• తాజా వార్తలు
  •  

ఇండియన్స్ దెబ్బ రుచి చూసిన స్నాప్ చాట్

రెండేళ్ల కిందట స్నాప్ చాట్ సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడడం ఆ సంస్థను దారుణంగా దెబ్బతీస్తోంది. దురహంకారపూరితంగా భారత్ పట్ల చిన్నచూపుతో చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ మాజీ ఉద్యోగి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ విషయం వెల్లడి కాగానే భారతీయుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫలితంగా స్నాప్‌చాట్‌ రేటింగ్‌ ఒక్క రోజులోనే భారీగా పడిపోయింది.
అన్ ఇన్ స్టాల్ ఉద్యమం..
2015లో జరిగిన ఒక సమావేశంలో స్పైగల్‌ మాట్లాడుతూ.. స్నాప్‌ చాట్‌ భారత్‌, స్పెయిన్‌ వంటి పేదదేశాల్లో విస్తరించాలనుకోవటంలేదని.. ప్రీమియం కస్టమర్లపైనే దృష్టిపెడతామని చెప్పుకొచ్చారు. వెరైటీ మీడియా అనే సంస్థ వీటిని బయటపెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆ యాప్ ను ఇప్పటికే అన్ ఇన్ స్టాల్ చేసేశారు. అంతేకాదు.... భారతీయులంతా ఆ యాప్ ను తమ ఫోన్ల నుంచి అన్ ఇన్ స్టాల్ చేసి స్పైగల్‌ను పేదవాడిగా మార్చాలంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో స్నాప్‌ చాట్‌ రేటింగ్‌ ఒక్కరోజులోనే తగ్గిపోయింది. నిన్నటి వరకూ 4.4 రేటింగ్‌ ఉన్న ఈ యాప్‌ రేటింగ్ ఇప్పుడు 4 కంటే తగ్గిపోయింది. ఒక దశలో ఏకంగా 3.6కు చేరింది. అయితే.. స్నాప్ చాట్ నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు పాజిటివ్ రేటింగ్ కోసం కొన్ని ప్రయత్నాలు చేయడంతో మళ్లీ 4కి సమీపంగా వచ్చింది.
ప్లేస్టోర్ రేటింగ్ పతనం
మరోవైపు స్టార్ రేటింగ్ లో సింగిల్ స్టార్ రేటింగ్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో స్నాప్ చాట్ పై దుష్ప్రభావం మొదలైంది. ప్లేస్టోర్‌లో రివ్యూల్లో భారతీయులు ఏకి పడే్స్తున్నారు. సింగిల్ స్టార్ రేటింగ్ ఒక్కసారిగా 2 లక్షల వరకు చేరింది. దీంతో డౌన్లోడ్లు గణనీయంగా తగ్గిపోయాయి.
ఏది నిజం?
మరోవైపు స్పైగల్‌ను స్నాప్ చాట్ వెనకేసుకొచ్చింది. ఆయన అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని.. ఆంటోనీ పాంప్లియానీ ఒక అసంతృప్త మాజీ ఉద్యోగి అల్లిన కట్టుకథ అని స్నాప్ చాట్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు చేసిన ఉద్యోగి పనితీరు సరిగా లేకపోవడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించామని.. అందుకే ఆయన అలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతోంది.