• తాజా వార్తలు
  •  

కొత్త ఆలోచ‌న‌లు.. స‌రికొత్త గ్యాడ్జెట్లు..

ప్రపంచవ్యాప్తంగా  టెక్ ప్రియులంతా ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూసిన రోజు వ‌చ్చేసింది.  అంతర్జాతీయ టెక్ పండగ కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో-2017 (సీఈఎస్-2017) అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలోబుధ‌వారం అంగ‌రంగ వైభవంగా ప్రారంభ‌మైంది. సోనీ, శ్యాంసంగ్‌, ఎల్‌జీ, లెనోవో లాంటి ఎలక్ట్రానిక్ దిగ్గ‌జాల‌తోపాటు చిన్న చిన్న కంపెనీలు త‌మ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్ధుల‌ను చేసేస్తున్నాయి.  వీఆర్ హెడ్‌సెట్లు,  బుల్లిబుల్లి రోబోలు, డిష్ టీవీలు, ఫిటెనెస్‌ను, హెల్త్ అవేర్‌నెస్‌ను చెప్పేసే ఉంగ‌రాలు ఇలా ర‌క‌ర‌కాల గ్యాడ్జెట్లు ప్ర‌ద‌ర్శ‌న తొలిరోజే టెక్ ప్రియుల‌ను మురిపించేశాయి. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా ఫీచ‌ర్లు కూడా అలాగే అదిరిపోతున్నాయి. ఇవి మార్కెట్ల‌లోకి వ‌చ్చిన త‌ర్వాత పోటీదారులు కూడా రంగంలోకి వ‌స్తారు కాబ‌ట్టి ధ‌ర త‌గ్గే అవ‌కాశం ఉంది.  మ‌రోవైపు షోలో మిగిలిన రోజులు ఇంకెలాంటి కొత్త ఎలక్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాలు చూడ‌బోతున్నామో అని టెక్ ల‌వ‌ర్స్ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

హెల్త్ గాడ్జెట్లు.. ఫిట్ నెస్, వెల్ నెస్ గ్యాడ్జెట్లు. మొబైల్స్  యాక్సెసరీస్ తొలిరోజే ప్ర‌ద‌ర్శ‌న‌లో హ‌డావుడి చేశాయి. స్మార్ట్ హోం కాన్సెప్ట్‌తో వ‌స్తున్న గ్యాడ్జెట్ల‌కు కంపెనీలు చాలా ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు  క‌నిపించింది.  ఇంకా సెట్‌టాప్ బాక్సులు, ఛార్జ‌ర్లు, వీఆర్ హెడ్‌సెట్లు వంటివి  షో మొద‌టి రోజున మెరిశాయి. వాటిలో  కొన్నిగ్యాడ్జెట్లు ఇవీ..

1) లెనోవో వీఆర్ హెడ్‌సెట్‌

గత ఏడాది ఈ ప్రదర్శనలో ఎక్కువగా వీఆర్ గేర్లను ప్రదర్శించారు.  ఈసారీ అదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ లెనోవో వీఆర్ హెడ్‌సెట్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు తెచ్చింది.  విండోస్ 10తో అనుసంధాన‌మై ఉన్న ఈ హై క్వాలిటీ వీఆర్ హెడ్‌సెట్‌కు రెండు డెప్త్ సెన్సింగ్ వీజీఏ కెమెరాలు ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.  అందువల్ల రూమ్ స్కేలింగ్ కోసం దీనికి అద‌న‌పు సెన్స‌ర్లు అవ‌స‌రం లేదు. క‌ళ్ల‌ద్దాలు ఉన్న‌కూడా ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవ‌చ్చు. మొత్తంగా ఇది నేటి వీఆర్ హెడ్‌సెట్ అని లెనోవో ధీమాగా చెబుతోంది.
ధ‌ర అంచ‌నా: 300 నుంచి 400 డాల‌ర్లు  ( 20 వేల నుంచి 27 వేల రూపాయ‌ల వ‌ర‌కు)
ఎప్పుడొస్తుంది: ఈ ఏడాది మ‌ధ్య‌లో..

2) లెనోవో స్మార్ట్ అసిస్టెంట్‌

లెనోవో మ‌రో స్మార్ట్ గృహోప‌క‌ర‌ణాన్ని కూడా ప్ర‌ద‌ర్శించింది.  స్మార్ట్ అసిస్టెంట్‌గా పిలిచే ఈ  గ్యాడ్జెట్ మ‌న వాయిస్ క‌మాండ్స్ ఆధారంగా పని చేస్తుంది. లైట్లు ఆఫ్ చేయ‌డం, మ్యూజిక్ ప్లే చేయ‌డం, చేయాల్సిన ప‌నుల జాబితా త‌యారు చేయ‌డం వంటి ప‌నులు చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఇప్ప‌టికే స్మార్ట్ హోం మార్కెట్‌లో ఉన్న అమెజాన్ ఎకో, గూగుల్ హోంల‌కు మ‌రిన్ని హౌస్‌హోల్డ్ హ‌బ్‌ల‌ను యాడ్ చేయ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది. లెనోవో స్మార్ట్ అసిస్టెంట్‌లో మీ వాయిస్ క‌మాండ్స్ విన‌డానికి 8 మైక్రోఫోన్లు ఉంటాయి. ఇంట్లో ఏ మూల దీన్ని ఉంచినా క‌మాండ్స్ విన‌డానికి  దీనిలో హ‌ర్మాన్ కార్డ‌న్ స్పీక‌ర్స్ అమ‌ర్చిన‌ట్టు  కంపెనీ చెప్పింది. దీంతోపాటు స్టాండ‌ర్డ్ మోడ‌ల్ కూడా అందుబాటులో ఉంటుంది.
ధ‌ర అంచ‌నా:  స్టాండ‌ర్ట్  మోడ‌ల్ 130 డాల‌ర్లు (8,800 రూపాయ‌లు) 180 డాల‌ర్లు  (12 వేల రూపాయ‌లకు పైగా)
ఎప్పుడొస్తుంది: ఈ ఏడాది మే లో

3)మియో స్లైస్ ఫిట్‌నెస్ ట్రాక‌ర్

హార్ట్‌రేట్ టెక్నాల‌జీ కంపెనీ మియో..  రిస్ట్ బాండ్ గా ధ‌రించ‌గ‌లిగే ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌ను ఈ షోలో ప్ర‌ద‌ర్శించింది. స్లైస్ అని పిలిచే ఈ  ఫిట్‌నెస్ ట్రాకింగ్ డివైస్ ప‌ర్స‌న‌ల్ యాక్టివిటీ ఇంటిలిజెన్స్ సిస్టం ద్వారా మీ ఫిట్‌నెస్ స్థాయిని ఎప్ప‌టిక‌ప్పుడు మీకు తెలియ‌జేస్తుంది.  మీరు వ్యాయామం చేస్తున్న‌ప్పుడు,  ఏదైనా యాక్టివిటీలో ఉన్న‌ప్పుడు  లేదా నిద్ర‌పోతున్న‌ప్పుడు మీ శ‌రీరం ప్‌ితిస్పందిస్తున్న తీరును 0 నుంచి 100 పాయింట్ల‌లో లెక్కించి మీకు చూపిస్తుంది. మీ యాక్టివిటీ మిమ్మ‌ల్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుతుందో చెప్ప‌డానికి ఇది బాగా ఉప‌క‌రిస్తుంద‌ని మియో చెబుతోంది.
ధ‌ర అంచ‌నా:  129 డాల‌ర్లు (8,740 రూపాయ‌లు)
ఎప్పుడొస్తుంది: ఈ ఏడాది మే లో

4)డీ లింక్ క‌వ‌ర్‌

వైఫై రూట‌ర్ల‌లో బాగా పేరున్న డీ- లింక్ కంపెనీ ఇంటి మొత్తానికి వైఫై సిగ్న‌ల్స్ అందించేలా సరికొత్త రూట‌ర్‌ను రూపొందించింది.  క‌వ‌ర్ అని దీనికి పేరు పెట్టింది. ఇల్లు లేదా ఆఫీసులో ఎక్కువ ఏరియాలో వైఫై సిగ్న‌ల్స్ అందించేందుకు దీనిలో మెష్ నెట్‌వ‌ర్క్‌ను వాడిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.  రూట‌ర్ దానితోపాటు ఎక్స్‌టెండ‌ర్‌తో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సిగ్న‌ల్స్ అందిపుచ్చుకోవ‌చ్చు.
ధ‌ర అంచ‌నా:  దాదాపు 20 వేల రూపాయ‌లు
ఎప్పుడొస్తుంది: ఏప్రిల్ త‌ర్వాత

5) స్టైలిష్ కీ ట్రాక‌ర్ .. విస్టికీ ఎహా

కారు, బైక్ తాళాలు ఎక్క‌డ పెట్టేశారో గుర్తు రావ‌డం లేదా.. సెల్‌ఫోన్ ఎక్క‌డో పెట్టామ‌ని గుర్తుంది.. కానీ ఎక్క‌డుందో జ్ఞ‌ప్తికి రావ‌డం లేదా? ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకే ఫిలిప్పే కంపెనీ ఓ కీ ట్రాక‌ర్‌ను త‌యారు చేసింది. ఈ స్టైలిష్ కీ ట్రాక‌ర్ పేరు విస్టికీ ఎహా. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ రెండు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ప‌ని చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. 320 అడుగుల దూరంలో ఉన్న తాళాలు, సెల్‌ఫోన్లు వంటివాటిని ఇది గుర్తించ‌గ‌ల‌దు. ఓవ‌ల్ షేప్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ఈ కీ ట్రాక‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.
ధ‌ర ఎంతుండొచ్చు:  2,700 రూపాయ‌లు

6) అతి ప‌లుచని ఫోన్ ఛార్జ‌ర్‌.. కాడో

కాడో కంపెనీ అత్యంత ప‌లుచ‌నైన సెల్‌ఫోన్ ఛార్జ‌ర్‌తో షోలో ఆక‌ట్ట‌కుంది. ఈ ఛార్జ‌ర్ ఎంత ప‌లుచ‌గా ఉంటుందంటే దీన్ని మీరు ప‌ర్స్‌లో పెట్టుకుని వెళ్లిపోవ‌చ్చు. దీని మందం 0.2 అంగుళాలు మాత్ర‌మే. ఆండ్రాయిడ్ డివైజ‌స్‌కి, ఐఫోన్ల‌కు కూడా ఛార్జి చేసుకోవ‌చ్చు. దీనిలో లాప్‌టాప్ ఛార్జింగ్ చేసుకునే వెర్ష‌న్ కూడా ఉంది.
ధ‌ర ఎంతుండొచ్చు:  3,400 రూపాయ‌లు, లాప్‌టాప్ వెర్ష‌న్ అయితే  6,800.
ఎప్పుడొస్తుంది:  మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో

7)  డిష్ ఎయిర్‌

సెట్‌టాప్ బాక్సుల్లో పేరున్న డిష్  కంపెనీ డిష్ ఎయిర్ టీవీ అనే సెట్‌టాప్ బాక్సును ప్ర‌ద‌ర్శించింది. కార్డ్‌లెస్ గా ప‌ని చేసే ఈ సెట్‌టాప్ బాక్సు ఇంట‌ర్నెట్‌లో వ‌చ్చే కంటెంట్‌నే ఎయిర్ బ్రాడ్‌కాస్ట్ అయ్యే ప్ర‌సారాల‌ను కూడా గ్ర‌హిస్తుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే కేబుల్‌, శాటిలైట్ అవ‌స‌రం లేని సెట్‌టాప్ బాక్స్ ఇది అని కంపెనీ చెప్పుకొచ్చింది.
ధ‌ర ఎంత: 6,700

8) హువాయ్ హాన‌ర్ 6ఎక్స్‌

మొబైల్ ఫోన్ త‌యారీ కంపెనీ హువాయ్‌.. హాన‌ర్ 6ఎక్స్ పేరిట కొత్త మోడ‌ల్‌ను ఈ షోలో లాంచ్ చేసింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ట‌చ్ స్ర్కీన్‌తో వచ్చే ఈ ఫోన్ 32 జీబీ స్టోరేజీని క‌లిగి ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, రెండు రోజులపాటు నిలిచి ఉండే బ్యాట‌రీ ఉన్నాయి.
ధ‌ర ఎంత: 16,800
నేటి నుంచే ప్రీఆర్డ‌ర్ బుక్  చేసుకోవ‌చ్చు.

9) బిట్ డిఫెండ‌ర్ బాక్స్‌

యాంటీవైర‌స్ త‌యారీదారు బిట్‌డిఫెండ‌ర్ రెండో త‌రం ప‌రిక‌ర‌మైన బిట్‌డిఫెండ‌ర్ బాక్స్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టింది. వైఫై రూట‌ర్ వంటి హోం నెట్‌వ‌ర్క్ అప్ల‌యన్సెస్‌కు మాల్‌వేర్స్ నుంచి మ‌రింత భ‌ధ్ర‌త కల్పించేందుకు దీన్ని త‌యారుచేశారు. నెట్‌వ‌ర్క్ ట్రాఫిక్, నెట్ వ‌ర్క్ ఇంట్రూజ‌న్స్‌ను విశ్లేషించ‌డంలోనూ ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.
ధ‌ర ఎంత‌: ఇంకా నిర్ధ‌రించ‌లేదు.
ఎప్పుడొస్తుంది: ఈ ఏడాది చివ‌రికి..

10) మోటివ్ రింగ్‌

మోటివ్ రింగ్‌.. చేతికి పెట్ట‌కునే ఈ ఉంగ‌రం మీకు ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ హృద‌య స్పంద‌న రేటును, మీ నిద్ర‌ను, మీ ఒంట్లో ఉన్న కేల‌రీల‌ను గుర్తించి ఎప్ప‌టిక‌ప్ప‌డు హెచ్చ‌రిస్తుంది. మీరు చేయాల్సింద‌ల్లా ఈ రింగ్‌ను వేలికి పెట్టుకుని బ్లూ టూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు క‌నెక్ట్ చేయ‌డ‌మే. రింగ్ గుర్తించిన మీ ఫిట్‌నెస్ గుట్టంతా బ్లూ టూత్ ద్వారా ఫోన్‌లోకి వ‌చ్చేస్తుంది.
ధ‌ర ఎంత: 13,500
నేటి నుంచే ప్రీఆర్డ‌ర్ బుక్  చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు