• తాజా వార్తలు
  •  

టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే క‌ట్టేస్తున్నాం.  క‌ట్ట‌ల కొద్దీ డ‌బ్బులు ప‌ట్టుకెళ్ల‌క్క‌ర్లేకుండానే ఒక్క క్లిక్‌తో డ‌బ్బులు పంపేస్తున్నాం. ఒక‌టా రెండా ఇప్పుడు మ‌నం అనుభ‌విస్తున్న అన్ని సౌక‌ర్యాల‌కూ టెక్నాల‌జీయే మూల‌సూత్రం.  మ‌రి ఇంత‌టి కీల‌క సెక్టార్లో అంతా మ‌గ‌మ‌హరాజుల‌దే రాజ్య‌మా? మ‌హిళ‌ల పాత్ర ఎంత ? త‌ర‌చి చూస్తే ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు క‌నిపిస్తున్నాయి.
 ఇండియాలో టెక్నాల‌జీ -బీపీఓ రంగంలో 39 ల‌క్ష‌ల మంది ఉద్యోగులుంటే అందులో 13 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లేన‌ని నాస్కామ్ ఇటీవ‌లే అధ్య‌య‌నం చేసి చెప్పింది. వీరిలో చాలా మంది ఉన్న‌త స్థానాల్లోనే ఉండ‌డం విశేషం. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే టెక్నాల‌జీ రంగ దిగ్గ‌జాలైన ఐబీఎం, హెచ్‌పీ మొద‌లు చాలా కంపెనీల్లో మ‌హిళ‌లు సీఈవో, సీఎఫ్‌వో వంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండ‌డం విశేషంగానే చెప్పుకోవాలి.  త‌మ ప‌నితీరు, శ‌క్తి సామ‌ర్థ్యాల‌తో ప్ర‌పంచ అత్యున్న‌త టెక్నాల‌జీ కంపెనీల్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న మొద‌టి 10 మంది మ‌హిళామ‌ణుల ప్రస్థానం ఇదిగో..
 1. షెరిల్ శాండ్‌బ‌ర్గ్ : ఫేస్‌బుక్ సీవోవో
 టెక్నాల‌జీ రంగంలో ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ లిస్ట‌వుట్ చేస్తే అందులో క‌చ్చితంగా షెరిల్ శాండ్‌బ‌ర్గ్ పేరు ఉండాల్సిందే. ప్ర‌పంచాన్ని ఏకం చేస్తున్న ఫేస్‌బుక్‌కు  ఈమె సీవోవోగా ఉన్నారు.  ఫేస్‌బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర‌యిన తొలి లేడీ షెరిలే.  ఈ సంస్థ‌లో చేర‌క‌ముందు షెరిల్ గూగుల్‌లో ప‌ని చేశారు. యునైటెడ్ స్టేట్స్ సెక్ర‌ట‌రీ ఫ‌ర్ ట్రెజ‌రీకి ఛీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కీల‌క బాధ్య‌తలు నిర్వ‌హించారు.  ప‌నిచేసే చోట జెండ‌ర్ గ్యాప్‌, మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌పై.. లీన్ ఇన్‌: ఉమెన్‌, వ‌ర్క్ అండ్ ద విల్ టు లీడ్ అనే పుస్త‌కాన్ని కూడా రాశారు.
