• తాజా వార్తలు
  •  

రాజకీయం vs టెక్నాలజి

రాజకీయమంటేనే ఎత్తులు పై ఎత్తులు.. ఇక ఎన్నికల వేళ వ‌చ్చిందంటే చాలు ఎన్నో వ్యూహాలు, ఎన్నెన్నో స‌మీక‌ర‌ణాలు.. గెలుపు కోసం ప్రాంతాలు, వ‌ర్గాలు వారీగా ఏ ఓట‌ర్లు ఎంత మంది ఉన్నారో లెక్కగ‌ట్టుకుని వారిని ఆక‌ట్టుకునేలా హామీలు ఇవ్వ‌డం, తాయిలాలు పంచ‌డం  ప్ర‌తి ఎల‌క్ష‌న్స్‌లో చూస్తున్న‌వే. మా నాయ‌కుడికే ఓటేయండ‌ని కార్య‌క‌ర్త‌లు ఇల్లిల్లూ తిరిగేవారు ఒక‌ప్పుడు. త‌ర్వాత ఇదే మాట‌ను ఆడియో రికార్డ్ చేసి రిక్షాకో, ఆటోకో మైక్ క‌ట్టి ప్ర‌చారం చేసేవారు. పత్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు, టీవీల్లోయాడ్లు, పాంప్లేట్లు, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు .. ఇలా ఒక్కోసారి ఒక్కో త‌ర‌హా ప్ర‌చారం కొత్త‌గా వ‌స్తుంది. మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ల నాటికి అది పాత‌బ‌డిపోతుంది. కొత్త‌గా మ‌రో ర‌కం ప్ర‌చార సాధ‌నాలు, ప‌బ్లిసిటీ టెక్నిక్కులూ పుట్టుకొచ్చేస్తున్నాయి.  2004 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం తో ఎల‌క్ష‌న్ కాంపెయిన్ జ‌రిగింది. చాలా మందికి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వాయిస్‌తో ఫోన్ కాల్స్ వ‌చ్చేవి.  త‌మ పార్టీకి ఓటేయాల‌ని చంద్ర‌బాబు వాయిస్ కోర‌డం జ‌నం చాలా వింత‌గా చెప్పుకునేవారు.  2014 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో అంత‌కుముందు ఢిల్లీ అసెంబ్లీ ఎల‌క్షన్స్‌లో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ వెబ్‌సైట్లు హ‌వా చెలాయించాయి.

ఫేస్‌బుక్  ప్ర‌చారం

స్మార్ట్ ఫోన్లు త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి వ‌చ్చి. జ‌నం డేటా వినియోగానికి అల‌వాటుప‌డ్డాక  చాలా మందికి  ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. ఒకే స్కూల్లోనో చ‌దువుకున్న‌వాళ్లు, కాలేజీ ఫ్రెండ్స్‌, ఒకేచోట ప‌ని చేసేవాళ్లు, ఒకేలాంటి హాబీలు ఉన్న‌వారు, సాహిత్య‌ప్రియులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఇలా ర‌క‌ర‌కాల గ్రూప్‌లు వేల‌సంఖ్య‌లో పుట్టుకొచ్చాయి.  కుల సంఘాలు, ఫేవ‌రెట్ న‌టులు, ఊరూ వాడా బేస్డ్‌గానూ ఫేస్‌బుక్ గ్రూప్‌లు, పేజీలు వంద‌లు కాదు వేల సంఖ్య‌లో ఉన్నాయి.  దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని గ‌త ఎల‌క్ష‌న్స్‌లో  ఫేస్‌బుక్ వేదిక‌గా పార్టీలు,కేండిటేట్లు భారీగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ముఖులు  ఎన్నిక‌ల్లో మంచోళ్ల‌నే ఎన్నుకోవాల‌ని సందేశాలిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఏపీలో ప్రధాన రాజ‌కీయ పార్టీల‌యిన టీడీపీ,  వైసీపీల ఫేస్‌బుక్ వేదిక‌గా త‌మ క్యాడ‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు యాక్టివ్‌గా ఉంచుతున్నాయి. ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని వంద‌ల గ్రూప్‌లు, ప‌దుల సంఖ్య‌లో పేజీలు ప‌వ‌నిజం అనే భావ‌జాలంతో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వాట్సాప్‌

వాట్సాప్ వ‌చ్చాక గ్రూప్‌లు ఏర్పరుచుకోవ‌డం తేలికైపోయింది. ఫోన్ నెంబ‌ర్ల‌తో ట‌చ్‌లో ఉండే వారంతా నాలుగైదు ర‌కాల గ్రూప్‌ల్లో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్‌కు ఇది కూడా కీల‌క‌మ‌వుతుంది. ఒక‌రికి స‌మాచారం అందిస్తే అది క్ష‌ణాల్లో గ్రూప్ మొత్తం వైర‌ల్ అవుతోంది.  త‌మ లీడ‌ర్ల ప్ర‌చారం, వారి కామెంట్లు, గొప్ప‌త‌నం గురించి చాటుకోవ‌డానికి వాట్సాప్ మంచి ప్లాట్‌ఫాం గా మారింది.

ఓట్ల లెక్క తేల్చే సాఫ్ట్‌వేర్‌

ఇప్పుడు ఈ కాంపిటీష‌న్‌లోకి కొత్త‌గా వ‌చ్చింది ఓ సాఫ్ట్‌వేర్‌.  ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న బృహ‌న్ ముంబ‌యి కార్పొరేష‌న్ (బీఎంసీ).. ముంబయి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎల‌క్ష‌న్స్ కోసం ఔత్సాహిక ఎంట‌ర్‌ప్రెన్యూర్ ఒక‌రు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వెబ్‌సైట్‌లోని స‌మాచారం ఆధారంగా ప‌ని చేసే  ఈ సాఫ్ట్‌వేర్ ఏ ప్రాంతంలో ఏ వ‌ర్గం వారు ఎంత మంది ఓట‌ర్లున్నారు.. ఏ కులం వారు ఎంత మంది ఓట‌ర్లున్నారో చిటికెలో చెప్పేస్తుంద‌ట‌.  పార్టీ కేడ‌ర్ల ద‌గ్గ‌ర కూడా ఇలాంటి లెక్క‌లున్నా ఈసీ స‌మాచారంలా ప‌క్కాగా ఉండ‌దు.  దీంతో చాలా మంది కేండిడేట్లు ఈ సాఫ్ట్‌వేర్ కొనుక్కోవ‌డానికి ఆసక్తి చూపుతున్నారు.  కులం, మ‌తం, వ‌ర్గం వంటి ఆధారంగా ఓట్లు అడ‌గ‌డడం నేరం అని ఇటీవ‌లే సుప్రీంకోర్టు చెప్పింది.  ఈ నేపథ్యంలో ఈ త‌ర‌హా సాఫ్ట్‌వేర్ తీసుకురావడం స‌రికాద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో త‌ప్పేమీ లేదని, అభ్యర్థుల‌కు ఎన్నిక‌ల  ప్ర‌చార ప్ర‌ణాళిక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేందుకే దీన్ని తీర్చిదిద్దామ‌ని సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ చేసిన ఎంట‌ర్ ప్రెన్యూర్ చెబుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను మ‌రింత అభివృద్ధి చేసి ఒక భ‌వ‌నం లేదా కుటుంబంలో ఎన్ని ఓట్లున్నాయో కూడా తెలియ‌జెప్పేలా మారుస్తామంటున్నారు కూడా.  ఏదేమైనా ఈ సాఫ్ట్‌వేర్‌కు మంచి ఆద‌ర‌ణైతే ల‌భిస్తోంది. ఇప్ప‌టికి 300 మంది అభ్య‌ర్థులు ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకున్నార‌ట‌.  ముంబ‌యి మ‌హాన‌గ‌రం కావ‌డంతో అన్ని ప్రాంతాల వారు ఉంటారు. మ‌హారాష్ట్ర వారితోపాటు, ద‌క్షిణాదివారు, ఉత్త‌రాది ప్ర‌జ‌లు, గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు ఉంటారు. వారుండే చోట వారికి కావాల్సిన హామీలిస్తూ ఓట్ల‌డుగుతుంటారు.  కొత్త సాఫ్ట్వేర్తో  ఏ ఏరియాలో  ఏ వ‌ర్గం ఓట్లు ఎన్నున్నాయో ముందే తెలిస్తే ఆ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేలా హామీలిచ్చేసి ఓట్లు వేయించుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న వాళ్ల‌ది..

జన రంజకమైన వార్తలు