• తాజా వార్తలు
  •  

మైక్రోసాఫ్ట్ కైజాలా యాప్ కి కంప్లీట్ గైడ్

మీలో కైజాలా యాప్ గురించి ఎంతమందికి తెలుసు? ఇది ఒక ఉచిత కమ్యూనికేషన్ యాప్.ఇది మైక్రోసాఫ్ట్ ఉత్పాదన. ఆర్గనైజేషన్ లకూ, వ్యాపార సంస్థలకూ, ప్రభుత్వ విభాగాలకూ టీం చాట్ ద్వారా తమ పనిని మరింత సులభతరం చేసుకోవడానికి ఈ యాప్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మీరు ఇండివిడ్యువల్ గానూ మరియు గ్రూప్ లలోనూ చాట్ చేసుకోవచ్చు. కేవలం టెక్స్ట్ మెసేజ్ లు పంపడం మాత్రమే గాక ఫోటో లు, వీడియో లు, కాంటాక్ట్ లు ,ఆడియో మరియు డాక్యుమెంట్ లను సెక్యూర్ గా పంపడం లాంటి ఎన్నో పనులు ఈ కైజాలా యాప్ లో చేయవచ్చు. కైజాలా కు ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏమిటంటే కేవలం గ్రూప్ కు వ్యక్తులను మాత్రమే గాక గ్రూప్ మరొక గ్రూప్ ను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి అనేక గ్రూప్ లకు ఏదైనా అనౌన్స్ మెంట్ చేయవలసినపుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతానికి pc లో అందుబాటులో లేదు. కేవలం ఆండ్రాయిడ్ మరియు ఐ ఫోన్ లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ లో మైక్రోసాఫ్ట్ కైజాలా ను ఉపయోగించడం ఎలా?                           

మొదటగా ఈ యాప్ ను మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాతా మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోవలసిందిగా ఇది అడుగుతుంది. వెరిఫై అయిన తర్వాత చాట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడనుండి మీరు చాటింగ్ చేసుకోవచ్చు. చాట్ స్టార్ట్ చేయాలంటే ఆ ట్యాబ్ లో పైన ఉండే + గుర్తు పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మీరు వ్యక్తిగత చాట్ స్టార్ట్ చేస్తున్నారా లేక గ్రూప్ చాట్ క్రియేట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి.

ఉదాహరణకు స్టార్ట్ ఎ చాట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. మీరు చాట్ చేయాలి అనుకున్నవారిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వారు కూడా తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ కైజాలా యూజర్ అయి ఉండాలి. లేకపోతే వారిపేరు కాంటాక్ట్ లిస్టు లో కనపడదు. మీరు యూజర్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక అక్కడనుండి మీరు మీ చాటింగ్ ను ప్రారంభించవచ్చు. మీరు మీ మెసేజ్ లను టైపు చేయవచ్చు, వాయిస్ మెసేజ్ లను రికార్డు చేయవచ్చు. ఇది మాత్రమే గాక ఫోటో లు, వీడియో లు, డాక్యుమెంట్ లను పంపడానికి క్రింద భాగం లో అటాచ్మెంట్ ఐకాన్ కూడా ఉంటుంది,

మీరు క్రియేట్ ఎ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. మొదటగా మీరు గ్రూప్ మెంబర్ లను యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ గ్రూప్ కు ప్రొఫైల్ ఫోటో ను సెలెక్ట్ చేసుకుని మీ గ్రూప్ కు పేరు పెట్టాలి. ఇక ఎంచక్కా మీరు ఆ గ్రూప్ లో చాటింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ లో ఉన్న మిగతా గ్రూప్ మెసేజింగ్ యాప్ ల లాగా గ్రూప్ మెంబర్ ల విషయం లో దీనికి ఏ విధమైన పరిమితి లేదు. ఎంతమందిని అయినా గ్రూప్ లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకే గ్రూప్ ఎన్ని గ్రూప్ లను అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంతమందికి ఒకే సారి మెసేజ్ ఇచ్చే సందర్భాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కైజాలా కు మాత్రమే ఉన్న విశిష్టమైన  ఫీచర్.

ఇది  మాత్రమే గాక మరో 11 విభిన్నమైన యాక్షన్ లను ఇది ఆఫర్ చేస్తుంది. అవి అనౌన్స్ మెంట్,జాబ్, లెట్స్ మీట్,క్విక్ పోల్,ఫోటో విత్ లొకేషన్,సర్వే, చేక్ల్ లిస్టు, లైవ్ లొకేషన్,రిక్వెస్ట్ లొకేషన్,షేర్ లొకేషన్ మరియు సబ్మిట్ బిల్. వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

అనౌన్స్ మెంట్

కైజాలా లో ఏదైనా అనౌన్స్ చేయాలి అంటే చాట్ స్క్రీన్ పై భాగం లో ఉండే గ్రిడ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఒక పాప్ అప్ డైలాగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు అనౌన్స్ మెంట్ అనే కనపడుతుంది. దీనిని సెలెక్ట్ చేసుకుని మీరు అనౌన్స్ చేయాలి అనుకున్న విషయానికి టైటిల్ ను ఎంటర్ చేసి దానిగురించి వివరణ రాయాలి. దీంతో పాటు ఫోటో లు, డాక్యుమెంట్ లు మరియు ఆడియో అనౌన్స్ మెంట్ లను కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడం అయిన తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి. దీనిని మీరు గ్రూప్ కి పంపినట్లయితే ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్ లు అందరూ దీనిని చూడగలుగుతారు. అందరూ ఆ అనౌన్స్ మెంట్ ను లైక్, కామెంట్ చేయడానికి మరియు అటాచ్ మెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది.

ఎసైన్ జాబ్స్ ( పనిని పురమాయించడం )        

మీ గ్రూప్ లో ఉన్న సభ్యులకు మీరు ఏదైనా పనిని పురమాయించాలి అనుకుంటే కైజాలా చక్కటి ఆప్షన్ ను కలిగి ఉంది. గ్రిడ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే వచ్చే పాప్ అప్ డైలాగ్ లో జాబ్ అనే ఐకాన్ ఉంటుంది. దానిని సెలెక్ట్  చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ గ్రూప్ సభ్యులచే చేయించాలి అనుకున్న పని గురింఛి వివరణ,గడువుతేదీ లాంటివి ఇక్కడ సెట్ చేయాలి. అంతా పూర్తి అయిన తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ జాబ్ మీ గ్రూప్ లో పోస్ట్ చేయబడుతుంది. యూజర్ లు దీనిని లైక్ చేయవచ్చు, కామెంట్ చేయవచ్చు మరియు నోట్స్ కూడా రాసుకోవచ్చు.స్టేటస్ ను కూడా మార్చవచ్చు.ఈ రెస్పాన్స్ లన్నీ చాట్ స్క్రీన్ లో కనిపిస్తాయి. మీరు ఆ రెస్పాన్స్ లను చూసి యూజర్ లకు రిమైండర్ లు కూడా పెట్టవచ్చు.

మీటింగ్స్ క్రియేట్ చేసుకోవడం

ఇందులో ఉండే లెట్స్ మీట్ ఆప్షన్ మీటింగ్ లను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మీటింగ్ లను క్రియేట్ చేయడమే గాక యూజర్ లను మీటింగ్ లకు ఇన్వైట్ చేయడం, స్టేటస్ ను కన్ఫాం చేయడం లాంటివి కూడా చేయవచ్చు. గ్రిడ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే వచ్చే పాప్ అప్ లోనే లెట్స్ మీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి మీటింగ్ యొక్క టైటిల్,డేట్ ,టైం,వ్యవధి, ప్లేస్, ఎజెండా లాంటివి ఎంటర్ చేయాలి. ఇలా మీటింగ్ క్రియేట్ చేసిన తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేస్తే మీటింగ్ కు సంబందించిన వివరాలన్నీ గ్రూప్ లో కనపడతాయి. ఇక్కడ మూడు ఆప్షన్ లు ఉంటాయి. అవి ఎస్,నో,మరియు మే బి. యూజర్ లు వీటిలో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దానిని బట్టి ఆ మీటింగ్ కు ఎంత మంది హాజరు అవుతున్నారు అనేదానిపై మీకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే యూజర్ లు రెస్పాన్స్ కార్డు పై తమ కామెంట్ ను కూడా ఇవ్వవచ్చు.

క్రియేట్ పోల్

యూజర్ లకు ఏదైనా అంశం పై పోల్ ను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని క్విక్ పోల్ ఆప్షన్ కల్పిస్తుంది. చాట్ స్క్రీన్ లో ఉండే క్విక్ పోల్ ఆప్షన్ ను సెలెక్ట్  చేసుకుని మీరు అడగాలి అనుకున్న ప్రశ్న ను అక్కడ టైపు చేయాలి. దీనితో పాటు ఛాయస్ లను, పోల్ ఎక్స్ పైరీ టైం ను, విజిబిలిటీ సెట్టింగ్ లను సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ పోల్ ను మీరు ఏదైనా గ్రూప్ కు గానీ యూజర్ కు గానీ సెండ్ చేయాలి. ఆ పోల్ యొక్క రెస్పాన్స్ లను,రెసుల్త్ లను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

షేర్ యువర్ కరెంటు లొకేషన్ విత్ ఫోటో

కైజాలా లో ఉండే మరొక ముఖ్యమైన ఫీచర్ ఇది.  మీరు ప్రస్తుతం ఉన్న లొకేషన్ ను ఫోటో తో సహా ఏదైనా గ్రూప్ కు గానీ యూజర్ కు గానీ పంపవచ్చు. దీనికోసం చాట్ స్క్రీన్ లో ఉండే ఫోటో విత్ లొకేషన్ ఆప్షన్ ను సెలెక్ట్  చేసుకుంటే ఒక కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు ఉన్న లొకేషన్ ఫోటో తీయాలి. ఆ తర్వాత ఆ లొకేషన్ ను సెర్చ్ చేయాలి. లొకేషన్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్ మరియు ఫోటో ను గ్రూప్ కు గానీ యూజర్ కు గానీ పంపవచ్చు. యూజర్ లు ఆ ఫోటో ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, లైక్ మరియు కామెంట్ కూడా చేయవచ్చు.

సర్వే చేయడం ఎలా ?

కైజాలా లో సర్వే చేయడం క్విక్ పోల్ లో చేసిన మాదిరి గానే ఉంటుంది.కాకపోతే  క్విక్ పోల్ లో మనం కేవలం ఒక ప్రశ్న ను మాత్రమే అడుగుతాము. ఇక్కడ అనేక ప్రశ్నలను సర్వే రూపం లో అడగడం ద్వారా యూజర్ ల అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు. చాట్ స్క్రీన్ లో ఉండే గ్రిడ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే సర్వే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సర్వే చేయాలి అనుకుంటున్న అంశం యొక్క సూక్ష్మ వివరణ ఇవ్వాలి.దీనితర్వాత కవర్ ఇమేజ్ నూ, సర్వే లో ఉండే ప్రశ్నలను యాడ్ చేయాలి. మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలను, టెక్స్ట్ రెస్పాన్స్ లను, న్యూమరిక్ రెస్పాన్స్ లను మరియు ఇమేజ్ ప్రశ్నలను కూడా యాడ్ చేయవచ్చు. ప్రశ్నలను యాడ్ చేసిన తర్వాత సర్వే ఎక్స్ పైరీ డేట్, టైం, మల్టిపుల్ రెస్పాన్స్ లను అనుమతించడం, లాంటి సెట్టింగ్ లను కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక దీనిని ఏదైనా గ్రూప్ కు గానీ యూజర్ కు గానీ సెండ్ చేయాలి. రెస్పాన్స్ లను మీ ఫోన్ లో మీరు ట్రాక్ చేయవచ్చు.

చెక్ లిస్టు ఆప్షన్

యూజర్ లు మరియు గ్రూప్ లకు చేయవలసిన పనులను నిర్దేశించడానికి చెక్ లిస్టు ఆప్షన్ ఉపయోగపడుతుంది. చెక్ లిస్టు ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని టైటిల్ ఎంటర్ చేసి ఐటెం లను , అదనపు నోట్ లను యాడ్ చేసి యూజర్ లకు మరియు గ్రూప్ లకు పంపాలి. యూజర్ లు ఆ చెక్ లిస్టు ను చూసి రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాన్స్ కూడా మీకు కనపడుతుంది.

షేర్, రిక్వెస్ట్ లొకేషన్

వాస్తవానికి కైజాలా లో  మూడు రకాల లొకేషన్ యాక్షన్ లు ఉన్నాయి.అవి షేర్ లొకేషన్, రిక్వెస్ట్ లొకేషన్ మరియు లైవ్ లొకేషన్. షేర్ లొకేషన్ ద్వారా మీ లొకేషన్ ను గ్రూప్ మరియు యూజర్ లను షేర్ చేయవచ్చు. రిక్వెస్ట్ లొకేషన్ ద్వారా యూజర్ లు ఏ లొకేషన్ లో ఉన్నారో అడగవచ్చు. లైవ్ లొకేషన్ ద్వారా యూజర్ లు ఏ లొకేషన్ లో ఉన్నారో తెలుసుకోవడమే గాక నిర్దిష్ట సమయం లో వారిని ట్రాక్ చేసే వీలు కూడా ఉంటుంది.

సబ్మిట్ బిల్స్

మీ సంస్థ లేదా వ్యాపారం కోసం మీరు ఖరీదు చేసిన ఏదైనా వస్తువు యొక్క బిల్ ను మీరు యూజర్ లకు గానీ గ్రూప్ కు గానీ సబ్మిట్ చేసే ఆప్షన్ ను కూడా కైజాలా ఇస్తుంది. చాట్ స్క్రీన్ లో ఉండే సబ్మిట్ బిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ అమౌంట్, వ్యాపారి పేరు ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆ బిల్ లేదా ప్రోడక్ట్ ను ఒక ఫోటో ను తీసుకుని దీనిని అటాచ్ చేయాలి. ఆ తర్వాత సెండ్ చేయాలి. యూజర్ లు దీనికి రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాన్స్ లను కూడా మీరు చూడవచ్చు.

ముగింపు

టీం కమ్యూనికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ మైక్రో సాఫ్ట్ కైజాలా అత్యుత్తమమైన యాప్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది అందించే ఫీచర్ లు దీనిని విశిష్టంగా నిలిపాయి. అయితే ఇంకా చాలా మందికి ఈ కైజాలా యాప్ గురించి పూర్తి అవగాహన లేదు. ఈ నేపథ్యం లో మేము అందించిన ఈ ఆర్టికల్ మీకు సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాము.

జన రంజకమైన వార్తలు