• తాజా వార్తలు
  •  

మీరు పట్టించుకోని పోస్ట్‌మ్యాన్ ఇప్పుడు అతి ముఖ్య‌మైన వ్య‌క్తి కాబోతున్నాడు! ఎలా?

ఒక‌ప్పుడు పోస్ట్ మ్యాన్ కోసం.. అత‌ను తెచ్చే ఉత్త‌రాల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసేవాళ్లు. ఎవ‌రికైనా మ‌నీ ఆర్డ‌ర్ వ‌స్తే పండ‌గే. పోస్ట‌మ్యాన్‌తో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు పోస్ట్‌మ్యాన్ అనేవాళ్లు ఉన్నారా? అనే అనుమానం క‌లుగుతుంది. ఎందుకంటే ఎవ‌రి ఇంటికి లెట‌ర్స్ రావ‌ట్లేదు. ఎవ‌రికీ మ‌నీ ఆర్డ‌ర్లు రావ‌ట్లేదు. ఎవ‌రూ అత‌ని గురించి ఎదురు చూడ‌ట్లేదు. కార‌ణం ఊహించ‌నంత‌గా పెరిగిపోయిన టెక్నాల‌జీ. ఇప్పుడు మ‌నం ప‌ట్టించుకోని పోస్ట్‌మ్యాన్ కోసం త్వ‌ర‌లోనే మ‌నం మ‌ళ్లీ ప‌ట్టించుకునే రోజులు రాన‌నున్నాయి. అత‌ని కోసం వెయిట్ చేసే ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి. ఎందుకు? ఎలా?


డిజిట‌ల్ పోస్టల్ సేవలతో...
ఇప్పుడు మ‌నం ఏం లావాదేవీలు చేయాల‌న్నా.. ఏం చెల్లించాల్లా అంతా ఆన్‌లైన్‌లో. బ‌య‌ట‌కు వెళ్ల‌డం, క్యూలో నిల్చోవ‌డం మానేశారు జ‌నం. ఈ నేప‌థ్యంలోనే భార‌త పోస్టల్ కూడా డిజిట‌ల్ బాట ప‌ట్టింది. వినియోగ‌దారుల అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టే తానూ మారుతోంది. మ‌న ఆర్థిక లావాదేవీల‌ను జ‌రిపించ‌డం కోసం పోస్ట్‌మ్యాన్‌లే ఇంటింటికి రానున్నారు. ఒక‌పుడు లెట‌ర్స్‌, మ‌నీ ఆర్డ‌ర్ల‌తో ప్ర‌తి గుమ్మం తొక్కిన పోస్ట్ మ్యాన్‌లు ఇక‌పై ల్యాప్‌టాప్‌లు, స్వైపింగ్ మిష‌న్ల‌తో రంగంలోకి దిగ‌నున్నారు.  మైక్రో ఏటీఎం మిష‌న్ల‌ను, బ‌యో  మెట్రిక్ రీడ‌ర్లు, ప్రింట‌ర్‌, డెబిట్, క్రెడిట్ కార్డు రీడ‌ర్ల‌ను కూడా పోస్ట్ మ్యాన్లు వెంట తీసుకు రానున్నారు. దీంతో మ‌న‌కు సంబంధించిన లావాదేవీల‌ను వారే నిర్వ‌హిస్తారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్రమం సంచ‌ల‌నానికి దారి తీస్తుంద‌ని న‌మ్మ‌తున్న‌ట్లు పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏపీ సింగ్ తెలిపారు. 

1.5 ల‌క్ష‌ల డివైజ్‌లు..
పోస్ట‌ల్ డిజిట‌ల్ విప్లవం కోసం ఏకంగా 1.5 ల‌క్ష‌ల డిజిట‌ల్ మిష‌న్ల‌ను పోస్ట్ మ్యాన్‌ల‌కు అందిస్తున్న‌ట్లు భార‌త పోస్ట‌ల్ శాఖ తెలిపింది. 2018 క‌ల్లా ఇవి పోస్ట్‌మ్యాన్‌ల చేతిలో ఉంటాయ‌ని ఆ సంస్థ తెలిపింది. హావ్‌లెట్ ప్యాకెర్డ్ ఎంట‌ర్‌ప్రైజ్ అనే థ‌ర్డ్ పార్టీతో ఈ మేర‌కు ఆ శాఖ ఒప్పందం చేసుకుంది.  ప‌ళ్లు, కూర‌గాయ‌లు కొన‌డం, పాల ప్యాకెట్లు కొన‌డం లాంటి స్మాల్ పేమెంట్స్‌ను కూడా ఇక‌పై మొబైల్ పోస్ట‌ల్ పేమెంట్స్ విధానం ద్వారా చెల్లించొచ్చ‌ట‌. ఇవేకాక ఎల‌క్ట్రిసిటీ, మొబైల్‌, డీటీహెచ్‌, స్కూల్ ఫీజులు లాంటి బిల్లుల‌ను ఇక‌పై ఒకేసారి చెల్లించేలా పోస్ట‌ల్ ప్లాన్ చేస్తుంద‌ని ఆ శాఖ చెప్పింది. 8 కోట్ల కుటుంబాల‌కు ఈ డిజిట‌ల్ పోస్ట‌ల్ సేవ‌లు తీసుకెళ్లాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌ని పోస్ట‌ల్ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు