• తాజా వార్తలు

ఈ-భారత్

ఇండియా.. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో రెండోది.

విస్తీర్ణంలో ఏడోది

..చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న జనరల్ నాలెడ్జి పుస్తకాల్లో ఇలాంటి ర్యాంకింగులు అందరం చూసే ఉంటాం.

కానీ ఇప్పుడు ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. డిజిటల్ రూపంలో ప్రబల శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఈ విషయంలో భారత్ తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. ఆ పరుగు పందెంలో కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. జనాభా, విస్తీర్ణం వంటి సాధారణ అంశాల్లో సాధించిన ర్యాంకులు కాదు.. ప్రపంచం తలరాతను మారుస్తున్న టెక్నాలజీ రంగంలో  రోజురోజుకూ తన ర్యాంకు మెరుగుపరుచుకుంటూ అగ్రపథం దిశగా సాగిపోతుంది. ఆ అలుపెరగని ప్రయాణంలో ఇప్పుడు ఇండియా ఎక్కడుందో తెలుసా..?

    ఐటీ ఇండస్ర్టీ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఇండియా స్థానం 2

    మొబైల్ ఫోన్ వాడకంలో 2వ స్థానం

    ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 3వ స్థానం

ఈ లెక్కలు చాలు ఇండియాలో టెక్నాలజీ రంగం ఎంత కీలకంగా మారిందో చెప్పడానికి. ప్రపంచంలోనే ఐటీ సేవలకు ఇప్పుడు భారతే అతిపెద్ద గమ్యస్థానం. అంటే ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం వైపే చూస్తోందన్నమాట... అలాంటప్పుడు భారత్ మాత్రం సాంకేతిక రంగాన్ని ఎందుకు విస్మరించాలి? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తనకు తాను వేసుకున్న ఈ ప్రశ్న ఇప్పుడు దేశ ముఖచిత్రాన్ని మార్చడానికి సమాధానమై తిరిగిరానుంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, నాలుగు రోజుల కిందట ప్రవేశపెట్టిన రైల్ బడ్జెట్ రెండూ కూడా దేశంలో సాంకేతిక రంగంలో కొత్త శకానికి నాంది పలికాయనే చెప్పుకోవాలి. మునుపెన్నడూ లేనట్లుగా సాంకేతికరంగానికి పెద్ద పీట వేశారు. భారత్ ను ఇ-భారత్ గా మార్చేందుకు ప్రణాళికలతో ముందుకొచ్చారు. ఈ సాంకేతిక విప్లవ ఫలితాలు మున్ముందు దేశ గతిని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక ప్రాధాన్యాలుగా తీసుకున్న పథకాల్లో 'డిజిటల్ ఇండియా' ఒకటి. సాంకేతిక సేవలను, సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. సేవల్లో ఆలస్యం తగ్గడంతో పాటు సౌలభ్యం, పారదర్శకత, అవినీతి నిర్మూలన వంటి అన్నిటికీ ఇదే సరైన మార్గంగా భావించిన మోడీ డిజిటల్ ఇండియా పథకంలో అనేక లక్ష్యాలను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే వాటిలో కొన్ని అమలు చేసి ప్రగతి సాధించారు. తాజా బడ్జెట్ లోనూ సాంకేతిక పరుగుకు ప్రోత్సాహం అందించేలా చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఐటీ సేవలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ-కామర్స్ కు వెన్నుదన్నుగా నిలిచారు. పదిహేనేళ్ల కిందట దేశ జీడీపీలో ఐటీ సేవల వాటా కేవలం 1.2... ఇప్పుడు 9.6 శాతం వాటా ఉంది. అంటే... దేశ జీడీపీలో ఐటీ వాటా 8 రెట్లు పెరిగిందన్నమాట. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతన్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన రంగానికి మరింత ప్రాధాన్యమిస్తే అది అన్ని రకాలుగా ప్రయోజనకరమని నమ్మి ఐటీ సేవలను విస్తృతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ లో సాంకేతిక రంగానికి సంబందించిన అంశాలు చూస్తే గత ఏ బడ్జెట్ లోనూ ఈ రంగానికి ఇంత ప్రాధాన్యం దక్కలేదన్న విషయం అర్తమవుతుంది. ఇవన్నీ సాధ్యమైన తరువాత భారత దేశం ఎలా మారబోతుందో ఊహించుకోవచ్చు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రతిచోటా టెక్నాలజీయే రాజ్యమేలుతుంది. సేవాకేంద్రాలు, టిక్కెట్ కౌంటర్లు వంటివాటి వద్ద రద్దీయే ఉండదు. కూర్చున్న చోటు నుంచే అన్ని పనులూ పూర్తి చేసుకునేలా రోజులు మారిపోబోతున్నాయి. మరి ఈ డిజిటల్ విప్లవానికి జైట్లీ వేసిన మెట్లేంటే చూద్దామా...

  • డిజిటల్ ఇండియాకు బడ్జెట్లో ప్రత్యేకంగా 2059 కోట్లు కేటాయించారు.
  • డిజిటల్ లిటరసీని ప్రోత్సహించేందుకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరతా అభియాన్ లను ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో 12 కోట్ల మందిని దీని పరిధిలోకి తెస్తారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్ లు, స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడగలిగే సామర్థ్యం పెంపొందించడమే దీని లక్ష్యం.
  • స్కూళ్లు, కాలేజిల్లో విద్యార్థులకు కావల్సిన సర్టిఫికెట్లు అందించే డిజిటల్ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. దీన్నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సర్టిపికెట్ తీసుకోవచ్చు.
  • జాతీయ స్థాయిలో కెరీర్ సర్వీస్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి దానికి అన్ని రాష్ట్రాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలను అనుసంధానిస్తారు.
  • జాతీయ భూమి రికార్డులను అప్ డేట్ చేయడానికి, ఈజీ యాక్సెస్ లోకి తేవడానికి డిజిటల్ ల్యాండ్ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

వీటితో పాటు దాదాపుగా ప్రతిరంగంలో ఎలక్ర్టానిక్ సేవలకు ప్రభుత్వం తెరతీసింది.

  • వ్యవసాయం రంగంలోనూ హోల్ సేల్ మార్కెట్లను లింక్ చేస్తూ ఈ-మార్కెట్ సృష్టించబోతోంది.
  • పశువుల బ్రీడర్లు, పాడి రైతులకు ఉపయోగపడేలా ఈ-కామర్స్ సైట్ ను డెవలప్ చేయనుంది.
  • 3 లక్షల రేషన్ షాపులను డిజిటలైజ్ చేస్తారు.
  • ఇకపై ఏడు మహానగరాల్లో అన్ని రకాల పన్నులు చెల్లించేవారికోసం ఈ-అసెస్ మెంట్ సౌకర్యం.
  • ఎఫ్ సీఐ ఆహారధాన్యాల సేకరణకు కూడా ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానం అమలు
  • కొత్తగా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక్కరోజులోనే అనుమతులన్నీ పూర్తయ్యేలా ఆన్ లైన్ సేవలు.

... ఇవన్నీ దేశీయ ఐటీ రంగాన్ని పరుగులు తీయించే చర్యలుగానే చెప్పుకోవచ్చు. డిజిటల్ సాక్షరతా మిషన్, అగ్రికల్చర్ ఈ-మార్కెట్ వంటి ఇనిషియేటివ్స్ వల్ల టెక్నాలజీ, ఇంటర్నెట్ పూర్తిగా గ్రామస్థాయికి చొచ్చుకుపోవడం ఖాయం. ఇది భారత ప్రజలకు, వారిపై ఆధారపడే ఐటీ రంగానికి రెండిటికీ మేలు చేయబోతోంది.

తగ్గింపులు...

టెక్నాలజీ సంబంధిత పరికరాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పన్నులను భారీగా తగ్గించారు. ఇంటర్నెట్ సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి.. కంప్యూటర్, మొబైల్ ఆధారిత సేవలను మరింతగా పొందేందుకు ఇది మార్గం వేస్తుందని ఆశిస్తున్నారు.

  • ఐటీ సంబంధిత ఉత్పత్తులపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు భారీగా తగ్గించారు. ఇప్పటివరకు 12.5 శాతంగా ఉన్న ఈ పన్నులను 4 శాతానికి తగ్గించారు. అంటే పన్నులు మూడోవంతుకు తగ్గించేశారన్న మాట. దీంతో దేశీయంగా ఐటీ సంబంధిత ఉత్పత్తుల తయారీ ఊపందుకోవడం ఖాయం.
  • అంతేకాదు... ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల వైఫై రౌటర్లు, మోడెంలు, కెమేరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు, సెట్ టాప్ బాక్సులు, ఈ-రీడర్లు వంటివాటి ధరలు 8 శాతం వరకు తగ్గుతాయి.

 

రైల్వేల్లో 'డిజిటల్' కూత

రైల్వే బడ్జెట్ లోనూ టెక్నాలజీకి పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే.

  • టికెట్ల కొనుగోలును ఇప్పటికే ఆన్ లైన్ లో విస్తృతం చేశారు. ఇకపై ప్లాట్ ఫాం టిక్కెట్లు, జనరల్ బోగీ టికెట్లు కొనడానికి కూడా యాప్స్ తీసుకొచ్చారు.
  • కొన్ని స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించారు. వచ్చే రెండేళ్లలో ఇది 400 స్లేషన్లకు విస్తరిస్తారు.
  • కొత్త ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు.. ఆ ఏరియాపై అవగాహన లేని ప్రయాణికుల కోసం తరువాత వచ్చే స్టేషన్ ఏదో చెప్పేలా బోగీల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
  • ఇకపై టిక్కెట్లపై బార్ కోడ్స్ ఉంటాయి
  • హైల్స్ లైన్ల ఏర్పాటు
  • ప్రయాణంలో ఇబ్బంది ఎదురైనా, అసౌకర్యం ఎదురైనా, ఫిర్యాదు చేయాలన్నా, సూచన చేయాలన్నా ట్విట్టర్ సహాయంతో రైల్వే మంత్రి నుంచి జోన్లు, డివిజన్ల మేనేజర్ల వరకు ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు.

..ఇలా రైల్వేల్లోనూ టెక్నాలజీని భారీ స్థాయిలో వినియోగిస్తూ ప్రయాణికుల కష్టాలను తగ్గిస్తున్నారు.

ప్రభుత్వం ఆశిస్తున్నది, ప్రజలు కోరుకుంటున్నది అన్నీ జరిగితే కొన్నాళ్లకు ఇండియా సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన సగర్వంగా తలెత్తుకోవడం ఖాయం.

                              మీ జ్ఞాన తేజ నిమ్మగడ్డ

                                                               సంపాదకుడు

                                                            కంప్యూటర్ విజ్ఞానం

                                                        తొలి తెలుగు సాంకేతిక పత్రిక

 

జన రంజకమైన వార్తలు