• తాజా వార్తలు
  •  

పవర్ బ్యాంక్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు


యాపిల్ ఫోన్ నుంచి చైనా ఫోన్ వరకూ ఏదీ ఒక్క రోజు కంటే ఎక్కువ చార్జింగు రావడం లేదు. దీంతో తరచూ ప్రయాణాలు చేసేవారు.. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతాలవారు పవర్ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. స్మార్టు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ పవర్ బ్యాంకు తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే.. మార్కెట్లో రూ.200 నుంచి రూ.10 వేల వరకు ధరల్లో పవర్ బ్యాంకులు కనిపిస్తుండడంతో ఏది కొనాలి, ఏది కొనకూడదు అన్నది తెలియక చాలామంది అయోమయంలో ఉంటున్నారు. ఒక్కోసారి సరైనది కొనుగోలు చేయక నష్టపోతున్నారు. సో... పవర్ బ్యాంకు కొనేటప్పుడు ఏఏ అంశాలు లెక్కలోకి తీసుకోవాలన్నది తెలుసుకుంటే మంచి పవర్ బ్యాంకు మన సొంతమవుతుంది. ‘కంప్యూటర్ విజ్ఞానం’ మీకు సూచించే ఈ 7 అంశాలు చెక్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచి పవర్ బ్యాంక్ కొనుగోలు చేయొచ్చు.

అవసరం
అసలు పవర్ బ్యాంకు మనకు దేనికి అవసరం అన్న విషయంలో స్పష్టత ఉండాలి. కేవలం ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడానికేనా లేదంటే స్మార్టు వాచ్, స్మార్ట్ బ్యాండ్ వంటివీ చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది తొలుత డిసైడ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న స్మార్టు ఫోన్లన్నీ 3000 నుంచి 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నవే ఉంటున్నాయి. అలాంటి ఒక ఫోన్ మూడు నుంచి నాలుగు సార్లు ఛార్జి చేసుకోవడానికి సరిపోయేలా 10,000 నుంచి 13,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ చాలు. ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లు ఛార్జి చేసుకునే అవసరం, ఫోన్లతో పాటు ఇతర గాడ్జెట్లూ ఉంటే 15000 నుంచి 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ లకు వెళ్లడం బెటర్

యూఎస్బీ పోర్టులు
యూఎస్బీ పోర్టులు ఎన్నున్నాయన్నది కీలకం. ఎంఐ వంటి పవర్ బ్యాంకులు మంచి పర్ఫార్మెన్సు ఇస్తున్నా దానికి ఒకే ఒక యూఎస్బీ పోర్టు ఉంటుండడంతో ఒక్క డివైస్ మాత్రమే ఛార్జింగ్ పెట్టుకునే వీలుంటోంది. అలాంటి ఇబ్బంది లేకుండా కనీసం 2 పోర్టులు ఉండేలా చూసుకోవాలి.

కరెంట్ అవుట్ పుట్
పవర్ బ్యాంకు కొనేటప్పుడు ఇది అత్యంత కీలకాంశం. కరెంట్ అవుట్ పుట్ ఎక్కువగా ఉంటే పవర్ బ్యాంక్ నుంచి డివైస్ కు ఛార్జింగ్ వేగంగా ఎక్కుతుంది. ఇందుకోసం 2ఏ లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ అవుట్ పుట్ ఉన్న పోర్టు కనీసం ఒకటైనా ఉండేలా చూసుకోవాలి. అయితే... ఆ హైకరెంట్ కు మన ఫోన్ సూటవుతుందో లేదో చూసుకోవాలి.

బరువు, సైజ్
పవర్ బ్యాంకు ఉపయోగం ప్రధానంగా జర్నీల్లో ఉంటుంది. అంటే మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటే బెటర్. కాబట్టి తక్కువ బరువు, చిన్న సైజ్ ఉండాలి. అదే సమయంలో కెపాసిటీ, పర్ఫార్మెన్సు బాగుండాలి. జేబులో పట్టే పవర్ బ్యాంకు అయితే మరీ మంచిది.

పేలకుండా చూసుకోండి
పవర్ బ్యాంకుల్లో ఓవర్ హీటింగ్, ఓవర్ ఛార్జింగ్ సమస్య ఉంటుంది. ఆ ప్రాబ్లెం ఉంటే చాలా డేంజర్. అలాంటి పవర్ బ్యాంకు బాంబుతో సమానం. ఎందుకంటే అది ఎప్పుడైనా పేలొచ్చు. అతిగా వేడెక్కని... ఓవర్ ఛార్జింగ్ కాని పవర్ బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి.

ఛార్జింగ్ టైం
పవర్ బ్యాంకు పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకయితే 6 నుంచి 9 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ కావాలి. అలా కానప్పుడు అది మంచిది కానట్టే.

ధర
ఇక ధర సంగతీ చూసుకోవాల్సిందే. ఇప్పుడున్న లెక్క ప్రకారం 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకయితే రూ.1000... 15000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకయితే రూ.1500... 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకయితే రూ.2 వేలు ధరకు కొనుగోలు చేయొచ్చు. పవర్ బ్యాంకు బ్రాండు... ఫీచర్లు... పర్ఫార్మెన్సు పరంగా మంచి డిమాండు ఉన్నవైతే కాస్త ఎక్కువ ధర పెట్టొచ్చు. అయితే... ఇంతకంటే బాగా తక్కువ ధరకు దొరుకుతున్నవి కొంటే జాగ్రత్త పడాల్సిందే. రేటు తక్కువైనా పర్ఫార్మెన్సు బాగుండకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు.

విజ్ఞానం బార్ విశేషాలు