• తాజా వార్తలు
  •  

స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

ఇండియన్ ఈ-కామర్స్ సెక్టార్లో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఫ్లిప్ కార్ట్ ఈ రంగంలోని మిగతా ప్లేయర్లను తనలో కలుపుకొనేందుకు ముందుకు ఉరుకుతోంది. ముఖ్యంగా స్నాప్ డీల్ ను టేకోవర్ చేయడానికి పావులు కదుపుతోందని వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా సుమారు రూ.10 వేల కోట్ల(1.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించడం టెక్, ఈ-కామర్స్ ఇండస్ర్టీలో సంచలనంగా మారింది.
ఇండియాలో ఇదే ప్రథమం
ఫ్లిప్‌కార్ట్ .. టెనె్సంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. ఆన్‌లైన్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో మధ్య ఏకంగా విదేశీ సంస్థల నుంచి 1.4 బిలియన్ డాలర్ల నిధులను సేకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక ఇండియన్ ఈ-కామర్స్ సైట్ ఇంత పెద్ద ఎత్తున నిధులను సమీకరించడం ఇదే ప్రథమం.
టార్గెట్ అమెజాన్.. ఈబే సాయం
తాజా నిధుల సమీకరణ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో వ్యూహాత్మక మదుపరిగా చేరింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, నాస్పర్స్ గ్రూప్, ఏసెల్ పార్ట్‌నర్స్, డిఎస్‌టి గ్లోబల్, బైల్లీ గిఫ్ఫర్డ్ సంస్థలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ఇక వ్యాపారపరంగా దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, ఈబే విలీనం అవుతున్న క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో ఈబే వ్యాపార నిర్వహణను ఫ్లిప్‌కార్ట్ చూస్తుంది. ఈ ఏడాది ఆఖర్లో ఈ లావాదేవీ కొలిక్కి రానుంది. మరోవైపు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు భారత్‌లో గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తాజా నిధుల సమీకరణతో అమెజాన్‌పై ఫ్లిప్‌కార్ట్ వ్యాపారపరంగా ఎదురుదాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్నాప్ డీల్ తో చర్చలు
మరోవైపు తన దేశీయ ప్రత్యర్థి స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్.. స్నాప్‌డీల్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. స్నాప్‌డీల్ కొనుగోలుతో పెరిగే మార్కెట్ వాటా వల్ల అమెజాన్‌కు చెక్ పెట్టవచ్చన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. స్నాప్‌డీల్ కూడా ఇటీవలికాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఫ్లిప్ కార్టుతో మంచి డీల్ వస్తే ఓకే అన్నట్లుగా ఉందని సమాచారం. దీంతో కొద్దిరోజుల్లో ఫ్లిప్ కార్టులో స్నాప్ డీల్ విలీనం తథ్యమని తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు