• తాజా వార్తలు
  •  

అంతా స్మార్టుమయం

ల‌క్ట్రిక‌ల్ మినీ వేన్‌, మ‌న శ‌రీర క‌ద‌లిక‌ల‌కు త‌గిన‌ట్టు ఆకృతిని మార్చుకుంటూ.. గుర‌క పెడితే హెచ్చ‌రిస్తూ.. అవ‌స‌ర‌మైతే కాళ్ల‌కు మ‌సాజ్ చేస్తూ సుఖ‌నిద్ర‌ను ద‌రిచేర్చే స్మార్ట్ ప‌రుపు,  వాయిస్ క‌మాండ్స్‌తో ప‌నులు చ‌క్క‌బెట్టే రోబోలు.. ఇలా ఒక్కోటి ఒక్కో వినూత్న ఆవిష్క‌ర‌ణ‌. అన్నింటికీ టెక్నాల‌జీయే ఆధారం. ప్ర‌తిదీ స్మార్ట్ ప‌ద్ధ‌తిలోనే ప‌ని చేయ‌డం. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్స్యూమ‌ర్ ఎలక్ట్రానిక్ షో 2017లో ప్ర‌తిదీ ఒక వింతే.  సాంకేతిక‌త స‌రిజోడుగా మ‌న‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు అందించ‌డానికి ముందుకొచ్చిన అలాంటి ఆవిష్క‌ర‌ణ‌లో మెచ్చుతున‌క‌లు కొన్నింటిని చూడండి..  

1)బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ బీఈవీ
కార్ల‌లో ఎస్‌యూవీలు, ఎంవీయూలు  చూశాం.  ఈ బీఈవీ ఏంట‌నుకుంటున్నారా.. బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌. అదీ రెండు సీట్ల‌దో, నాలుగు సీట్ల‌దో కాదండోయ్‌. ఏకంగా ఆరు సీట్ల మినీ వ్యాన్‌.  ప్ర‌స్తుతం ఆరు, ఏడు సీట్లున్న పెద్ద కార్ల‌కు ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ట‌యోటా ఇన్నోవా,  మారుతీ  ఎర్టిగా, మ‌హీంద్రా జైలో వంటివ‌న్నీ ఇలా ఎక్కువ సీట్ల‌తో వ‌చ్చి రాజ్య‌మేలుతున్నాయి. దీంతో  ఫియ‌ట్ క్రిస్ల‌ర్ ఆటోమొబైల్స్ కంపెనీ ఆరు సీట్లు ఉన్న ఎల‌క్ట్రిక్ మినీ వ్యాన్‌ను రూపొందించింది. అమెరికాలోని లాస్‌వెగాస్ లో జ‌రుగుతున్న క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో ఇది సంద‌ర్శ‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.
 క్రి స్ల‌ర్ పోర్టల్ అని పేరు పెట్టిన ఈ ఎల‌క్ట్రిక్ మినీ వ్యాన్.. సిక్స్ సీట‌ర్‌.  మొత్తం బ్యాట‌రీతోనే న‌డిచే ఈ వాహ‌నానికి బోల్డ‌న్ని ప్ర‌త్యేకత‌లున్నాయి.
మిల్లీనియ‌ల్స్ ( అమెరికాలో ఉన్న 20 నుంచి 36 ఏళ్ల లోపు యువ‌త‌)ను ఆక‌ట్టుకునేందుకు తాము ఈ ఎల‌క్ట్రిక్ మినీ వ్యాన్‌ను రూపొందించామ‌ని  ఈ వాహ‌న రూప‌క‌ర్త‌ల్లో ఒక‌రైన ఆష్లే ఎడ్గ‌ర్ చెప్పారు. 2016 నాటికి అమెరికా జ‌నాభాలో మిల్లీనియ‌ల్స్ వాటానే ఎక్కువ‌. దాదాపు ఏడున్న‌ర కోట్ల మంది యువ జ‌నాభాను ఆక‌ట్టుకుని అమ్మ‌కాలు పెంచుకునే ల‌క్ష్యంతో  ఈ బ్యాట‌రీ వ్యాన్‌ను త‌యారు చేశారు. 
ఇవీ ప్ర‌త్యేక‌తలు
* మొత్తం ఆరు సీట్లు. వీటిని ఎలాగైనా ఎడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు. కావాలంటే కొన్ని సీట్లు రిమూవ్ చేసుకోవ‌చ్చు కూడా. 
*  స్టీరింగ్‌కు బ‌దులు ఎల‌క్ట్రానిక్ డివైస్ ఉంటుంది.   హైవేల మీద వెళ్లిన‌ప్పుడు కారు దానిక‌దే నడిచేలా దీనితో నియంత్రించ‌వ‌చ్చు. 
* మొబైల్ ఛార్జింగ్‌కు ప్లే స్టేష‌న్ వంటి వాటికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు కారు నిండా పుష్క‌లంగా ఉన్నాయి.
* డోర్లు, టాప్ కూడా చాలా వ‌ర‌కు గ్లాస్‌తోనే ఉండ‌డంతో చూడ్డానికి చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తుంది. గ్లాస్‌కు స‌పోర్ట్‌గా కార్బ‌న్ ఫైబ‌ర్ వినియోగించారు.
* ఈ కారు మొత్తం బ్యాట‌రీతో న‌డుస్తుంది.  ఒక్క‌సారి పూర్తిగా ఛార్జి చేస్తే 250 మైళ్లు (402 కిలోమీట‌ర్లు) ప్ర‌యాణించ‌వ‌చ్చు. 
* 20 నిముషాలు ఛార్జింగ్ చేస్తే 150 మైళ్లు ప్ర‌యాణించ‌వ‌చ్చు. 
* బ్యాట‌రీ ఛార్జింగ్ పోర్ట్ బానెట్ ద‌గ్గ‌రే ఉండ‌డంతో ఛార్జింగ్ చేసుకోవ‌డం కూడా సులువు.
 