 2. సుశాన్ వోజ్సిస్కీ :  యూట్యూబ్ సీఈవో
 యూట్యూబ్ తెలియ‌ని వారెవ‌రు ఉంటారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారంగా సామాన్యుడి నుంచి సామ్రాజ్య అధిపతుల వ‌ర‌కు అంద‌రినీ ఆక‌ట్టుకునే యూట్యూబ్‌ను న‌డిపిస్తున్న‌దీ ఒక మ‌హిళే.  1999లో గూగుల్‌లో మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా జాయిన‌యిన సుశాన్ కొన్నేళ్ల‌లోనే కంపెనీ అడ్వ‌ర్టైజింగ్ అండ్ కామ‌ర్స్ విభాగానికి సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.  యూట్యూబ్‌, డ‌బుల్ క్లిక్‌ల‌ను గూగుల్ వ‌శ‌ప‌ర‌చుకోవాల‌న్న ఐడియా కూడా ఆమెదే. ఈ రెండింటినీ గూగుల్ యాక్వైర్ చేసుకున్న త‌ర్వాత కొన్నేళ్ల‌పాటు వాటి బాధ్య‌త‌ల‌ను సుశానే చూశారు. 2014లో యూ ట్యూబ్ సీఈవోగా అపాయింట్ అయ్యారు. అప్ప‌టి నుంచి సంస్థ‌ను విజ‌యవంతంగా న‌డిపిస్తున్నారు.
  3. మార్గరెట్ వైట్మన్: హెచ్ పీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ప్రెసిడెంట్, సీఈవో
 హేవ్ల‌ట్ ప్యాక‌ర్డ్ (హెచ్‌పీ ) కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల్లో దిగ్గ‌జం. అలాంటి అత్యుత్త‌మ కంపెనీకి సీఈవోగా న‌డిపిస్తున్న మెగ్ విట్‌మ‌న్ కూడా మ‌హిళామ‌ణే. 2011 నుంచి హెచ్‌పీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ సీఈవోగా ప‌ని చేస్తున్న మెగ్ అంత‌కు ముందు ఎన్నో పెద్ద కంపెనీల్లోనూ త‌న ప‌నితీరును ఘ‌నంగా చాటుకున్నారు. 1980ల్లోనే వాల్ట్ డిస్నీ కంపెనీ స్ట్రాట‌జిక్ ప్లానింగ్ విభాగానికి వైస్ ప్రెసిండెంట్ గా ప‌ని చేశారు.  త‌ర్వాత డ్రీమ్ వ‌ర్క్స్, ప్రోక్ట‌ర్ అండ్ గాంబెల్, హ‌స్‌బ్రో వంటి పెద్ద కంపెనీల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 1998 నుంచి 2008 వ‌ర‌కు ప‌దేళ్ల‌పాటు ఈబే కి ప్రెసిడెంట్ అండ్ సీఈవో మెగ్ విట్‌మ‌నే. ఈబే ఫౌండేష‌న్‌, పీ అండ్ జీ, హెచ్‌పీ కంపెనీల‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గానూ ప‌నిచేశారు.
 4. గిన్నీ రొమెట్టీ: ఐబీఎం చైర్ పర్సన్, ప్రెసిడెంట్, సీఈవో
 గిన్నీ రొమెట్టీ.. ఈ పేరు మ‌న‌లో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ ఆమె ప్రెసిడెంట్, ఛైర్ ఉమ‌న్‌, సీఈవోగా బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్న ఐబీఎం కంపెనీ గురించి చెప్ప‌గానే ఆమె కార్య‌ద‌క్ష‌త ఏంటో మ‌న‌కు ఆటోమేటిగ్గా అర్ధ‌మైపోతుంది. 2011 నుంచి ఐబీఎంలో ఈ అత్యున్న‌త బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్ధంగా నిర్వ‌హిస్త‌న్న రొమెట్టీ సంస్థ‌లో అంచెలంచెలుగా ఎదిగారు.  వ్యాపార రంగ‌లో అత్యంత శ‌క్తివంత‌మైన 50 మంది మ‌హిళ‌ల‌తో ఫార్చ్యూన్ మ్యాగ‌జైన్  రూపొందించే జాబితాల వ‌రుస‌గా ప‌దేళ్ల‌పాటు స్థానం సంపాదించుకోవ‌డం ఆమె శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు నిద‌ర్శ‌నం.  ఫోర్బ్స్ 2014లో ప్ర‌క‌టించిన వ‌రల్డ్స్ 100 మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ జాబితాలోనూ రొమెట్టీకి ప్లేస్ ద‌క్కింది.
 5. ఏంజెలా అహ్రెండ‌స్‌:  సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్, యాపిల్‌
  ఏంజెలా అహ్రెండ‌స్‌.. ల‌గ్జ‌రీ బ్రాండ్ బ‌ర్‌బెర్రీకి సీఈవోగా 2006 నుంచి ఎనిమిదేళ్లు ప‌ని చేశారు. త‌ర్వాత టెక్నాల‌జీ దిగ్గ‌జం  యాపిల్‌లో  రిటైల్ అండ్ ఆన్‌లైన్ స్టోర్స్ విభాగానికి సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.  చేరిన కొన్నాళ్ల‌కే త‌న ప‌నితీరుతో సంస్థ మేనేజ్‌మెంట్‌ను మెప్పించారు. ఆ ఏడాదే యాపిల్ లో అత్య‌ధిక శాల‌రీ తీసుకునే ఎంప్లాయిగా ఎదిగారు. ఆమె వార్షిక వేత‌నం ఏకంగా 70 మిలియ‌న్ డాల‌ర్లు ( మ‌న రూపాయ‌ల్లో చెప్పాలంటే 467 కోట్లు).  బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బిజినెస్ ఎడ్వ‌యిజ‌రీ కౌన్సిల్‌లోనూ స్థానం ద‌క్కించుకోవ‌డం ఏంజెలా ప‌నితీరుకు మ‌చ్చుతున‌క‌.
 6. స‌ఫ్రా కాట్జ్‌, ఒరాకిల్ కో సీఈవో
 సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం ఒరాకిల్ విజ‌యాల్లో కీల‌క సూత్ర‌ధారి స‌ఫ్రా కాట్జ్‌..  ఇజ్రాయెల్‌లో పుట్టిన ఈ అమెరిక‌న్ ఆరేళ్ల‌కే అమెరికా వ‌చ్చేశారు.  బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టి అనతికాలంలోనే బ్యాంకింగ్ దిగ్గ‌జం హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్‌లో బోర్డ్ ఆఫ్  డైరెక్ట‌ర్ వ‌ర‌కు ఎదిగారు.  1999లో ఒరాకిల్‌లో జాయిన‌య్యారు.  2001క‌ల్లా  ఒరాకిల్‌ బోర్డ్  ఆఫ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌ర‌య్యారు. 2004లో ఏకంగా కంపెనీ ప్రెసిడెంట్ గా ఎదిగారు. 2014 నుంచి మార్క్ హ‌ర్డ్‌తో క‌లిసి కంపెనీ కో సీఈవోగా కొన‌సాగుతున్నారు.
 7. రూత్ పొర‌ట్‌: ఆల్ఫాబెట్ సీఎఫ్‌వో
 బ్రిటిష్ బోర్న్ అమెరిక‌న్ ఫైనాన్షియ‌ల్ ఎగ్జిక్యూటివ్ అయిన రూత్ పొర‌ట్ గూగుల్ సబ్సిడ‌రీ ఆల్ఫాబెట్ సీఈవోగా ప‌ని చేస్తున్నారు. మూడేళ్లుగా ఈ ప‌ద‌విలో ఉన్న రూత్‌కు గూగుల్ ఏడాదికి 70 మిలియ‌న్ల జీత‌భ‌త్యాలు చెల్లిస్తోందంటే ఆమె సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేయ‌వచ్చు. ఆల్ఫాబెట్‌కు ముందు రూత్ మోర్గాన్ అండ్ స్టాన్లీ కంపెనీకి ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఐదేళ్లు ప‌ని చేశారు.  ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన వ‌రల్డ్స్ 100 మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు.
 8. ఉర్సులా బ‌ర్న్స్‌:  జెరాక్స్ సీఈవో
 జెరాక్స్‌.. డాక్యుమెంట్ సొల్యూష‌న్స్ అండ్ స‌ర్వీసెస్‌, డాక్యుమెంట్ ప్రొడ‌క్ష‌న్ టెక్నాల‌జీలో 160 దేశాల్లో వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోన్న‌కంపెనీ.  ఈ కంపెనీ సీఈవో కూడా ఓ మ‌హిళా మ‌ణే కావ‌డం విశేషం.  1980లో చిరుద్యోగిగా జెరాక్స్‌లో చేరిన ఉర్సులా అప్ప‌టి నుంచి కంపెనీని విడిచిపెట్ట‌లేదు.  కార్పొరేట్ ప్ర‌పంచంలో ఒక సీనియ‌ర్ ఉద్యోగి ఇన్ని సంవ‌త్స‌రాల పాటు ఒకే కంపెనీలో కొన‌సాగ‌డం చాలా అరుదు.  జెరాక్స్ ప‌ట్ల ఆమెకున్న ఆ నిబ‌ద్ధ‌త‌, ప‌నిలో సామ‌ర్థ్యం ఉర్సులాను 2009 నాటికి సీఈవో స్థాయికి తీసుకొచ్చాయ‌ని చెబుతారు.  యూఎస్ ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌కు వైస్ ఛైర్‌ప‌ర్స‌న్ గా కూడా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.
 9. దేవయాని ఘోష్‌, ఇంటెల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్
 సెమీకండ‌క్ట‌ర్‌, కంప్యూట‌ర్ ప్రాసెస‌ర్ల త‌యారీలో దిగ్గ‌జంగా వెలుగొందుతున్న ఇంటెల్‌లో  సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్ గా స‌మ‌ర్థంగా బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు దేబ‌యాని ఘోష్‌.  ఇంటెల్ ద‌క్షిణాసియా రీజియ‌న్‌కు ఎండీగా కూడా ప‌ని చేస్తున్నారు. టెక్నాల‌జీ వాడ‌కాన్ని ఈ ప్రాంతంలో మ‌రింత పెంచ‌డం ద్వారా కంపెనీ బిజినెస్‌ను పెంచ‌డం దేబ‌యాని ల‌క్ష్యం. ఇందుకోసం ఆమె ద‌క్షిణాసియాలోని ప‌లు దేశాల ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు.   ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 50 మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా జాబితాలో ఘోష్‌ది 11వ స్థానమంటే ఆమె శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను అంచ‌నా వేయొచ్చు.
 10. వ‌నితా కుమార్‌, క్వాల్‌కామ్ వైస్ ప్రెసిడెంట్
 క్వాల్‌కామ్ టెక్నాల‌జీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్న వ‌నితాకుమార్ కంపెనీ కీల‌క వ్యూహ‌క‌ర్తల్లో ఒక‌రు.  మోడెం ఎస్‌డ  బ్ల్యూ ఇంట‌ర్‌ఫేస్ టెక్నాల‌జీ టీమ్‌ల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌డిపిస్తున్నారు.  వైర్‌లైస్ టెలికాం ఇండ‌స్ట్రీలో రెండు ద‌శాబ్దాల సుదీర్ఘ అనుభ‌వం వ‌నితా కుమార్ సొంతం.  ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్చ‌ర్‌, డిజైన్‌, డెవ‌ల‌ప్‌మెంట్ రంగాల్లో బాగా ప‌ట్టున్న వ‌నిత  కంపెనీకి ఆయా విభాగాల్లో కీల‌క వ్య‌క్తిగా మారారు. క్వాల్‌కామ్ 5జీ, సెల్యులార్ ఐవోటీ ఎస్‌డ‌బ్ల్యూ సాంకేతిక‌తకు రోడ్‌మ్యాప్ త‌యారుచేయ‌డంలో ప్ర‌ధాన‌పాత్ర పోషిస్తున్నారు.

 


జన రంజకమైన వార్తలు