• తాజా వార్తలు

మీ ఫోన్ లో రెండు వాట్సప్ లు, రెండు ఫేస్ బుక్ లు వాడొచ్చు తెలుసా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /


వాట్స్ యాప్, ఫేస్ బుక్ చూడకుండా ఒక్క రోజు గంట కూడా గడవని రోజులివి. కొందరికైతే రెండేసి వాట్స్ యాప్ అకౌంట్లు, ఫేస్ బుక్ ఖాతాలు కూడా ఉంటున్నాయి. అయితే.... ఒకే స్మార్టు ఫోన్లలో రెండేసి వాట్సాప్, ఫేస్ బుక్ ఖాతాలు తెరవడం సాధ్యమేనా? కొత్తగా వస్తున్న కొన్ని ఫోన్లలో సాధ్యమవుతున్న ఈ అవకాశం మీ ఫాత స్మార్టు ఫోన్లలోనూ సాధ్యం చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి. కేవలం ఫేస్ బుక్, వాట్సాప్ మాత్రమే కాకుండా జీమెయిల్ ఇతర సర్వీసులనూ ఇలాగే డబుల్ అకౌంట్లు మెంటైన్ చేయొచ్చు. అందుకు కావాల్సిందంతా కొన్ని యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోవడమే.
Parallel Space వాట్సప్, ఫేస్ బుక్ లు మాత్రమే కాకుండా జీమెయిల్, మెస్సెంజర్ సహా దాదాపు అన్ని రకాల యాప్ లు, గేమ్ లను కూడా అదనంగా వినియోగించుకోవడానికి ప్యారలల్ స్పేస్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని గూగుల్ ప్లేస్టోర్ లో Parallel Space అని టైప్ చేసి, సెర్చ్ చేసి.. ఇన్ స్టాల్ చేసుకోవాలి. పారలల్ స్పేస్ యాప్ ను ఓపెన్ చేశాక అందులో కొన్ని యాప్ ల షార్ట్ కట్ లు ముందే లోడ్ అయి ఉంటాయి. వాటిపై టాప్ చేయగానే... మన ఫోన్ లో అప్పటికే ఇన్ స్టాల్ అయి ఉన్న ప్రధాన యాప్ ను క్లోన్ (అదే యాప్ ను మరో యాప్ గా తయారు) చేసుకుంటుంది. ముందే లోడ్ అయి ఉన్న వాటిలో మనకు కావాల్సిన యాప్ లేకుంటే.. కింద ఉండే యాడ్ ఆప్షన్ ద్వారా మన ఫోన్ లో అప్పటికే ఉన్న యాప్ లను క్లోన్ చేసుకోవచ్చు.
ఇలా క్లోన్ చేసుకున్న యాప్ ను ఓపెన్ చేసుకుంటే.. ఫ్రెష్ గా, అప్పుడే ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ లాగా ఓపెన్ అవుతుంది. దానిలో మనకు కావాల్సిన విధంగా వివరాలు ఎంటర్ చేసి.. వినియోగించుకోవచ్చు. ప్యారలల్ స్పేస్ యాప్ ఉచితమే.
Parallel Accounts
ఇది కూడా ఇతర క్లోనింగ్ యాప్స్ తరహాలోనే పనిచేస్తుంది. అయితే ఇది వర్చువల్ గా కాకుండా నేరుగా యాప్ ను కాపీ చేసుకుంటుంది. ఈ క్లోనింగ్ యాప్ లో వర్చువల్ గా ఇన్ స్టాల్ చేసుకున్న ఇతర యాప్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోల వంటి సమాచారం ప్రత్యేకంగా ఇతర ఫోల్డర్లలో సేవ్ అవుతుంది. ఇవి కొన్ని సార్లు గ్యాలరీలో కనిపించకపోవచ్చు కూడా.
Go Multiple - parallel space
ఇది కూడా ప్యారలల్ స్పేస్ తరహాలో అన్ని రకాల యాప్ లను క్లోన్ చేసుకుని, వినియోగించుకునేందుకు పనికివచ్చే యాప్. సోషల్ మీడియా అకౌంట్లతో పాటు గేమ్ లనూ ఇది సపోర్ట్ చేస్తుంది. ప్లేస్టోర్లో దీనికి రేటింగ్, రివ్యూలు బాగున్నా ఇది కాస్త స్లోగా ఉంటుందని యూజర్లు చెబుతున్నారు.
ఇంకా ఏమేం ఉన్నాయి..
ఇవే కాకుండా Multiple Accounts, Parallel.ly, 2space, Clone master పేర్లతో ఎన్నో క్లోనింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని ఫోన్లలో ఇన్ బిల్ట్ గా...
ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని మోడళ్ల స్మార్ట్ ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టంలోనే ఇన్ బిల్ట్ గా యాప్ క్లోనింగ్ ఆప్షన్ ఉంటోంది. ఆయా కంపెనీల ఫోన్లను బట్టి ఫోన్ మేనేజర్ లోనో, సెట్టింగ్స్ లోనో ఈ క్లోనింగ్ ఆప్షన్ ను అందజేస్తున్నారు. ఆ ఆప్షన్ లోకి వెళ్లిన తర్వాత మన ఫోన్లో అప్పటికే ఇన్ స్టాల్ చేసి ఉన్న ఏదైనా యాప్ ను ఎంచుకుని.. క్లోన్ చేసుకోవచ్చు. తద్వారా రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. ఇలా ఫోన్లలో వచ్చే క్లోనింగ్ ఆప్షన్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ల తరహాలో అడ్వర్టైజ్ మెంట్లు ఉండవు. వేగంగా కూడా పనిచేస్తాయి. నోటిఫికేషన్లు, అప్ డేట్లు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాయి. బ్యాటరీ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రెడ్ మీ ఫోన్లలో సెకండ్ స్పేస్ పేరుతో ఇలా రెండేసి ఖాతాలు వాడుకునే వీలుంటుంది.
ఇబ్బందులున్నాయా...?
* ఫోన్ స్లో అయే అవకాశం ఉంటుంది.
* నోటిఫికేషన్లు రావడం, అప్ డేట్లు వంటి అంశాల్లోనూ ఇబ్బందులు, గందరగోళం తలెత్తే అవకాశం ఉంది.
* ఎక్కువ సంఖ్యలో క్లోనింగ్ యాప్ లు, ఇతర యాప్ లతో బ్యాటరీ తొందరగా చార్జింగ్ దిగిపోతుంది.
ఇది బెటర్
* అందువల్ల 1.5 గిగాహెడ్జ్ ఆపైన సామర్థ్యమున్న ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ కంటే ఎక్కువగా ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఇలా వినియోగించుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు