• తాజా వార్తలు
  •  

టెక్ ఖర్చులు పెరుగుతున్నాయ్

ఒక మనిషి ఏటా సగటున దేనికెంత ఖర్చు చేస్తాడన్నది లెక్కేస్తే రోటీ, మకాన్, కపడాయే ప్రధానంగా కనిపిస్తాయి. అంటే, తిండి, ఉండడానికి(ఇంటద్దె లేదా ఇంటి రుణం ఈఎంఐ అనుకుందాం), దుస్తులు వంటి ప్రధాన అవసరాలకు ఖర్చు చేస్తారు. ఆపై చదువులు, ఆరోగ్యం వంటి ఖర్చులు ఉంటాయి. కానీ... మారుతున్న యుగంలో టెక్నాలజీ అవసరాలకు చేస్తున్న ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. పైగా ఇది ఏటేటా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు వంటి వాటిపై వినియోగదారులు చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది. ఈ వస్తువులపై వినియోగదారులు చేసే ఖర్చు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం పెరిగి 600 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్ట్నర్ వెల్లడించింది.
వినియోగదారులు కొత్త కొత్త ఉత్పత్తులు కొంటుండడం.. పైగా ఎక్కువ ఖరీదైనవి కొంటుండడం.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండడంతో ఈ ఖర్చు పెరుగుతోందని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరికరాలపై చేసే ఖర్చు 2016లో 587.2 బిలియన్ డాలర్లు ఉండగా, 2017లో అది 599.13 బిలియన్ డాలర్లకు, 2019లో 627.16 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గార్ట్నర్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే 2016తో పోలిస్తే పిసిలు, అల్ట్రా మొబైల్స్, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతులు మాత్రం యథాతథంగా అంటే 2.3 బిలియన్లుగానే ఉండవచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడింది.
ఎక్కడా తగ్గడం లేదు..
కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్ల సగటు అమ్మకం ధరలు ఈ ఏడాది రెండు కారణాల వల్ల 2శాతం దాకా పెరగనున్నాయని గార్ట్నర్ తెలిపింది. వాటిలో మొదటిది వీటిలో ఉపయోగించే పరికరాల ధరలు ఈ ఏడాది కూడా పెరగడం, ఫలితంగా ఈ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారి తీస్తోందని వెల్లడించింది. కొనుగోలుదారులు తక్కువ ధర ఉండే వాటికన్నా కూడా ఎక్కువ ఖరీదు ఉండే వాటి పట్లే మొగ్గు చూపుతుండడం రెండో కారణమని ఆ నివేదిక పేర్కొంది. వినియోగదారులు, వ్యాపారవేత్తలు తమ జీవన విధానానికి తగినట్లుగా ఉండే నాణ్యమైన ఉత్పత్తులనే కోరుకుంటున్నారని, అందువల్ల వారు ధరల గురించి ఆలోచించడం లేదని గార్ట్నర్ రిసెర్చ్ డైరెక్టర్ రంజిత్ అత్వాల్ అభిప్రాయ పడ్డారు.
మొబైల్స్ దే అధిక వాటా
మొత్తం ఖర్చులో 67 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొబైల్ ఫోన్స్ విభాగం 2017లో 400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. 2016తో పోలిస్తే ఇది 4.3 శాతం ఎక్కువ. కాగా, పిసిలు అంటే డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై వ్యయం ఈ ఏడాది 163.35 కోట్ల డాలర్లకు పెరగవచ్చని, ఆధునిక మొబైల్స్ పై వ్యయం 36.28 బిలయన్స్‌కు చేరుకోవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది.

జన రంజకమైన వార్తలు