• తాజా వార్తలు
  •  

యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్‌.. 2075లోనూ కింగ్‌లే!

మ‌నం చూస్తుండ‌గానే ల్యాండ్ ఫోన్లు క‌నుమ‌రుగ‌య్యే దశ‌కు చేరిపోయాయి. పేజ‌ర్లయితే అస‌లు ఇప్పుడు మ‌నుగ‌డ‌లోనే లేవు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయ్యే కొద్దీ కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్ వంటివి మాత్రం అంత తొంద‌ర‌గా తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అన్నింటికీ టెక్నాల‌జీతో ముడిపడిన ఈ రోజుల్లో ఇవి లేకుండా ముందుకెళ్ల‌డం క‌ష్ట‌మే. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఈ కంపెనీలు ఎప్ప‌టిక‌ప్పుడు టెక్న‌లాజిక‌ల్‌గా అప్డేట్ అవుతూ జ‌నం మ‌న‌సుల్లో స్థానాన్ని ప‌దిల‌ప‌ర‌చుకుంటున్నాయి. అందుకే 2075 వ‌ర‌కు కూడా యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్ మ‌నుగ‌డ‌లోనే ఉంటాయంటున్నారు యాపిల్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడైన స్టీవ్ ఓజ్నియాక్‌. అప్ప‌టికి ఇవి ప్ర‌పంచాన్ని మ‌రింత‌గా శాసించే పరిస్థితి వ‌స్తుంద‌ని కూడా చెబుతున్నారు.
యాపిల్‌.. అప్ప‌టికీ అదుర్సే
ఓ ఇర‌వై ఏళ్ల క్రితం మొబైల్‌ఫోన్ చేతిలో ఉన్న వ్య‌క్తిని చాలా అడ్మ‌యిరింగ్‌గా చూసేవారు. త‌ర్వాత ఎయిర్‌టెల్ వంటి సెల్ కంపెనీలు, రిల‌య‌న్స్‌, ఐడియా వంటి దిగ్గ‌జాలు క‌లిసి సెల్‌ఫోన్‌ను సామాన్యుడికి కూడా చేరువ చేశాయి. ఎర్ర బ‌ట‌న్‌, ప‌చ్చ‌బ‌ట‌న్ మాత్ర‌మే ఉండే ఫీచ‌ర్ ఫోన్ల నుంచి ప్ర‌పంచాన్ని గుప్పిట్లోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ల వ‌ర‌కు టెక్నాల‌జీ ప‌రుగులు పెట్టింది. ట‌చ్ స్క్రీన్లు, వీఆర్‌, ఏఐ టెక్నాల‌జీలు వ‌చ్చేశాయి. 1976లో యాపిల్‌ను స్టీవ్ జాబ్స్‌తో క‌లిసి వోజ్నియాక్ స్థాపించారు. న‌ల‌భై ఏళ్లుగా టెక్నాల‌జీ రంగంలో యాపిల్ తిరుగులేని బ్రాండ్‌. రోజురోజుకీ దీని వాల్యూ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. 1911లో ప్రారంభ‌మైన ఐబీఎం దాదాపు వందేళ్లు టెక్నాల‌జీలో ఎలా జెయింట్‌గా నిలిచిందో అలాగే యాపిల్ కూడా త‌న హ‌వాను మ‌రో 50, 60 ఏళ్లు స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపిస్తుంద‌ని వోజ్నియాక్ సిలికాన్ వ్యాలీ కామిక్ కాన్ఫ‌రెన్స్‌లో ఇటీవ‌ల చెప్పారు. యాపిల్ ద‌గ్గర దాదాపు 246 మిలియ‌న్ డాల‌ర్ల క్యాష్ ఉంది (దీన్ని ఇండియ‌న్ క‌రెన్సీలో మార్చితే ఎంత‌వుతుందో నోటితో చెప్ప‌డానికి కూడా క‌ష్ట‌మ‌య్యేంత పెద్ద ఫిగ‌ర్‌). కాబ‌ట్టి యాపిల్ ఏ రంగంలోనైనా ఇన్వెస్ట్ చేసి త‌న మ‌నుగ‌డ‌ను నిల‌బెట్టుకోగ‌ల‌ద‌ని వోజ్నియాక్ అన్నారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది వాడే సెర్చ్ ఇంజ‌న్ గూగుల్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కూడా ఇదే స్థాయిలో త‌మ ప్ర‌భావాన్ని కొన‌సాగిస్తాయన్నారు.
తిరుగులేని ఫేస్‌బుక్‌
ఆర్కూట్‌తో మొద‌లైన సోష‌ల్ నెట్‌వ‌ర్క్ వెబ్‌సైట్ల ప్ర‌వాహం ఇవాళ 125 కోట్ల భార‌తీయుల మ‌ధ్య అతిపెద్ద సామాజిక అనుసంధాన వేదిక‌గా మారింది. కాల‌క్ర‌మేణా ఆర్కూట్ మూత‌ప‌డినా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్ట‌ర్ వంటి సామాజిక అనుసంధాన వేదిక‌లెన్నో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫేస్‌బుక్ హ‌వా మ‌న‌కు తెలియంది కాదు. స్టీవ్ చెప్పిన‌ట్లు ఫేస్‌బుక్ 2075 వ‌ర‌కు లైవ్‌లో ఉండ‌డం ఖాయంగానే కనిపిస్తోంది.

జన రంజకమైన వార్తలు