వాట్సప్ ఓపెన్ చేయగానే మనకు కుప్పలు తెప్పలుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్తలు ఇలా వరదలా మన పోన్లో పడుతూనే ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్‌లలో అయితే ఈ న్యూస్ ఒక ప్రవాహంలాగే ఉంటుంది. పోస్ట్ చేసిందే మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తూ మనకు విసుగు తెప్పిస్తుంటారు కొందరు. ఆ విషయాన్ని పక్కనపెడితే ఈ వార్తల్లో ఏది వాస్తవమో ఏది నిజమైందో తెలుసుకోవడం మనకో పెద్ద పరీక్ష. చాలాసార్లు నిజమైన వార్తలకు కూడా మనం స్పదించలేని పరిస్థితి. మరి వాట్సప్‌లో వచ్చే ఈ ఫేక్ వార్తలను, స్కామ్స్‌ను పసిగట్టి మనల్ని అలెర్ట్ చేసే టెక్నాలజీ ఉంటే...!
ఫేక్ న్యూస్‌ని కనిపెట్టేందుకు...
వాట్సప్‌లో కుప్పలుగా వచ్చిపడే వార్తల్లో ఫేక్ న్యూస్ ఏదో కనిపెట్టడానికి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ స్కామ్‌లు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకించి కొన్ని సంస్థలకు స్కామ్‌లను కనిపెట్టి అలెర్ట్ చేసే పనిని అప్పగించారు. పాండా సెక్యూరిటీ లాంటివి ఇదే పనిలో ఉన్నాయి. కచ్చితంగా ఈ వార్త ఫేక్ అని తెలియగానే వెంటనే పోలీసులకు సమాచారం అందించడం.. వినియోగదారులను అలెర్ట్ చేయడం ఈ సంస్థ చేసే పనిలో భాగం. ఇదొక్కటే కాదు సైబర్ సెక్యూరిటీ సంస్థలు చాలా ఇదే పనిలో ఉన్నాయి. ఫేక్ స్కామ్‌లో కాదు జర్నలిజంలో ఉండే ఫేక్ న్యూస్‌లు కనిపెట్టి అది సర్వత్రా వ్యాప్తి చెందకుండా కౌంటర్ అటాక్ చేయడం వీటి ప్రత్యేకత.
ఫేక్ న్యూస్, స్కామ్స్ ఎలా కనిపెడతారంటే..
మీకు ఒక న్యూస్ వచ్చింది. అయితే అది నిజామో కాదో సందేహంగా ఉంది. వెంటనే మీరు చేయాల్సిన పని ఒక్కేటే. గూగుల్లోకి వెళ్లి ఆ న్యూస్‌ను పేస్ట్ చేయాలి. మొత్తం చేయకపోయినా కనీసం హెడ్లైన్ పేస్ట్ చేసి సెర్చ్ చేసినా సరిపోతుంది. అది నిజమైన వార్తే అయితే ప్రముఖ వార్త సంస్థలు కచ్చితంగా ప్రచురిస్తాయి. ఒకవేళ గూగుల్‌లో ఎక్కడా ఆ సమాచారం దొరకపోతే అది పక్కా ఫేక్ వార్తే.
ఆడియో ఫార్మాట్లో ఉంటే...
ఒక్కోసారి మనకు ఆడియో రూపంలో కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. ఇవి కూడా చాలా ఫేక్ ఉంటాయి. ఎవరు ఈ సమాచారాన్ని పంపారో మనకు తెలియదు. ఈ ఆడియోను కూడా మీరు ట్రాక్ చేయచ్చు. ఆ కంటెంట్ ఇష్యు చేసిన వారెవరో తెలుసుకోవచ్చు. అయితే మీకు అదెవరు సెండ్ చేశారో కచ్చితంగా తెలిస్తే వారిని నేరుగా ప్రశ్నించొచ్చు.
సోర్సులను పరీక్షించాలి
కొన్నిసార్లు వార్తలు లింక్‌ల రూపంలో వస్తాయి. దీన్ని క్లిక్ చేయకుండా యూఆర్ఎల్ని వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేసి సోర్స్ ఎక్కడిదో కనుక్కునే అవకాశం ఉంది. హెచ్‌టీటీపీఎస్ అని లేకుండా వచ్చే ఏ సైట్‌ను ఓపెన్ చేయకూడదు. అలా చేస్తే రామన్సన్వేర్ లాంటి ప్రమాదకర వైరస్లు మీ కంప్యూటర్ మీద దాడి చేసే అవకాశాలున్నాయి.
ఆథర్ ఐడెంటిటీ చెక్ చేయాలి
మనకు ఏమైనా మెసేజ్‌లు వస్తే వాటిని నిశితంగా పరిశీలించాలి. ఆథర్ ఎవరో చూడాలి. అతను లేదా ఆమె ఐడెంటిటీని పరిశీలించాలి. చాలా వరకు న్యూస్‌లలో ఆథర్ పేరు ఉండదు. ఎవరు రాశారో ఏ సైట్ నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఇలాంటి న్యూస్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ మీడియా ద్వారానే సహజంగా ఇలాంటి లింక్‌లు వస్తుంటాయి. కానీ హ్యాకర్లు వీటిని యూజ్ చేసుకునే అవకాశాలున్నాయి.