• తాజా వార్తలు
  •  

పండ‌గ ఆఫ‌ర్లలో కొంటున్నారా .. అయితే ఓసారి ఆలోచించండి

బిగ్ సేల్స్‌, ఫెస్టివ‌ల్ బొనాంజా.. ఆఫ్‌లైన్‌,ఆన్‌లైన్‌లోనూ బోల్డ‌న్ని ఆఫ‌ర్లు.. పేప‌ర్ల నిండా పేజీల కొద్దీ యాడ్‌లు.. ఈ-కామ‌ర్స్ కంపెనీల భారీ ఆఫ‌ర్లు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆఫ‌ర్ అన‌గానే కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా? అయితే ఈ 5 అంశాలు చూడండి.. ఆ త‌ర్వాత కూడా మీకు కొనాల‌నుకుంటే అప్పుడు ఆఫ‌ర్ల వంక చూడండి అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. 
 1) నిజంగా అర్జెంటా?
లాస్ట్ డే, లిమిటెడ్ స్టాక్ ప్ర‌క‌ట‌న‌ల హ‌డావుడి చూడండి. అంటే దీని త‌ర్వాత ఇక ఆఫ‌ర్లే ఉండ‌వు. అదేమీ లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే గ‌ణేష్ పండ‌గ పేరు చెప్పి బోల్డ‌న్ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఇప్పుడు ద‌స‌రా పేరు చెప్పి చాలా ఆఫ‌ర్లు మ‌న ముందున్నాయి. ఇది అయిపోతే ఆఫ‌ర్లు ఆగిపోతాయా? క‌్వ‌శ్చ‌నే లేదు. త‌ర్వాత ధ‌న్‌తేరాస్ సేల్‌, దీపావ‌ళి ధ‌మాకా, క్రిస్మ‌స్ సేల్‌, న్యూఇయ‌ర్ స్పెష‌ల్ ఆఫ‌ర్స్ అంటూ చాలానే వ‌స్తాయి. అంత‌టితో ఆగ‌దు.. సంక్రాంతికి మ‌రో సేల్‌, ఫిబ్ర‌వ‌రి, మార్చిలో ప్రీ బ‌డ్జెట్ సేల్‌, ఇయ‌ర్ ఎండింగ్ సేల్ వ‌స్తాయి. ఏమో ఇప్ప‌టికంటే అప్పుడు బెట‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తారేమో.. అందుకే లాస్ట్ డేట్‌, నెవ‌ర్ బిఫోర్ సేల్‌లాంటి ఆఫ‌ర్ల‌కు వెళ్లేముందు ఒక్కసారి ఆలోచించండి
2) ఫ్రీ వ‌స్తువుల కోసం ఆరాట‌మా? 
ప్ర‌పంచంలో ఏదీ ఫ్రీగా రాదు. మ‌రి కంపెనీలు ఎందుకు ఫ్రీగా ఐట‌మ్స్ ఇస్తాయి. ఇది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించే బిజినెస్ ప్లాన్ మాత్ర‌మే. కావాలంటే ఫ్రీ ఆఫ‌ర్లను ఒక‌సారి చూడండి.  ఐదు టీష‌ర్ట్‌లు కొంటే ఆరోది ఫ్రీ అంటారు. ఒక‌టి ఫ్రీగా వ‌స్తుంది క‌దా అనుకుంటున్నారా?  చాలా కంపెనీలు మీరు కొన్న ఐదింటిలో అతి త‌క్కువ రేట్ ఏది ఉంటే అంత రేట్ ఉన్న‌దే ఫ్రీగా ఇస్తాయి. మామూలు రోజుల్లో కూడా 10% డిస్కౌంట్ ఇప్పుడు కామ‌న్‌. అంటే  5 ష‌ర్ట్‌ల మీద క‌లిపి వ‌చ్చే డిస్కౌంట్ మీకు ఫ్రీగా వ‌చ్చే ష‌ర్ట్ కంటే ఎక్కువే ఉంటుంది. అదీకాక మీకు అవ‌స‌ర‌మున్నా లేక‌పోయినా 5 ష‌ర్ట్‌లు కొనాల్సిన ప‌ని త‌ప్పుతుంది. ఇలాంటి సంద‌ర్బాల్లో ఒకోసారి స‌రిగా క్వాలిటీ లేనివి, మీకు న‌ప్ప‌నివి కూడా కొనాల్సి రావ‌చ్చు. 
3) ఆఫ‌ర్ మిస్స‌వుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా? 
ఈ ఫీలింగ్‌నే కంపెనీలు క్యాష్ చేసుకుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు దీపావ‌ళికి కార్ కొంటే  ఇన్సూరెన్స్ ఫ్రీ అనొచ్చు. అప్పుడు కొన‌క‌పోతే లాస్ అవుతారా కానే కాదు. త‌ర్వాత మీకు ఫ్రీ యాక్సెస‌రీస్ ఇవ్వ‌చ్చు. అంతేకాదు ఆఫ‌ర్ లేని స్లంప్ టైంలో మీరు కార్ కొంటానికి వెళితే బేర‌మాడితే కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వ‌చ్చు. ఎందుకంటే అప్పుడొచ్చే క‌స్ట‌మ‌ర్లు త‌క్కువ కాబ‌ట్టి మిమ్మ‌ల్ని వ‌దులుకోవ‌డానికి కంపెనీలు ఇష్ట‌ప‌డ‌వు. కాబ‌ట్టి కంగారుప‌డ‌కుండా కూల్‌గా ఆలోచించండి
4) బిగ్ సేవింగ్స్‌.. ఓ పెద్ద మాయ‌!
బిగ్‌సేవింగ్స్ అంటే ఓ పెద్ద మాయ అంటారు మార్కెటింగ్ నిపుణులు. ఎందుకంటే ఏ కంపెనీ లాస్‌కు ప్రొడ‌క్ట్ అమ్మ‌దు. ఎగ్జాంపుల్ మీ ఏసీ కొనుగోలుపై 10వేల డిస్కౌంట్ పొందండి అన్నార‌నుకోండి. ఆ ఆఫ‌ర్‌లో చాలా మెలిక‌లు ఉండొచ్చు. ఏసీ కొంటే ఇన్‌స్టాలేషన్ మ‌న‌మే బేర్ చేయాల్సి రావ‌చ్చు. లేదా మీ పాత ఏసీని త‌క్కువ ధ‌ర‌కే ఎక్సేంజిలో ఇవ్వ‌ల్సి రావ‌చ్చు.  ఎయిర్‌వేస్ ఢిల్లీ నుంచి ముంబ‌యికి 2వేలకే టికెట్ అంటాయి. కానీ ఇది ఆల్ ఇన్ ఆల్ ఫేర్ కాదు. కేవ‌లం టికెట్ ప్రైస్‌. ఎయిర్‌పోర్ట్ యూజ‌ర్ ఛార్జీల వంటివ‌న్నీ క‌లిపితే టికెట్ ధ‌ర డ‌బుల్ దాటిపోతుంది. ఈ ధ‌ర‌కు మామూలు రోజుల్లోనూ టికెట్ దొరికే ఛాన్స్‌లే ఎక్కువ‌.
5)డిసెప్టివ్ డిస్కౌంట్స్‌
సాధార‌ణంగా డిస్కౌంట్‌లు పెట్టేట‌ప్పుడు * మార్క్‌లు పెడ‌తారు. అప్ టు 30% డిస్కౌంట్ అంటారు. అంటే 30% వ‌ర‌కు ఎంతైనా డిస్కౌంట్ ఇవ్వ‌చ్చు. సాధార‌ణంగా ఇలాంట‌ప్పుడు 30% డిస్కౌంట్  చాలా త‌క్కువ ప్రొడ‌క్ట్‌ల మీద ఉంటుంది.  లేదా 6వేలో, 7వేలో, 10వేలో కొంటే 30% డిస్కౌంట్ ఇస్తామంటారు. అంటే మీతో సాధ్య‌మైనంత ఎక్కువ ప్రొడ‌క్ట్‌లు కొనిపిస్తారు. ఇందులో చాలా కాలం క్రితం వ‌చ్చిన స్టాక్ కూడా ఉంటుంది. 
ఎక్కువ ప్రొడ‌క్ట్‌లు అమ్మితే కంపెనీకి ఎక్కువ లాభం. మీకిచ్చే డిస్కౌంట్‌కంటే అదే ఎక్కువ‌. 

మ‌రేం చేయాలి? 
* ప‌క్క‌వాళ్లు కొంటున్నార‌ని మీరూ ప్ర‌య‌త్నించ‌కండి. మీకు నిజంగా అవ‌స‌ర‌మైతే ట్రై చేయండి
* సేల్స్ పెట్టేట‌ప్పుడు చాలా కంపెనీలు ప్రైస్ పెంచి భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. మీరు సేల్‌కు ముందు దాని ప్రైస్‌ను గ‌మ‌నించి ఉంటే తేడా మీకే తెలుస్తుంది. కాబ‌ట్టి ఆ ప్రొడ‌క్ట్ సేల్‌లో పెట్టినంత ఒరిజిన‌ల్ ధ‌ర ఉంటుందా లేదో అంచ‌నా వేయండి.
* ఇలాంటి సేల్స్‌లో ముఖ్యంగా ఫ్యాష‌న్ యాక్సెస‌రీస్ (ఫెర్‌ఫ్యూమ్స్‌,బాడీ స్ప్రేలు, మేక‌ప్ కిట్లు వంటివి) చాలా వ‌ర‌కు ఎక్స్‌పైరీ డేట్‌కు ద‌గ్గ‌రగా ఉంటాయి. ఆలోగా వాటిని మీరు వాడ‌గ‌ల‌ర‌నుకుంటేనే కొనండి. కొంత వాడి ప‌క్క‌న‌పెట్టేస్తే మీకు వ‌చ్చిన‌ డిస్కౌంట్ క‌న్నా మీరు లాస‌యిన డ‌బ్బులే ఎక్క‌వవుతాయి. బ‌ట్ట‌ల విష‌యంలో అయితే అది పాత స్టాకా కాదా అన్న‌ది  తెలుసుకోండి.   అంతేకాదు ఇలాంటి వి అమ్మేట‌ప్పుడు ఎక్స్జేంజికి కూడా చాలా కంపెనీలు అవకాశ‌మివ్వ‌వు.  ఆన్‌లైన్‌లో అయితే ఎక్స్‌పైరీ డేట్ చూపించ‌వు కాబ‌ట్టి మ‌రింత కేర్‌ఫుల్‌గా ఆలోచించండి.  
* మీకు నిజంగా అవ‌స‌ర‌మైన వ‌స్తువు సేల్‌లో ఉంటేనే కొనండి. అది అవ‌స‌ర‌మా స‌ర‌దానా అనేది గుర్తిస్తే స‌గం  స‌మ‌స్య‌ తీరిపోయిన‌ట్టే.
* పెద్ద గా అవ‌స‌రం లేని వ‌స్తువైనా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంద‌ని కొనొద్దు.  జ‌స్ట్ దాన్ని పోస్ట్‌పోన్ చేయండి. ఓ వారం త‌ర్వాత కూల్‌గా మ‌ళ్లీ ఆలోచించండి. నిజంగా ఆ వ‌స్తువు అవ‌స‌ర‌మైతే నెక్స్ట్ సేల్స్ ఎలాగూ ఉంటాయి. అప్పుడు కొనొచ్చు. అవ‌స‌రం లేద‌నిపిస్తే మీ డ‌బ్బులు మిగిలిన‌ట్టే క‌దా. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు