• తాజా వార్తలు

ల్యాప్‌టాప్‌లలో వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని మీరే సాల్వ్ చేసుకోవ‌డానికి గైడ్ -1

ప‌ర్స‌న‌ల్ కంప్యూటర్ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే కంప్యూట‌ర్ ప‌నిచేసినంత సేపు దాన్ని వాడుకునే మ‌న‌కు ఒక్క‌సారి ఆగినా, ఏదైనా చిన్నాచిత‌కా స‌మ‌స్య వ‌చ్చినా అదేమిటో తెలియ‌క గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటాయి. అందుకే కంప్యూట‌ర్‌కు సర్వీసింగ్ చాలా కీలకం. మెయింట‌నెన్స్ లేట‌య్యేకొద్దీ బూటింగ్, హ్యాంగింగ్, హార్డ్‌డిస్క్ ఫెయిల్యుర్, ఓవర్ హీటింగ్, బ్యాటరీ డ్రెయినింగ్ వంటి ప్రాబ్ల‌మ్స్ వ‌స్తుంటాయి. ఇటువంటి ఎర్రర్స్ చోటుచేసుకున్నపుడు మీకంప్యూటర్లను సర్వీసింగ్ సెంటర్లకు తీసుకెళ్ల‌క్క‌ర్లేకుండా మీరే స‌ర్వీస్ చేసుకోవ‌చ్చు. అందుకు అవసరమైన  గైడ్‌ను ఈ ఆర్టికల్ లో చ‌దవండి.
కంప్యూటర్ బూట్ కావ‌డం లేదా?
కంప్యూటర్ బూట్ కాక‌పోవ‌డానికి చాలా కారణాలు ఉన్నాయి.  ఆపరేటింగ్ సిస్టం, హార్డ్‌డిస్క్‌,మ‌ద‌ర్‌బోర్డులో తలెత్తే లోపాలు కూడా ఓ కారణం కావొచ్చు. ఈ మూడూ స‌రిగానే పనిచేస్తున్నా పీసీ బూట్ కావ‌డం లేదంటే, సమస్య క‌చ్చితంగా పీసీ పవర్ కేబుల్స్‌లో ఉన్నట్లే.  పవర్ కేబుల్స్ బెండ్ అవ‌డం వల్ల వాటిలోని ఇంటర్నల్ వైర్ల బ్రేక్ అయి ఇలా జరిగేందుకు  ఆస్కారం ఉంది. కాబట్టి పవర్ కేబుల్స్ మార్చి చూస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
తరచూ హ్యాంగ్ అవుతుంటే?
 పీసీ పెర్ఫార్మెన్స్ నెమ్మదించటమనేది ప్రతి కంప్యూటర్‌లోనూ సాధారణంగా జ‌రిగేదే. ముఖ్యంగా ఓల్డ్ మోడల్ కంప్యూటర్లలో ఈ సమస్య ఎక్కువగా వ‌స్తుంటుంది.  ప్రాసెసర్‌కు సరిపడినంత ర్యామ్ అందుబాటులో లేకపోవటమే దీనికి ప్ర‌ధాన కార‌ణం. హై ఎండ్ ప్రాసెసర్‌లను కలిగి ఉండే కంప్యూటర్లలో ర్యామ్ చాలా కీలకం. సీపీయూ మెమ‌రీని నిరంతరం ఉపయోగించుకుంటుంది. కాబట్టి, అవసరమైనంత ర్యామ్‌ను ప్రాసెసర్‌కు సమకూర్చాలి. అదనపు ర్యామ్‌ను యాడ్ చేస్తే హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
ల్యాప్‌టాప్ పై కాఫీ ఒలికిందా..?
 అనుకోకుండానో, ఆజాగ్రత్త వ‌ల్లోమీ ల్యాప్‌టాప్ పై కాఫీ వంటి లిక్విడ్స్ ఒలికాయా? ఇక్కడితో మీ ల్యాపీ పని అయిపోయిందని నిరుత్సాహపడకండి. చమ్మ తాకిడికి గురై నిస్సత్తువగా మారిన మీ  ల్యాప్‌టాప్‌ను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ఈ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.  వీలైనంత త్వరగా ల్యాపీతో కనెక్ట్ అయి ఉన్న పవర్ కేబుల్‌ను తొలగించాలి. ఆ తరువాత ల్యాపీని పూర్తిగా టర్న్ ఆఫ్ చేయాలి. త‌ర్వాత‌ పేపర్ టవల్ లేదా స్పాంజ్ సహాయంతో డివైస్ పై కనిపించే లిక్విడ్‌ను తొల‌గించండి. తుడవటం ద్వారా ఆ తడి ఇతర ప్రదేశానాకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి, స్పాంజ్‌తో ఒత్తి చమ్మ పీల్చుకునేలా చూడండి. తేమ ఒత్తిడి వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ల్యాపీ బ్యాటరీని రిమూవ్ చేయండి. బ్యాటరీని రిమూవ్ చేసిన తరువాత హెయిర్ డ్ర‌య‌ర్‌తో తడి ప్రదేశాన్ని ఆరబెట్టండి. డ్రయ‌ర్‌ను తక్కువ సెట్టింగ్‌పై ర‌న్ చేయండి. తేమ పూర్తిగా ఆవిరైన త‌ర్వాత అన్నిభాగాలను అసెంబుల్ చేసి ఆన్ చేసి చూడండి.  నూటికి 90 శాతం కేసుల్లో ఇలా చేస్తే  ల్యాపీ ఆన‌వుతుంది.  లేదంటే అప్పుడే స‌ర్వీసింగ్ సెంట‌ర్‌కు తీసుకెళ్లండి.
 హార్డ్‌డిస్క్ ఫెయిల్ అని వస్తోందా?
 కంప్యూటర్ హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లు ఫెయిల్ అవటం వల్ల లోపల స్టోర్ అయి ఉన్న డేటా మొత్తం డిలీట్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. డేటా రికవరీ ఉన్నా ఎంత‌వ‌ర‌కు తిరిగొస్తుందో క‌చ్చితంగా చెప్ప‌లేం. హార్డ్‌డిస్క్ డ్రైవ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు.  డేటా కరప్ట్ అవటం, బ్యాడ్ సెక్టార్స్, తరచూ ఫ్రీజ్ అవడం, డ్రీడెడ్ బ్లూ స్ర్కీన్ ఎర్రర్స్ వంటి సంకేతాలు హార్డ్‌డిస్క్ ప్రమాదంలో ఉన్నట్లు సూచించేవే. ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో హార్డ్‌డిస్క్ ఫెయిల్ అవుతున్నట్లయితే పీసీని సర్వీసింగ్ సెంటర్‌లో చూపించాల్సిందే. ఇటువంటి ఎర్రర్స్‌ను మీరు గుర్తించిన పక్షంలో హార్డ్‌డిస్క్‌కు సంబంధించిన SATA కేబుల్స్‌ను మార్చి చూడండి. సమస్య పరిష్కారమవ్వొచ్చు. ఒకవేళ మీ ల్యాప్‌టాప్ స్టోరేజ్ స్పేస్ ఫుల్ అని వస్తున్నట్లయితే CD-ROM/DVD డ్రైవ్ స్థానాన్ని సెకండరీ హార్డ్‌డిస్క్ డ్రైవ్‌తో రీప్లేస్ చేయండి.
ల్యాప్‌టాప్ తరచూ ఓవర్ హీట్ అవుతోందా?
స్లిమ్ బాడీ, హై రిజ‌ల్యూషన్ స్ర్కీన్, వేగవంతమైన ప్రాసెసర్, హైఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ వంటి ఆధునిక ఫీచర్లు ల్యాప్‌టాప్ పనితీరునే మార్చేసాయి. అయితే వీటికి ఓవ‌ర్‌హీటింగ్ పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీనికి సరైన పరిష్కార మార్గాన్ని త‌యారుచేసే కంపెనీలు కూడా క‌నుక్కోలేక‌పోతున్నాయి. ల్యాప్‌టాప్‌లలో ఓవర్ హీటింగ్ డివైస్ హార్డ్‌వేర్ ఫెయిల్యూర్‌కు కారణమయ్యే ప్రమాదముంది. ఓవర్ హీటింగ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ల్యాప్‌టాప్ జీవితకాలమే దెబ్బతింటుంది.  ఓవర్ హీటింగ్‌కు ప్రధాన కారణం ల్యాపీ లోపలి కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే. ఫ్యాన్‌లో దుమ్ము అమితంగా పేరుకుపోవటం వల్ల గాలి బ్లాక్ అయిపోతుంది. ఈ కారణంగా గాలి వ్యవస్థ పూర్తిగా స్తంభించి హీటింగ్ సమస్య ఉత్పన్నమవుతుంది. డస్ట్‌ను క్లీన్ చేయటం ద్వారా హీటింగ్‌ను నివారించవచ్చు. ఈ ఫ్యాన్‌ను క్లిన్‌ చేసే క్రమంలో ల్యాపీని షట్‌డౌన్ చేసి బ్యాటరీని తొలగించాలి. వ్యాక్యుమ్ క్లీనర్‌ను ఉపయోగించటం ద్వారా దుమ్మును త్వరగా క్లీన్ చేయవచ్చు. మీ ల్యాప్‌టాప్ కూల్‌గా ఉండాలంటే ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది.  ల్యాప్‌టాప్స్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్లబరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో ఉన్నాయి.
బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా?
 ల్యాప్‌టాప్‌లను వేధిస్తోన్న మరో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్. వాడకం పెరిగే కొద్దీ ల్యాప్‌టాప్‌లలోని బ్యాటరీ సెల్స్ దమ్మును కోల్పోవ‌డం వ‌ల్ల బ్యాకప్ తగ్గిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితిని మీరు ఫేస్ చేస్తున్న‌ప్పుడు పాత బ్యాటరీలను కొత్త బ్యాటరీలతో రీప్లేస్ చేయటం ఉత్తమం. బ్యాటరీ ఎంపిక విషయంలో ఖర్చు గురించి రాజీప‌డొద్దు. ఒరిజినల్ బ్యాటరీలు కొంటే ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది. మళ్లీ మళ్లీ బ్యాటరీలను రీప్లేస్ చేయవల్సిన అవసరం ఉండదు.

జన రంజకమైన వార్తలు