• తాజా వార్తలు
  •  

టెక్ పండగకు సర్వం సిద్ధం

టెక్ పండగకు సర్వం సిద్ధం

  •  150 దేశాలు..
  •  3,800 సంస్థలు
  •  24 విభాగాలకు చెందిన ఉత్పత్తులు
  •  300 సమావేశాలు..
  •  1,65,000 మంది టెక్ ప్రతినిధులు
  •  7,545 మంది మీడియా ప్రతినిధులు
  •  24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రదర్శన..

ఇంత భారీ సెటప్ అంటే అది ఏమై ఉంటుంది..? కచ్చితంగా ఏదో భారీ సెటప్పే అయి ఉండాలి. ప్రపంచమంతా అక్కడికి కదలి వచ్చేస్తుండాలి. నిజమే... 150 దేశాల నుంచి ప్రాతినిధ్యం ఉండే భారీ ఈవెంట్ అది. అంతర్జాతీయ టెక్ పండగ. కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో-2017(సీఈఎస్-2017)... ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులంతా ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది.

ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నిర్వహించనున్న సీఈఎస్-2017(కన్జూమర్ ఎలక్ర్టానిక్స్ షో) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఏటా జనవరిలో నిర్వహించే ఈ ప్రదర్శనలో అనేక విభాగాలకు చెందిన కొత్త ఎలక్ర్టానిక్ ఉత్పత్తులను లాంచ్ చేస్తుంటారు. ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక షోకు రెడీ అయిపోయాయి.

కన్జ్యూమర్ టెక్నాలజీ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థల నుంచి చిన్నాచితకా సంస్థల వరకు అన్నీ ఇక్కడకొస్తాయి. తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. త్వరలో అందుబాటులోకి తేబోయే నూతన సాంకేతికతలనూ ఆవిష్కరిస్తాయి. సాంకేతిక రంగానికి చెందిన వందలాది సెమినార్లు.. సభలు, సమావేశాలు జరుగుతాయి.

ఎప్పుడు మొదలైంది..?
మొట్టమొదటిసారి సీఈఎస్ 1967లో న్యూయార్క్ లో జరిగింది. అంతకుముందు వరకు ఏటా షికాగోలో నిర్వహించే మ్యూజిక్ షోలోనే ఇలాంటి టెక్ ప్రదర్శనలు జరిగేవి. కానీ... తొలిసారి 1967లో ఇలా ప్రత్యేకంగా కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్ షోను నిర్వహించారు. అప్పట్లో 100 మంది ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.  ఆ తరువాత 1978 నుంచి 94 మధ్య ఏడాదికి రెండు సార్లు నిర్వహించేవారు. జనవరిలో లాస్ వెగాస్ లో.. జూన్ లో షికాగోలో నిర్వహించేవారు. 1995 నుంచి దాన్ని ఏడాదికి ఒకసారికే పరిమితం చేశారు.

2016లో..
గత ఏడాది ఈ ప్రదర్శనలో ఎక్కువగా వీఆర్ గేర్లను ప్రదర్శించారు. పలు చిన్న పోలరాయిడ్ కెమేరాలు, 4జీ మొబైల్స్; వెల్ నెస్ గాడ్జెట్లు, స్మార్టు వాచ్ లు వంటివన్నీ ప్రదర్శించారు. వాటిలో చాలావరకు అదే ఏడాది మార్కెట్లోకి వచ్చాయి.

ఈ ఏడాది ఏమేం ఉంటాయి..?
మొత్తం 24 విభాగాలకు చెందిన ఎలక్ర్టానిక్ ఉత్పత్తులు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. టీవీలు, కెమేరాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, మొబైల్స్, ఇతర స్మార్టు పరికరాలు, రోబోలు, ఆటోమేటిక్ కార్లు ఒకటేమిటి.. టెక్నాలజీకి సంబంధించిన అన్నటినీ ఇక్కడ లాంఛ్ చేయాలని చూస్తారు. ఇక్కడ లాంఛ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో అందరికీ చేరిపోతుంది.

పెద్ద కంపెనీలకు ప్రతిష్ఠాత్మకం..
సోనీ, శ్యాంసంగ్, ఎల్జీ, పానసోనిక్, యాపిల్, గూగుల్ వంటి దిగ్గజాలతో పాటు లీఎకో, టీసీఎల్, అల్కాటెల్ వంటివన్నీ వస్తాయి.

ఈసారి టెక్ కార్ల హల్ చల్
ఈ టెక్ పండుగలో ఈసారి ఎలక్ర్టానిక్ పరికరాలతో పాటు ఆటోమొబైల్ ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. అయితే.. ఇవన్నీ ఎలక్ర్టానిక్స్ తో ముడిపడి ఉన్నవే. ముఖ్యంగా డ్రైవర్ లెస్ కార్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ అవుతాయని భావిస్తున్నారు. గూగుల్, టెస్లా, ఫోర్డ్, యాపిల్ వంటి సంస్థలన్నీ డ్రైవర్ లెస్ కార్లను పరీక్షిస్తుండడం.. ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ ఈ ఏడాది అమెరికాలో డ్రైవర్ లెస్ ట్యాక్సీలను పూర్తిస్థాయిలో తిప్పాలని ప్రయత్నం చేస్తుండడంతో సీఈఎస్ లో ఈసారి వీటి హడావుడి ఉంటుందని అంచనావేస్తున్నారు.

వీఆర్ గేర్లూ హైలైటే..
నిజానికి 2016 ప్రదర్శనలో వీఆర్ గేర్లు హల్ చల్ చేశాయి. అనేక సంస్థలు తాము ఆ ఏడాదిలో వీఆర్ గేర్లను మార్కెట్లోకి తెస్తామంటూ ప్రదర్శనకు ఉంచాయి. కానీ.. లాంఛింగ్ లో చూపిన వేగం మార్కెట్లోకి పెనెట్రేట్ చేయడంలో చూపలేకపోయాయి. దీంతో ఈ ఏడాదీ పలు సంస్థలు వీర్ గేర్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. పైగా గత ఏడాది శాంసంగ్ వంటి సంస్థలు సూపర్ క్వాలిటీ వీఆర్ గేర్లను తీసుకురాగా ఎక్కడికక్కడ పలు దేశీయ సంస్థ.. చిన్నా చితకా టెక్ సంస్థలు కూడా రూ.వెయ్యి లోపే వీఆర్ గేర్లను తీసుకొచ్చేశాయి. దీంతో ఇందులో మరింత కొత్తదనం చూపడానికి కంపెనీలు ప్రయత్నం చేయొచ్చు.

యుటిలిటీ గ్యాడ్జెట్ల జోరు
ఇప్పుడంతా స్మార్టు టెక్నాలజీయే రాజ్యమేలుతున్నా మొబైల్స్ తో చాలా పనులు అయిపోతున్నా స్మార్టు వాచ్ లు, హెల్త్ గాడ్జెట్లు.. ఫిట్ నెస్, వెల్ నెస్ గ్యాడ్జెట్లు వస్తున్నాయి. అంతేకాదు... మొబైల్స్ కు యాక్సెసరీస్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి యాక్సెసరీస్, యుటిలిటీ గ్యాడ్జెట్స్ కూడా సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 శాంసంగ్ కు కీలకం..
2017 సీఈఎస్ దిగ్గజ సంస్థ శాంసంగ్ కు అత్యంత కీలకం. గత ఏడాది శాంసంగ్ దారుణ వైఫల్యాలు ఎదుర్కొంది.  ముఖ్యంగా గెలాక్సీ నోట్ 7 ఆ సంస్థ ఇమేజిని దారుణంగా డ్యామేజి చేసింది. ఈ మోడల్ గాడ్జెట్ల లోని బ్యాటరీలు చాలావరకు పేలిపోవడం సంచలనంగా మారింది. దీంతో మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో గ్యాడ్జెట్లను శాంసంగ్ ఉపసంహరించుకుంది. శాంసంగ్ వాషింగ్ మెషీన్లు కూడా పేలాయన్న వార్తలు 2016లో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఎస్ వేదికగా శాంసంగ్ తన ప్రతిష్ఠను నిలబెట్టుకునే ప్రయత్నం చేయనుంది.

జన రంజకమైన వార్తలు