• తాజా వార్తలు

రాజకీయ సాంకేతికత రాజ్యమేలబోతోందా?...

భారత రాజకీయాల్లొ గత కొన్నేళ్లుగా కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయి. అవన్నీ సాంకేతికత చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ తరువాత పరిణామాలతో ఆ ఎత్తుగడలు మరింత ప్రబలమవుతున్నాయి.  ప్రపంచమంతా పరుగులు తీస్తున్న సాంకేతికత వెనుకే భారత రాజకీయాలు కూడా నడవడం మొదలుపెట్టి, ఇప్పుడు పరుగు ప్రారంభించడం కొత్త పరిణామం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెక్నాలజీ ఎంత కీలకమైందో అందరికీ తెలిసిందే. దాన్ని విస్తృతంగా వాడుకున్న నరేంద్ర మోడీ అంతేస్థాయిలో లాభపడ్డారు. ఆ తరువాత మిగిలినవారూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఎంతగా ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియాలో అంతకుమించి ప్రచారం చేయడం.. 3డీ విధానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడం.. గూగుల్ హ్యాంగవుట్సులో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులతో ఇంటరాక్ట్ కావడం వంటివన్నీ మోడీ ఈ దేశంలోని మిగతా రాజకీయ నేతలకు నేర్పించారు. ఆ తరువాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో అందరూ అదే మంత్రం పఠిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాజకీయాలు, ఎన్నికల్లో సాంకేతిక విప్లవం మొదలైందని చెప్పాలి.

అయితే... ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో రాజకీయ పార్టీలది ఒక్కోదానిది ఒక్కో శైలి. ప్రజలను చేరుకోవడానికి మోడీ టెక్నాలజీని వాడితే, అంతకుముందే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దాన్ని ఇంకోరకంగా వినియోగించుకున్నారు. అచ్చమైన రాజకీయ నేతలా ఆమె సాంకేతికతకు రాజకీయ మెరుగులద్దారు. అది ఆమెకు ఒక్కసారిగా కాకుండా రెండో విడత కూడా వరుసగా అధికారాన్ని అందించింది. దాంతో జయలలిత పొలిటికల్ టెక్నాలజీపై మోడీ కూడా మనసు  పడి తానూ అదే దారిన నడవడానికి సిద్ధమవుతున్నారు.

2014 జనరల్ ఎలక్షన్లలో మోడీ టెక్నాలజీ స్పీడును అందుకోలేక దెబ్బయిపోయిన పార్టీలన్నీ ఆ తరువాత ఆయన దారిలోనే సాగుతుండగా 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే టెక్నాలజీని మరో కోణంలో వాడుకున్న జయలలిత ఎత్తుగడలు ఆమెకు రెండోసారి అధికారం అందేవరకు ఎవరికీ అర్థం కాలేదు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ సూత్రంపై పడింది. మోడీ దానికి మరింత డెవలప్ చేసి ప్రజల్లోకి వదలడానికి రెడీ అవుతున్నారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విద్యార్థులందరికీ ఫ్రీగా ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ బ్రహ్మాండంగా వర్కవుట్ అయి ఆమె అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రమంతటా విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇచ్చారు. అలా అందుకున్నవారిలో చాలామందికి ఆ తరువాత ఓటు హక్కు వచ్చింది. వారంతా మొన్నటి ఎన్నికల్లో ఆమెకే ఓటేసి మళ్లీ గెలిపించారు. ఒక్కసారి ఇచ్చిన హామీ ఎఫెక్టు ఆమెకు రికార్డు స్థాయిలో రెండో సారి అధికారాన్ని అందించింది.  దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల కన్ను దీనిపై పడింది. ‘అమ్మ’ జయలలితా అనుకుని అంతా ఆశ్చర్యపోయారు. టెక్నాలజీని వాడుకోవడం అంటే మాకు తెలిసిందే కాదు ఇలా కూడా వాడుకోవచ్చన్నమాట అనుకున్నారు.

సహజంగానే చురుగ్గా ఉండే మోడీ కూడా జయ ప్లానుకు ముచ్చటపడి తానేం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చారు. 2014లో మంచి ఊపుతో గెలిచినా ఇప్పటికే కొంతవరకు తమ గ్రాఫ్ పడిపోవడంతో మళ్లీ ఎలా పుంజుకోవాలా అని ఆలోచిస్తున్న ఆయనకు జయ ప్లాను వరంలా కనిపించింది. తాను కూడా టెక్నాలజీ ఇంతవరకు ఉపయోగించుకున్నట్లుగా కాకుండా కొత్త పద్ధతిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. ప్రపంచంతో పాటు భారతదేశంలోనే అందరి చేతికీ స్మార్టు ఫోను వచ్చేసిన నేపథ్యంలో ఇంటర్నెట్ కూడా ఇంటింటి అవసరమైపోయిందని గుర్తించి దాన్ని ప్రజలకు ఉచితంగా ఇచ్చే దిశగా మోడీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ చాలామందికి చేరువైనా గ్రామాలు, మధ్య తరగతి, ఆ దిగువ తరగతికి పూర్తిగా ఇంకా చేరలేదు. అంతేకాదు.. ఇంటర్నెట్ వేగం, ధరలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దాంతో ఆయన అందరికీ ఉచిత ఇంటర్నెట్ ఇచ్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన దీనికి బలం చేకూరుస్తోంది. తమిళ నాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రొజే ఈ ప్రకటన రావడమే ఈ సంపాదకీయానికి కారణం . దేశవ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను కేటాయించడం లేదా వినియోగించిన డాటాను రీయింబర్స్ చేసే పథకాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇది జయలలిత ప్రభావంతో మోడీ మదిలో మొలిచిన ఆలోచనగానే విశ్లేషకులు చెబుతున్నారు. జయ విషయంలో ఫలించినట్లే మోడీకి కూడా ఇది వర్కవుట్ అయితే, మరికొన్నాళ్లు ఆయనే రారాజుగా నిలిచే అవకాశాలున్నాయి.  ప్రధానికి సన్నిహితంగా ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని స్వయంగా ఈ విషయాన్ని మానిటర్ చేస్తున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కొన్నాళ్లపాటు ఇలాంటి రాజకీయ సాంకేతికతే రాజ్యమేలబోతుందని అర్థమవుతోంది.