2) గేమింగ్ ప్రియుల‌కు పండ‌గే 
గేమింగ్ స్పీడ్‌కు త‌గ్గ‌ట్లు కంప్యూట‌ర్ మానిట‌ర్ లేద‌ని, 20, 22 అంగుళాల  స్క్రీన్ల‌పై గేమింగ్ అనుభూతి పొంద‌లేక‌పోతున్నామ‌ని బాధ‌ప‌డుతున్న వారుంటే ఇక‌పై దాన్నిమ‌రిచిపోవ‌చ్చు. రేజ‌ర్ కంపెనీ ఏకంగా మూడు తెర‌ల‌తో కూడిన గేమింగ్ లాప్‌టాప్‌ను ప్ర‌వేశ‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది.  గేమింగ్ కంప్యూట‌ర్ల త‌యారీ సంస్థ రేజ‌ర్ క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో ఈ మూడు తెర‌ల లాప్‌టాప్‌ను ప్ర‌ద‌ర్శించింది. ప్రాజెక్టు వ‌లేరీ అని పేరు పెట్టిన ఈ మూడు స్క్రీన్ల  గేమింగ్ లాప్‌టాప్ ప్రపంచంలోనే మొట్ట‌మొద‌టిది అని కంపెనీ ప్ర‌క‌టించింది. మామూలుగా ఉన్న‌ప్పుడు ఇది ఒక స్క్రీన్ తోనే ఉంటుంది. అవ‌స‌ర‌మైతే ఆటోమేటిక్ ప‌ద్ధ‌తిలో మ‌ధ్య స్క్రీన్ పక్క నుంచి రెండు వైపుల‌కు రెండు స్క్రీన్లు వ‌స్తాయి. ఈ మొత్తం స్క్రీన్ల‌ను క‌లిపి ఒక‌టే మానిట‌ర్ లా వాడుకోవ‌చ్చు. అన్ని స్క్రీన్లు ఒకే లాంటి రిజ‌ల్యూష‌న్ క‌లిగి ఉంటాయి. అన్నీ 17 అంగుళాల (43 సెం.మీ.) వెడ‌ల్పు ఉన్న‌వే.
మానిటర్ల‌న్నీ లోప‌లికి మ‌డిచి ఉంచిన‌ప్పుడు ఈ లాప్‌టాప్ 1.5 అంగుళాల మందంతో ఉంటుంది.  గ్రాఫిక్ డిజైన్‌, ఆర్కిటెక్చ‌ర‌ల్ కంపెనీలు కూడా ఈ లాప్‌టాప్‌పై ఆస‌క్తి  చూపిస్తున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.
ప్ర‌స్తుతానికి ప్ర‌యోగాత్మ‌కంగానే దీన్ని ప్ర‌వేశ‌పెట్టారు.  పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఎప్పుడు ప్ర‌వేశ‌పెడ‌తారు, ధ‌ర ఎంత ఉంటుంద‌నే అంశాల‌ను  కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు. 
 
3) కొత్త రోబో.. క్యూరీ 
బాష్ కంపెనీ స‌హాయంతో మేఫీల్డ్  రోబోటిక్స్ అనే స్టార్ట‌ప్ కంపెనీ రూపొందించిన క్యూరీ అనే చిట్టి రోబో షోలో చూప‌రుల‌ను క‌ట్టిప‌డేసింది.  దీనిలో వైఫై, బ్లూటూత్‌, కెమెరా ఉన్నాయి.  క్యూరీ త‌న‌కున్న చ‌క్రాల‌తో ఇల్లంతా క‌లియ‌తిరుగుతుంది.  మీరు ఇంట్లో లేన‌ప్పుడు  చిన్న‌పిల్ల‌లు, పెంపుడు జంతువులు ఎలా ఉంటున్నాయో  కెమెరాతో రికార్డు చేస్తుంది.   మీరు ఏ స‌మ‌యానికి ఏ ప‌ని చేయాలో రిమైండ‌ర్లో సెట్ చేస్తే ఆ స‌మ‌యానికి   అలెర్ట్ చేస్తుంది. ఇన్ బిల్ట్  వైఫై క‌నెక్ష‌న్‌ను ఉప‌యోగించుకుని వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో తెలియ‌జెబుతుంది. 
మ్యూజిక్ వినిపిస్తుంది. క‌థ‌లు చెబుతుంది.  ఈ రోబో ఛాతీ భాగంలో ఉండే ఎల్ఈడీ లైట్ల ద్వారా క్యూరీ త‌న రంగుల‌ను కూడా మార్చుకోగ‌లుగుతుంది.  కొత్త‌గా వ‌స్తున్న స్మార్ట్‌హోంల‌కు స‌రిపోయే  ఫీచ‌ర్స్‌తో. ఐఎఫ్‌టీటీటీతో కూడా  ప‌ని చేసేలా ఈ రోబోను తీర్చిదిద్దారు.   ముఖాల‌ను కూడా గుర్తించి  ప్ర‌తిస్పందించ‌గ‌ల‌గ‌డం క్యూరీ ప్రత్యేక‌త‌.   ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌తో ప‌ని చేసే క్యూరీ కేవ‌లం 20 అంగుళాల పొడ‌వే ఉంటుంది. వాయిస్ క‌మాండ్స్ విన‌డానికి దీనిలో నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.  డిసెంబ‌ర్ నాటికి దీన్ని మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ధ‌ర దాదాపు 48 వేల రూపాయ‌లు ఉండవ‌చ్చు.
 
4) లీ ఎకో స్మార్ట్ బైక్ 
సైక్లింగ్‌ను ఇష్ట‌ప‌డేవారికి దాన్ని మ‌రింత అనుభూతిగా మిగిల్చేందుకు లీఎకో కొత్త టెక్నాల‌జీ బేస్డ్ సైకిల్‌ను అందుబాటులోకి తెస్తోంది. హ్యాండిల్ బార్‌పైన ఆండ్రాయిడ్ తో ప‌ని చేసే నాలుగు అంగుళాల టచ్ స్క్రీన్ దీని ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌, నావిగేష‌న్‌కు, రోడ్ ఎలా ఉందో చెప్ప‌డానికి ఈ  ఏర్పాటు. దీంతో ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ మ్యూజిక్ ప్లే బాక్‌, సైక్లింగ్ చేస్తూనే ద‌గ్గ‌ర‌లో ఉన్న స్మార్ట్ బైక్‌ల వారితో మాట్లాడుకునేందుకు వాకీ- టాకీ ఈ స్మార్ట్ బైక్ లో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు.  ఆండ్రాయిడ్ 6తో న‌డిచే ఈ సైకిల్‌కు ఉండే 4 అంగుళాల ట‌చ్‌స్క్రీన్ 6000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌తో ప‌ని చేస్తుంది. జీపీఎస్‌, కంపాస్‌, యాక్సిల‌రోమీట‌ర్‌, బారోమీట‌ర్‌, లైట్ లెవెల్‌, వీల్ స్పీడ్‌, క్రాంక్ స్పీడ్ చెప్పే సెన్స‌ర్లున్నాయి.  ఫిట్‌నెస్‌ప‌రంగా చూస్తే మీ హార్ట్‌బీట్ రూట్ వంటివి చెప్పే ప‌వ‌ర్ సెన్స‌ర్లు కూడా అమ‌ర్చే వీలుంది. మీ రైడ్ ఎలా సాగిందో షేర్ చేసుకునేందుకు కంపేనియ‌న్ యాప్‌ను కూడా అమ‌ర్చారు.  ఏప్రిల్ త‌ర్వాత అమెరికా మార్కెట్లోకి ఈ సైకిల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంచ‌నా. 
 
5) స్లీప్ నెంబ‌ర్ 360 - స్మార్ట్ ప‌రుపు
సాంకేతిక‌త‌ను జోడించి సుఖ నిద్ర‌ను మీ వ‌శం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా రూపొందించిన స్మార్ట్ బెడ్ - స్లీప్ నెంబ‌ర్ 360.  ఈ ప‌రుపు కొనుక్కుంటే చాలు మీ నిద్ర తాలూకా స‌మ‌స్య‌ల‌న్నీ తీరిన‌ట్టేన‌ని కంపెనీ చెబుతోంది. దీనిపైన ప‌డుకుంటే మ‌న శరీరాకృతికి త‌గ్గ‌ట్టు ప‌రుపు దానంత‌ట‌దే అడ్జ‌స్ట్ అవుతుంది. నిద్ర‌లో మ‌నం ఎటు తిరిగితే అటు అడ్జ‌స్ట్ అవుతుంది.  భాగ‌స్వామి గుర‌క‌తో నిద్ర దూర‌మ‌య్యేవారికి కూడా ఈ ప‌రుపు మంచి మందు. గుర‌క పెడితే ఆ వ్య‌క్తి త‌ల వైపు ప‌రుపు ఆటోమేటిక్‌గా పైకి లేచి అత‌ణ్ని నిద్ర‌లేపుతుంది. దీంతో గుర‌క పెట్ట‌డం త‌గ్గుతుంది.  ప‌రుపుకు  రెండు వైపులా హీటింగ్ సెన్స‌ర్లున్నాయి. దీంతో మీ కాళ్ల‌కు  ప‌రుపే జెంటిల్ మ‌సాజ్ చేస్తుంది.  అల‌సిన శ‌రీరానికి సుఖంగా నిద్ర ప‌ట్ట‌డానికి ఇది స‌హ‌క‌రిస్తుంది.  రాత్రి స‌మ‌యంలో  నిద్ర లేచి మంచం దిగితే పరుపు కింద ఉండే లైట్లు ఆటోమేటిగ్గా వెలుగుతాయి. మీరు తిరిగివ‌చ్చి ప‌డుకోగానే లైట్లు ఆటోమేటిగ్గా ఆఫ్ అవుతాయి. ఉద‌యం లేవ‌గానే మీ నిద్ర క్వాలిటీ ఎలా ఉంది.. ఎన్ని గంట‌లు నిద్ర‌పోయారు వంటి వివ‌రాల‌న్నీ చెప్పే యాప్‌ను కూడా ఇన్ స్టాల్ చేసుకోవ‌చ్చు.  జూన్ త‌ర్వాత అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్న ఈ స్మార్ట్ ప‌రుపు ధ‌ర ఎంత‌నేది ఇంకా నిర్ధ‌రించ‌లేదు.

జన రంజకమైన వార్తలు