగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు.
అంతా డిజిటల్
ఐసీఐసీఐ ప్రస్తుతం తెచ్చిన ఈ ఆఫర్ అంతా డిజిటల్ ఫార్మాట్లోనే ఉంటుంది. గతంలో క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లకు మాత్రమే వర్చువల్ క్రెడిట్ కార్డు లు జారీ చేసేవాళ్లు. ఇది ఆన్లైన్లో ఒకసారి ఉపయోగించడానికి మాత్రమే పని కొచ్చేది. అయితే ఇప్పుడు కార్డులు లేకపోయినా సరే నేరుగా వర్చువల్ కార్డులు పొందే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటే చాలు. మీరు పూర్తిగా డిజిటల్, పేపర్ లెస్‌గా వర్చువల్ క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఈ వర్చువల్ క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులు అనలైటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. అంటే పర్సనల్ లోన్‌కు తామ అర్హులమా కాదా అని కస్టమర్లు ఏటీఎంల ద్వారా చెక్ చేసుకున్నట్లే వర్చువల్ క్రెడిట్ కార్డుకు తమకు వస్తుందో రాదో కూడా వీళ్లు ఏటీఎంల ద్వారా తెలుసుకోవచ్చు.
క్రెడిట్ లిమిట్ రూ.4 లక్షలు
ఇన్‌స్టంట్‌గా ఇచ్చే ఈ వర్చువల్ క్రెడిట్ కార్డుల క్రెడిట్ లిమిట్ రూ.4 లక్షల వరకు ఉండనుంది. ప్రి అప్రూవ్డ్ కస్టమర్లకు సిబిల్ స్కోరు చెక్ చేసి.. స్కోరును బట్టి ఈ మనకు లిమిట్ ఇస్తారు. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చాలా పకబ్బందీగా చేస్తున్నారు. వర్చువల్ క్రెడిట్ కార్డును మనం చూసుకునే విధంగా ఇంటికి కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కావడంతో అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు అలాంటి వారి కోసం ఈ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. ఈ ఇన్స్టంట్ క్రెడిట్ కార్డును మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో అయితే ఐ మొబైల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.